భారత మాజీ క్రికెటర్ కర్సాన్కు గుండెపోటు
షిమోగా:భారత మాజీ క్రికెటర్ కర్సాన్ ఘావ్రీ(65) గుండె పోటుకు గురయ్యారు. ఆదివారం ఉదయం కర్సాన్ ఆకస్మికంగా గుండె పోటుకు లోను కావడంతో అతన్ని స్థానిక ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డా.పీవీ శెట్టి సోమవారం ధృవీకరించారు. గుండె పోటు వచ్చిన వెంటేనే కర్సాన్ను ఆస్పతికి తరలించి అత్యవసర చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఏంజియోప్లాస్టీ చికిత్స చేసిన తరువాత కర్సాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం వెస్ట్జోన్ అండర్ -19 జట్టుకు కోచ్ గా ఉన్న కర్సాన్.. 1970-80 మధ్య కాలంలో భారత బౌలింగ్ దిగ్గజం కపిల్దేవ్తో కొత్త బంతిని పంచుకున్నారు. కర్సాన్ 39 టెస్టు మ్యాచ్లు, 19 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 109 వికెట్లు తీసిన కర్సాన్.. నాలుగు సార్లు ఐదేసి వికెట్లను సాధించారు.