టైటిల్ పోరుకు ఫ్యూచర్ కిడ్స్ జట్లు
బాలబాలికల విభాగాల్లో ఫైనల్‌కు... దేవసియా బాస్కెట్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: దేవసియా ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫ్యూచర్ కిడ్స్ జట్లు సత్తా చాటుకున్నాయి. ఈ స్కూల్‌కు చెందిన బాలబాలికల జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్ గ్రౌండ్స్‌లో శుక్రవారం జరిగిన బాలుర విభాగం సెమీఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 60–46 స్కోరుతో ఆల్ సెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ఫ్యూచర్ కిడ్స్ జట్టులో ఆద్యన్ (19) రాణించగా, అనిశ్, ప్రణవ్ చెరో 10 పాయింట్లు చేశారు. ఆల్ సెయింట్స్ తరఫున మహేశ్ (20), శంకర్ (18) ఆకట్టుకున్నారు. మరో సెమీస్‌లో సెయింట్ పాల్స్ జట్టు 26–7 స్కోరుతో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై అలవోక విజయం సాధించింది.
సెయింట్ పాల్స్ జట్టులో సిద్ధార్థ్, మాజిద్ చెరో 8 పాయింట్లు సాధించారు. జాన్సన్ స్కూల్ తరఫున దేశ్‌ముఖ్ 5 పాయింట్లు చేశాడు. బాలికల సెమీఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 24–10తో సెయింట్ జోసెఫ్ జట్టుపై గెలిచింది. ఫ్యూచర్ కిడ్స్ జట్టులో నవ్య (8), హిత (6) రాణించారు. శ్రియ 4 పాయింట్లు చేసింది. సెయింట్ జోసెఫ్ తరఫున రాగమయి 4, యశస్విని, వింధ్య చెరో 3 పాయింట్లు చేశారు. మరో సెమీఫైనల్లో హోలి ఫ్యామిలీ జట్టు 32–11తో ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై నెగ్గింది. హోలి ఫ్యామిలీ జట్టులో పూజ (17) క్రమం తప్పకుండా పాయింట్లు చేసిపెట్టింది. ఆర్మీ స్కూల్ జట్టులో సిమ్రన్ 6, గౌరి 5 పాయింట్లు సాధించారు. సోమవారం జరిగే బాలుర ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్‌తో సెయింట్ పాల్స్ తలపడుతుంది. అనంతరం బాలికల టైటిల్ పోరులో ఫ్యూచర్ కిడ్స్, హోలి ఫ్యామిలీ పోటీపడతాయి.