వారికి ఈడెన్ 'వికెట్' అనుకూలించింది!
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆదివారం గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో తమ జట్టు ఓటమి పాలు కావడానికి ఈడెన్ గార్డె న్ వికెట్ తాజాగా ఉండటమే ప్రధాన కారణమని కోల్ కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు. అంతకుముందు రాత్రి వర్షం పడటం వల్ల వికెట్ కొత్తదనాన్ని సంతరించుకుని గుజరాత్కు లాభించిందన్నాడు. ఆ వికెట్ పై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయడంతో తాము కష్టాల్లో పడినట్లు చావ్లా తెలిపాడు. తమ జట్టు 24 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరును నమోదు చేయలేకపోయామన్నాడు.
'వికెట్ తాజాగా ఉంది. అందుచేత ఫస్ట్ బ్యాటింగ్ మాకు అనుకూలించలేదు. మ్యాచ్ ఆరంభంలోనే కొన్ని కీలక వికెట్లును చేజార్చుకుని ఇబ్బందుల్లో పడ్డాం. ఆపై తేరుకుని గౌరవప్రదమైన స్కోరును చేయడం నిజంగా అభినందనీయమే. మా ఓటమికి చాలా కారణాలున్నా, కొన్ని సందర్భాల్లో చివరి ఓవర్లలో బౌలింగ్ కూడా సరిగా లేదు. గత పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మా లక్ష్యాన్ని కాపాడుకుని స్వల్ప తేడాతో గెలిచాం. అన్నిసార్లూ పరిస్థితి ఒకేలా ఉండదు. ఇది టీ 20 ఫార్మాట్ కావడంతో బంతికి ఒక పరుగు సాధించడం కష్ట సాధ్యమేమీ కాదు' అని పీయూష్ తెలిపాడు.