
ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆదుకోండి!
చాలా మంది కష్టాల్లో ఉన్నారు
ప్రభుత్వానికి మాజీ ఆటగాళ్ల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్‌కు అనేక మంది గొప్ప ఆటగాళ్లను అందించిన ఘన చరిత్ర హైదరాబాద్ నగరానికి ఉందని, ఇప్పుడు ఇక్కడ ఆట నామరూపాల్లేకుండా పోవడం విషాదమని ఒలింపియన్, అడ్మినిస్ట్రేటర్ సయ్యద్ షాహిద్ హకీమ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందినవారు 15 మంది ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారని, వారిలో ఏ ఒక్కరిని కూడా ప్రభుత్వం గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అబిడ్స్‌లోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో మరో ఒలింపియన్ హమీద్‌తో కలసి ఆయన మాట్లాడారు. ‘భారత్ నుంచి నలుగురు ఫుట్‌బాలర్లు ఒలింపిక్స్‌లో ఆడితే అందులో ముగ్గురు హైదరాబాదీలే. 1948 నుంచి 1982 మధ్యలో భారత ఫుట్‌బాల్ జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో వీరంతా కీలక పాత్ర పోషించారు.
కానీ వీరెవరికీ కనీసం గుర్తింపు దక్కలేదు. వీరు ఎలాంటి అవార్డులకు కూడా నోచుకోలేదు. కనీస ఆర్థిక సహాయం కూడా లభించడం లేదు. ఇలాంటివారికి తెలంగాణ ప్రభుత్వం కనీసం హెల్త్‌కార్డ్‌లాంటి సౌకర్యం అయినా ఇవ్వాలి’ అని హకీమ్ అన్నారు. ప్రభుత్వం సహకరిస్తే హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కు పునరుజ్జీవం తెచ్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆటగాళ్లు అలీమ్, షమీమ్, లాయఖ్, సీనియర్ వ్యాఖ్యాత నోవీ కపాడియా పాల్గొన్నారు.
ఫుట్‌బాలర్ల ‘హాల్ ఆఫ్ ఫేమ్’...
భారత్‌లో అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో దిగ్గజ ఆటగాళ్లను స్మరించుకునేందుకు మాజీ ఆటగాళ్లు, ఔత్సాహికులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌లో ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పేరుతో న్యూఢిల్లీలో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఆటగాళ్లు, కోచ్‌లుగా కూడా తమదైన ముద్ర చూపించిన వ్యక్తుల ఫొటోలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మాజీ రంజీ క్రికెటర్, ఫుట్‌బాల్ అభిమాని అయిన వసీం అల్వీ ఇందు కోసం 1948–82 మధ్య ఫుట్‌బాల్‌తో అనుబంధం ఉన్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఆటకు దూరమైన లేదా ఇప్పటికే మరణించిన వ్యక్తుల కుటుంబానికి చెందిన వారైనా ఆయా ఆటగాళ్ల వివరాలను ఇందు కోసం తమకు పంపాలని వారు కోరుతున్నారు. సంబంధీకులు email: waseem.alvi@gmail.com (లేదా) syedhakim.olympian@ yahoo.comకు పంపవచ్చు.