ఎట్టకేలకు నెగ్గిన జైపూర్
జైపూర్: వరుసగా నాలుగు పరాజయాలతో డీలా పడినట్లు కనిపించిన డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. బెంగళూరు బుల్స్‌తో మంగళవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో జైపూర్ 36-23 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జస్వీర్ సింగ్, కుల్‌దీప్ సింగ్ రైడింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి తమ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో జైపూర్ జట్టు ఎనిమిది పాయింట్లతో లీగ్‌లో ఐదో స్థానంలో ఉంది.
ఆరంభంలో బెంగళూరు దూకుడుగా ఆడి 15-10తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో జైపూర్‌కు మరో ఓటమి తప్పదా అనిపించింది. కానీ జైపూర్ ఆటగాళ్లు కుల్‌దీప్, జస్వీర్ తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడారు. కుల్‌దీప్ ఒకే రైడ్‌లో మూడు పాయింట్లు సంపాదించి జైపూర్‌ను మళ్లీ మ్యాచ్‌లో నిలబెట్టాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించిన జైపూర్ అనూహ్యంగా 29-20తో తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.
బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్; ఢిల్లీ దబాంగ్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.