ఆ టెక్నిక్ ను టీ20లో చూపించాడు
ఇన్నాళ్లూ ఐపీఎల్ మెరుపులతో భారత అభిమానులకు దగ్గరైన వెస్టిండీస్ క్రికెటర్లు... ఈసారి టి20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతూ భారత అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అద్భుత విజయం సాధించారు. మొదటి మ్యాచ్లో క్రిస్ గేల్ విజృంభింస్తే, రెండో మ్యాచ్లో ఫ్లెచర్ (64 బంతుల్లో 84 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. అయితే ఆ మ్యాచ్లో ఫ్లెచర్ తనకున్న ఫుట్ బాల్ నైపుణ్యాన్ని కూడా ఆ ప్రదర్శించి ఔట్ నుంచి తెలివిగా తప్పించుకున్నాడు.
శ్రీలంక విసిరిన 123 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో 16వ ఓవర్లో బౌలర్ వేసిన బంతిని ప్లెచర్ బౌండరీకి తరలించే యత్నం చేశాడు. అయితే బాల్ ఎడ్జ్ అవ్వడంతో పైకి ఎగిరి వికెట్ల వైపు దూసుకుపోతోంది. దీన్ని గమనించిన ప్లెచర్ సమయోచితంగా వెంటనే కాలుతో బంతిని పక్కకు తన్నేశాడు. కొద్దిగా ఆలస్యం అయినా బంతి వికెట్లపై పడి ఔటయ్యే వాడు. తృటిలో ఔట్ నుంచి తప్పించుకున్న ప్లెచర్ పరుగుల వరద పారించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా పొందాడు. సదరు వీడియో చూసిన తర్వాత, ఫ్లెచర్ సరదాగా ఆడే ఫుట్ బాల్ ఆట క్రికెట్లో ఈ విధంగా ఉపయోగపడిందనుకుంటా.. అని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి.