
ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్
మార్సెల్లీ: ఆఖర్లో వచ్చిన అవకాశాలను నేర్పుగా ఒడిసిపట్టుకున్న ఫ్రాన్స్... యూరోలో ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 2-0తో అల్బేనియాపై నెగ్గి నాకౌట్ దశకు చేరుకుంది. ఫ్రాన్స్ తరఫున ఆంటోని గ్రిజ్‌మన్ (90వ ని.), దిమిత్రి పయెట్ (90+6)లు గోల్స్ చేశారు. కోచ్ దిదిర్ డెస్‌చాంప్స్ వ్యూహాత్మకంగా సెంట్రల్ మిడ్‌ఫీల్డర్ పోగ్బా, ఫార్వర్స్ గ్రిజ్‌మన్‌లను సబ్‌స్టిట్యూట్‌గా తేవడం ఆతిథ్య జట్టుకు కలిసొచ్చింది.
మ్యాచ్ మొత్తం పటిష్టమైన రక్షణశ్రేణితో ఫ్రాన్స్ దాడులను నిలువరించిన అల్బేనియా... గోల్స్ అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయింది. చివరి ఆరు నిమిషాల్లో ఫ్రాన్స్ ఆటగాళ్లు చేసిన మ్యాజిక్‌ను కూడా నిలువరించలేకపోయింది.