
న్యూఢిల్లీ: గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లతో దిగ్గజాల సరసన నిలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ తాజాగా ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారించాడు. గాయాల బారిన పడకుండా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతకం సాధించాలంటే వందశాతం ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది పాల్గొనే ప్రతి టోర్నీలోనూ గాయాల పాలవకుండా అత్యుత్తమ ఆటను ఆడాలనుకుంటున్నానని 25 ఏళ్ల శ్రీకాంత్ చెప్పాడు.
‘ప్రస్తుతం ఫిట్‌నెస్ కాపాడుకోవడమే నాముందున్న అతిపెద్ద చాలెంజ్. ఒలింపిక్స్ తర్వాత కుడి మడమ, గతేడాది ఎడమ మడమ గాయాలతో ఇబ్బంది ఎదురైంది. ఈ ఏడాది నాలుగు, ఐదు టోర్నమెంట్‌లు నాకు చాలా కీలకం. అందుకే జాగ్రత్తగా ఉంటున్నా. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టా’ అని శ్రీకాంత్ వివరించాడు. గతేడాది అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ హైదరాబాద్ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియన్ ఓపెన్ టైటిళ్లను సాధించి తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ ఏడాది ఈ నాలుగు టైటిళ్లను నిలబెట్టుకోవాలనే ఒత్తిడి తనపై లేదని, ప్రస్తుతం ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీకాంత్ పేర్కొన్నాడు. ‘గతేడాది ప్రదర్శనను పునరావృతం చేయాలని అనుకోవట్లేదు. ఈ ఏడాది ప్రత్యేక లక్ష్యాలను పెట్టుకున్నాను.
ఒకటి కామన్వెల్త్‌లో పతకం సాధించాలనుకున్నా. రెండోది ఆసియా క్రీడల్లో. ఈ రెండు టోర్నీలు చాలా ముఖ్యమైనవి. ప్రతి ఏడాది ఆడేందుకు కుదరదు. మొదటి లక్ష్యం చేరుకున్నా. ఇక ఆసియా క్రీడలు మిగిలిఉన్నాయి. ఇందులో పతకం కోసం మరో నాలుగేళ్లు నేను వేచి ఉండలేను. అప్పుడు ఈ క్రీడలకు అర్హత సాధిస్తానో లేదో కూడా తెలియదు. బ్యాడ్మింటన్‌లో పోటీ బాగా పెరిగింది. అందుకే ఇప్పుడే పతకం సాధించేయాలి. వరల్డ్ చాంపియన్‌షిప్‌పై కూడా నా దృష్టి ఉంది. ప్రపంచ చాంపియన్ అనే హోదా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. కొన్ని సూపర్ సిరీస్ టోర్నీల్లోనూ రాణించాల్సి ఉంది’ అన్నాడు. మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్ టోర్నీల్లో పాల్గొంటానన్న శ్రీకాంత్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment