భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం తెచ్చిందెవరో తెలుసా? | first indian olympian to get an individual medal, dada saheb yadav | Sakshi
Sakshi News home page

భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం తెచ్చిందెవరో తెలుసా?

Published Thu, Aug 18 2016 3:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం తెచ్చిందెవరో తెలుసా?

భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం తెచ్చిందెవరో తెలుసా?

స్వతంత్ర భారతదేశంలో వ్యక్తిగత కేటగిరీలో భారతకు తొలి కాంస్య పతకాన్ని సాధించిన కశాబా దాదాసాహెబ్ జాదవ్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.

రియో ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్ భారత కీర్తి పతాకాన్ని వినువీధిలో ఎగరేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వతంత్ర భారతదేశంలో వ్యక్తిగత కేటగిరీలో భారతకు తొలి కాంస్య పతకాన్ని సాధించిన కశాబా దాదాసాహెబ్ జాదవ్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు భారత హాకీజట్టుకు మాత్రమే ఒలింపిక్స్ మెడల్ రాగా, వ్యక్తిగత ఈవెంట్‌లో అందులోనూ రెజ్లింగ్‌లోనే కాంస్య పతకాన్ని సాధించిన జాదవ్ స్వతంత్ర భారతావనికే వన్నెతెచ్చారు.

భారత్‌ లాంటి దేశంలో ఒలింపిక్స్‌కు ఎంపిక కావడమే కష్టం, ఈ పతకం తీసుకురావడం మరీ కష్టం. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఒలింపిక్స్ మెడల్ సాధించడమంటే మామూలు విషయం కాదు. 1948లో లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న జాదవ్, రెజ్లింగ్‌లో ఆరో స్థానంలో నిలిచి భారత ప్రతిష్ఠను నిలబెట్టారు. భారత్ నుంచి వ్యక్తిగత ఈవెంట్‌లో ఆ స్థానానికి వచ్చిన వాళ్లు అప్పటి వరకు ఎవరూ లేరు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు అకుంఠితంగా శ్రమించి 1952లో హెల్సింకిలో జరిగిన ఒలింపిక్స్‌లో ప్రపంచ దిగ్గజాలతో తలపడి కాంస్య పతకాన్ని సాధించారు.

పేద కుటుంబానికి చెందిన జాదవ్ అనేక కష్టనష్టాలకు ఓర్చి ఒలింపిక్స్ స్థాయికి ఎదిగారు. తండ్రి దాదాసాహెబ్ స్వయానా రెజ్లింగ్ కోచ్ కావడంతో ఐదో ఏట నుంచే జాదవ్ రెజ్లింగ్ నేర్చుకున్నారు. ఎనిమిదో ఏటనే లోకల్ ఛాంపియన్‌ను ఓడించడం ద్వారా గుర్తింపు పొందారు. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌కు ఎంపికవడం కూడా ఆయనకు కష్టమైంది. అవినీతి అధికారులు ఆయన్ని అడ్డుకున్నారు. అప్పుడు న్యాయం కోసం జాదవ్ పాటియాలా మహారాజును ఆశ్రయించారు. ఆ రాజు క్రీడాభిమాని అవడం వల్ల జాదవ్‌కు అండగా నిలబడి ఒలింపిక్స్ ఎంపికయ్యేలా చూశారు.

జాదవ్‌కు హెల్సింకి ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు చేతిలో డబ్బులు లేవు. ఆయన తల్లి దండ్రులు గ్రామస్థుల నుంచి విరాళాలు వసూలు చేశారు. అయినా సరిపడ డబ్బులు రాలేదు. జాదవ్ అప్పటికి చదువుతున్న రాజారామ్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. తన సొంత ఇంటిని తాకట్టుపెట్టి మరీ ఆ ప్రిన్సిపాల్ డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుతో ఒలింపిక్స్ వెళ్లి వచ్చిన యాదవ్, దేశంలో పలుచోట్ల రెజ్లింగ్ పోటీలను నిర్వహించి వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో తనకు ఆర్థిక సహాయం అందించిన ప్రిన్సిపల్ ఇంటిని తనఖా నుంచి విడిపించారు.

మహారాష్ట్రలోని సతారా జిల్లా, గోలేశ్వరం గ్రామంలో , జనవరి 26, 1926లో జన్మించిన జాదవ్ స్వాతంత్య్ర సమర యోధుడు కూడా. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement