‘ఫ్రెంచ్’ ఫైనల్లో నాదల్, జొకోవిచ్
పారిస్: అంచనాలకు అనుగుణంగా రాణించిన రాఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్‌లో అంతిమ సమరానికి సిద్ధమయ్యారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6-3, 6-2, 6-1తో ఏడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను చిత్తు చేయగా... ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ జొకోవిచ్ 6-3, 6-3, 3-6, 6-3తో 18వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా)పై గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో టాప్ సీడ్, రెండో సీడ్ క్రీడాకారులిద్దరూ ఫైనల్‌కు చేరుకోవడం ఇది 15వసారి కావడం విశేషం. ఫైనల్ ఆదివారం జరుగుతుంది. ఒకవేళ నాదల్ నెగ్గితే అతని ఖాతాలో తొమ్మిదో ‘ఫ్రెంచ్’ టైటిల్ చేరుతుంది. జొకోవిచ్ గెలిస్తే మాత్రం ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవడంతోపాటు ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత పూర్తి చేసుకుంటాడు.
అలవోకగా...
టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన నాదల్‌కు సెమీఫైనల్లో ఆండీ ముర్రే నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. మట్టికోర్టులపై తనకెంత పట్టు ఉందో నిరూపిస్తూ నాదల్ గంటా 40 నిమిషాల్లో ఈ మ్యాచ్‌ను ముగించాడు. ముర్రే సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన నాదల్ మ్యాచ్ మొత్తంలో తన ప్రత్యర్థికి కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. మరోవైపు ముర్రేకు ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా రాలేదు.
సెమీఫైనల్ చేరే క్రమంలో ‘స్విస్ దిగ్గజం’ ఫెడరర్‌ను, ఆరో సీడ్ బెర్డిచ్‌ను ఓడించిన గుల్బిస్ ఆటలు జొకోవిచ్ ముందు సాగలేదు. 2 గంటల 36 నిమిషాలపాటు జరిగిన ఈ సెమీఫైనల్లో జొకోవిచ్ తొలి రెండు సెట్‌లలో పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మూడో సెట్‌లో కాస్త తడబడినప్పటికీ వెంటనే తేరుకొని నాలుగో సెట్‌లో మ్యాచ్‌ను ముగించి రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు.