వావ్రింకా, ముర్రే జోరు
క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ
పారిస్: మ్యాచ్ మ్యాచ్‌కూ తన ఆటతీరును మెరుగుపర్చుకుంటున్న మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)... ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ వావ్రింకా 7–5, 7–6 (9/7), 6–2తో 15వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... టాప్ సీడ్ ముర్రే 6–3, 6–4, 6–4తో ఖచనోవ్ (రష్యా)ను ఓడించాడు. మోన్‌ఫిల్స్‌తో రెండు గంటల 43 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మోన్‌ఫిల్స్ ఓటమితో ఈ టోర్నీలో ఫ్రాన్స్ ఆటగాళ్ల పోరాటం ముగిసింది. 1983లో యానిక్ నోవా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచాక... 1988లో హెన్రీ లెకొంటె ఫైనల్‌కు చేరిన తర్వాత ఇప్పటివరకు ఈ టోర్నీలో ఫ్రాన్స్ నుంచి మరో క్రీడాకారుడు ఫైనల్‌కు చేరలేకపోయాడు.
గతేడాది రన్నరప్‌గా నిలిచిన ముర్రే తాజా విజయంతో తన కెరీర్‌లో 650 విజయాలు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 15వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. మరోవైపు ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), ఎనిమిదో సీడ్ కీ నిషికోరి (జపాన్), డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నిషికోరి 0–6, 6–4, 6–4, 6–0తో వెర్డాస్కో (స్పెయిన్)పై, జొకోవిచ్ 7–6 (7/5), 6–1, 6–3తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై, థీమ్ 6–1, 6–3, 6–1తో జెబలాస్ (అర్జెంటీనా)పై నెగ్గగా... సిలిచ్ 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అండర్సన్ (దక్షిణాఫ్రికా) గాయంతో వైదొలిగాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో నిషికోరితో ముర్రే; సిలిచ్‌తో వావ్రింకా; కరెనో బుస్టాతో నాదల్; థీమ్‌తో జొకోవిచ్ తలపడతారు.
సానియా జంట ఓటమి
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న–దబ్రౌస్కీ ద్వయం 6–3, 6–4తో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)–డోడిగ్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది.
క్వార్టర్స్‌లో ప్లిస్కోవా, హలెప్
మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), మూడో సీడ్ హలెప్ (రొమేనియా), 28వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో హలెప్ 6–1, 6–1తో నవారో (స్పెయిన్)పై, స్వితోలినా 4–6, 6–3, 7–5తో మార్టిక్ (క్రొయేషియా)పై, గార్సియా 6–2, 6–4తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై, ప్లిస్కోవా 2–6, 6–3, 6–4తో వెరోనికా (పరాగ్వే)పై గెలిచారు.