
ముంబై: ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా రెండో విజయంతో ఫైనల్ చేరింది. నాలుగు దేశాల ఈ టోర్నీలో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 3–0తో కెన్యాపై జయభేరి మోగించింది. వందో మ్యాచ్ ఆడుతున్న భారత కెప్టెన్ సునీల్ చెత్రికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో అతను చెలరేగాడు. మ్యాచ్‌లో రెండు గోల్స్ (68వ ని., 90+1వ ని.లో; ఇంజూరీ టైమ్) చేశాడు. మరో గోల్‌ను స్ట్రయికర్ జెజె లాల్‌పెఖువా (71వ ని.) సాధించాడు.
తొలి అర్ధభాగం ముగిసేదాకా ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ద్వితీయార్ధంలో భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదునుపెట్టారు. ‘డి’ ఏరియాలో చెత్రిని ప్రత్యర్థి ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ భారత్‌కు పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని చెత్రి 68వ నిమిషంలో విజయవంతంగా సాధించడంతో స్టేడియం ఒక్కసారిగా చెత్రి చెత్రి... కెప్టెన్ కెప్టెన్ అంటూ ఊగిపోయింది. తర్వాత నిమిషాల వ్యవధిలోనే గోల్స్ నమోదు కావడంతో భారత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
నిండింది... అభిమానంతో: చెత్రి భావోద్వేగ వీడియో ప్రకటనతో మ్యాచ్‌కు ముందు రోజు సెలబ్రిటీలు స్పందిస్తే... మ్యాచ్ రోజు అభిమానులు హోరెత్తించారు. దీంతో ముంబై ఫుట్‌బాల్ ఎరెనా స్టేడియం సాకర్ ప్రియులతో నిండిపోయింది. కేవలం ముంబై నగరవాసులే కాదు... 70 కి.మీ. దూరంలో ఉన్న బద్లాపూర్ (థానే జిల్లా) పట్టణం నుంచి కూడా ప్రేక్షకులు రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment