మాడ్రిడ్ : కరోనా వైరస్ సోకి స్పానిష్ పుట్‌బాల్ కోచ్ మృతి చెందడం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 21 ఏళ్ల ఫ్రాన్సిస్కో గార్సియా అనే పుట్‌బాల్ యువ కోచ్ వైరస్ కారణంగా సోమవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన ప్రస్తుతం అట్లెటికో పోర్టాడా ఆల్టా పుట్‌బాల్ టీంకు కోచ్‌కు వ్యవహరిస్తున్నాడు. గార్సియా గతకొంత కాలంగా లుకేమీయాతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యులు మెరుగైన చికిత్సకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కోచ్ మృతిపై టీం మేనేజ్‌మెంట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గార్సియా మృతి చెందడం తీవ్ర విషాదమని, దురదృష్టకరమని తెలిపింది. అతని సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. (తల్లి నుంచి బిడ్డకు ‘కోవిడ్’ రాదు)
యువ కోచ్‌ను కరోనా కబలించడంతో దేశ క్రీడా రంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా కోవిడ్ కారణంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 345 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి ఆ దేశంలో వైరస్ కేసుల సంఖ్య పదివేలకు చేరుకుంది. వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో అతి తక్కువ వయసు వ్యక్తి గార్కియా కావడం విచారం. మరోవైపు కరోనాను కట్టడి చేసేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. కరోనా క్రీడా రంగాన్ని సైతం చుట్టుముట్టడంతో దేశంలో జరిగే అన్ని టోర్నీలను రద్దు చేసింది. మాల్స్, విహారయాత్రలపై ఆంక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment