France On Fire: Why A Developed Country Is In Such Turbulence - Sakshi
Sakshi News home page

France Riots - ఫ్రాన్స్​లో విధ్వంసానికి అదే కారణమా?  

Published Mon, Jul 10 2023 1:55 PM | Last Updated on Mon, Jul 10 2023 3:49 PM

France On Fire Why A Developed Country Is In Such Turbulence - Sakshi

పారిస్: జూన్ 27న ఒక ముస్లిం యువకుడిని స్థానిక  ట్రాఫిక్ పోలీసులు కాల్చి చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. అభివృద్ధికి చెందిన ఫ్రాన్స్ లాంటి దేశం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు కుదేలైపోవడమే ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తుంది. అసలు ఫ్రాన్స్​లో ఈ పరిస్థితులు ఏర్పడటానికి కారణమేంటి?   

అసలేం జరిగిందంటే.. 
జూన్ 27న 17 ఏళ్ల నాహేల్ మెరెజోక్ ను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడన్న కారణంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని కాల్చి చంపడంతో వివాదానికి తెరలేచింది. పోలీసుల విచారణలో అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని పైగా నేర చరిత్ర కూడా ఉందని తేలింది. ఆ ప్రకారం చూస్తే నేరస్తులు ఎవరైనా తమ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వారిని కాల్చవచ్చని  2017లో అమల్లోకి వచ్చిన ఒక ఫ్రాన్స్ చట్టం చెబుతోంది.

టెర్రరిస్టులపై వారు ఇదే చట్టాన్ని అమలు చేస్తుంటారు. అదే చట్టాన్ని నాహేల్ పై కూడా ప్రయోగించినట్లు సమర్ధించుకుంటున్నారు పోలీసులు. వలసదారుల విషయంలో వారు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటారు.. కాబట్టి అన్నీ తెలిసే వారు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు.   

ప్రధాన కారణమిదే.. 
ఫ్రాన్స్ దేశ జనాభా మొత్తం 67 మిలియన్లయితే అందులో వలసదారుల జనాభా సుమారు 4.5 మిలియన్లు ఉంటుంది. ఆతిధ్య దేశం కనికరిస్తే స్థానికంగా జీవనం కొనసాగించడానికి మాత్రమే అన్నట్టుగా మొదలైన వలసదారుల ప్రయాణం హక్కులు, సమానత్వం అంటూ రెక్కలు విచ్చుకుంటూ సాగింది. 

ఫ్రెంచి విప్లవం ప్రభావం.. 
1789లో ఉవ్వెత్తున ఎగిసిన ఫ్రెంచి విప్లవం వలసదారుల్లో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం పేరిట జరిగిన ఆ ఉద్యమం వలసదారులపై పెను ప్రభావం చూపింది. హక్కుల కోసం పోరాడాలన్న సంకల్పాన్ని వారిలో పుట్టించింది. 

వారెందుకలా.. వీరెందుకిలా.. 
ప్రపంచంలో ఎక్కడైనా వలదారులు దేశాలు బయలు వెళ్ళడానికి మూడే ప్రధాన కారణాలను చూడవచ్చు. యుద్ధం, రాజకీయ సంక్షోభం, కటిక దారిద్య్రం. ఈ నేపథ్యంతో వచ్చిన వారిని ఆతిధ్య దేశాలు మొదటిగా సానుభూతితో స్వాగతిస్తుంటాయి. అలాగే చౌకగా పనివారు దొరుకుతారన్న ఆర్ధిక ప్రయోజనంతో కూడా ఆహ్వానిస్తూ ఉంటారు.

అక్కడ మొదలైంది.. 
ఇక్కడే ఒకటి కొంటే ఒకటి ఉచితమన్న ఫార్ములా అమల్లోకి వస్తుంటుంది. మొదట్లో మెతకగా ఎంట్రీ ఇచ్చిన వలసదారులు కొన్నాళ్ళకో.. కొన్నేళ్ళకో.. మాక్కూడా పౌరసత్వం కావాలని, సమాన హక్కులు కల్పించమని కోరుతూ ఉంటారు. అందుకు ఆయా దేశాలు అంగీకరిస్తే ఎటువంటి సమస్యలూ ఉండవు. కానీ వారు అలా అంగీకరిస్తే స్థానికంగా ఉంటున్నవారికి కొత్త సమస్యలు తీసుకొచ్చినట్టేనని వెనకడుగు వేస్తూ ఉంటారు. 

పెరిగిన మైనారిటీ జనాభా..  
మత విభేదాలు సృష్టించినంతగా జాతి విభేదాలు హింసను ప్రేరేపించకపోవచ్చని నమ్మే ఫ్రాన్స్ దేశం వలసదారులు అక్కడి నియమాలను పాటించాలని, చట్టాలను గౌరవించి ఆచార వ్యవహారాలను పాటించి జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుతూ వచ్చింది. అందుకు అంగీకరించిన నేపథ్యంలోనే ఫ్రాన్స్​లో కేథలిక్ జనాభా తర్వాత ముస్లిం జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. 

అత్యుత్తమ పౌరులు.. 
1960ల్లో ఉత్తర ఆఫ్రికా నుండి వలస వచ్చిన ముస్లిం జనాభా ఆనాడు ఫ్రాన్స్ కట్టుబాట్లకు లోబడి చక్కగా ఒదిగిపోయారు. కానీ తర్వాతి తరం వలసదారుల్లో ఈ క్రమశిక్షణ తగ్గుతూ వచ్చింది. ఇది మా సొంత దేశం కాదన్న ధోరణి మొదటి తరంలో ఉన్నంతగా తర్వాతి తరాల్లో లేదు. వలసదారులమన్న భావన కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడైతే మేము వలసదారులమన్న ఆలోచన కూడా అత్యధికులు మర్చిపోయారు. 

పెరుగుతోన్న విపరీతవాదం.. 
ఇక ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న మరో పెనుభూతం ఇస్లాం రాజకీయవాదం.. తాజాగా ఫ్రాన్స్ దేశాన్ని ఇబ్బంది పెట్టిన ఈ సమస్యతో ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. హింసాత్మక సంఘటనలను ప్రేరేపిస్తూ దొరికిందే అవకాశంగా విపరీతవాదం పేట్రేగిపోతోంది. 

పెరుగుపోతున్న ఈ హింస కారణంగానే ఫ్రాన్స్ దేశం కొన్ని కఠిన నియమాలను, చట్టాలను అమలు చేస్తూ వచ్చింది. తలపాగా నిషేధం, చార్లీ హెబ్డో కార్టూన్లు నిషేధం ఈ కోవలో చేసినవే. ఫ్రాన్స్ దేశం వారు తమ చట్టాలను కఠినంగా అమలు చేయబట్టే జూన్ 27న నాంటెర్రే సంఘటన కూడా చోటు చేసుకుంది. దానిని అనుసరిస్తూనే దేశవ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. 

ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ..     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement