విండీస్ మాజీ క్రికెటర్ మృతి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఆండీ గాంట్యూమ్ (95) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గాంట్యూమ్ బుధవారం మృతి చెందారు. గత నెల్లో 95 ఒడిలోకి అడుగుపెట్టిన గాంట్యూమ్ మృతిపట్ల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూసీబీ) ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ట్రినిడాడ్-టోబాగో జట్టులో గాంట్యూమ్ ఒక ఆణి ముత్యమని కొనియాడింది. అతని క్రికెట్ జ్ఞాపకాలు ఎప్పటికీ విండీస్ జట్టుతో ఉంటాయని క్రికెట్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరూన్ సంతాపం ప్రకటించారు. గాంట్యూమ్ దేశం తరపున ఒకే టెస్టు మాత్రమే ఆడి శతకం సాధించడం తమ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
1948 లో విండీస్ తరపున ఏకైక టెస్టు ఆడి శతకం సాధించిన అరుదైన ఘనతను గాంట్యూమ్ సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్లో గాంట్యూమ్ 112 పరుగులు నమోదు చేశాడు. ఇదిలా ఉండగా, ఆండీ గాంట్యూమ్ 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 34. 00 సగటుతో 2,785 పరుగులు చేశారు. ఇందులో ఐదు సెంచరీలు ఉండటం విశేషం. వెస్టిండీస్ జట్టుకు సెలక్టర్ గా, మేనేజర్గా గాంట్యూమ్ పనిచేశారు.