విన్‌ వీధిలో మెరిసినా... పాదాలు నేల మీదే | Chinese gymnast: After winning silver in Paris Olympics now working in a restaurant | Sakshi
Sakshi News home page

విన్‌ వీధిలో మెరిసినా... పాదాలు నేల మీదే

Published Wed, Aug 21 2024 3:54 AM | Last Updated on Wed, Aug 21 2024 8:25 AM

Chinese gymnast: After winning silver in Paris Olympics now working in a restaurant

చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా సరే...  ఆత్మస్థైర్యంతో ఆకాశంకేసి చూడాలి. పెద్ద కలలు కనాలి. కష్టపడి సాధించాలి. కల నెరవేరిన తరువాత  ఆకాశంలో ఉండిపోకూడదు. మన పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలి. మన దేశంలోని జులేఖ, చైనా దేశానికి చెందిన యకిన్‌ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు...

పేవ్‌మెంట్‌ నుంచి ఒలింపిక్స్‌ వరకు
పేవ్‌మెంట్‌ల దగ్గర భిక్షాటన చేసిన అమ్మాయి ఆ తరువాత కాలంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి చేరుకుంది. ఇది సినిమా కథ కాదు. నిజ జీవిత కథ. ముంబైకి చెందిన జులేఖ కథ. అనాథాశ్రమంలో పెరిగిన జులేఖ వాలీబాల్‌ ఆటలో ్రపావీణ్యం సంపాదించింది. ఆ ఆట ఆమెను అబుదాబి స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ సమ్మర్‌ గేమ్స్‌లో పాల్గొనేలా చేసింది.మంచం మీద పడుకోవడం ‘లగ్జరీ’ విషయమేమీ కాదు. జులేఖ షేక్‌కు మాత్రం లగ్జరీనే! పదహారు సంవత్సరాల క్రితం శుక్రాపూర్‌ హైవేపై ఎనిమిదేళ్ల జులేఖా షేక్‌ కాలికి గాయమై పడి ఉండడాన్ని పోలీసులు గమనించి చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ ఆసుపత్రిలో జులేఖ ఫ్యాన్‌ కింద బెడ్‌పై పడుకుంది.

ఇది తనకు సరికొత్త అనుభవం. కటిక నేల మీద తప్ప ఆమె ఎప్పుడూ బెడ్‌ మీద పడుకోలేదు. భిక్షాటన చేయడం, ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడం, రాత్రి పడుకోవడానికి స్థలం వెదుక్కోవడం... స్థూలంగా ఇది తన జీవితం. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన తరువాత జులేఖను ఒక అనాథాశ్రమంలో చేర్పించారు పోలీసులు. అలా ఆమెకు అనికేత్‌ సేవాభవి సంస్థ నిర్వాహకురాలు కల్పన వర్పే పరిచయ భాగ్యం కలిగింది. ఆ తరువాత జులేఖ జీవితమే మారిపోయింది.

కట్‌ చేస్తే... అబుదాబి 2019 స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ సమ్మర్‌ గేమ్స్‌లో వాలీబాల్‌లో మన దేశానికి ్రపాతినిధ్యం వహించడమే కాదు కాంస్య పతకం గెలుచుకుంది. ఇప్పుడు ఆ పతకం తనకు పతకం మాత్రమే కాదు... కొత్త జీవితం... కొత్త శక్తి! ఈ పతకం గురించి అడిగిన వారికి, అడగని వారికి అందరికీ చూపిస్తూ ఎంతోసేపు సంతోషంగా మాట్లాడుతుంది జులేఖ.

గతంలోకి వెళితే...
గ్రౌండ్‌లో అబ్బాయిలు వాలీబాల్‌ అడుతున్నారు. ‘సర్, నేను ఆడవచ్చా’ అని స్పోర్ట్స్‌ టీచర్‌ అశోక్‌ రామచంద్రన్‌ నాంగ్రాను అడిగింది జులేఖ. ‘కుదరదు’ అని ఆయన అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన పచ్చ జెండా ఊపడంతో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ అబ్బాయిలతో సమానంగా, వారిని మించి వాలీబాల్‌ ఆడడం మొదలుపెట్టింది. ఆ ప్రతిభ తనని రాష్ట్ర, అంతర్‌రాష్ట్ర స్థాయిలో ఎన్నో గేమ్స్‌ ఆడేలా చేసింది. అబుదాబి ఒలింపిక్స్‌ కోసం తొలిసారి విమానం ఎక్కడం జులేఖ జీవితంలో మరచిపోలేని మధురమైన అనుభవం.

‘బాల్యంలో ఎన్నో కష్టాలు పడి ఉండడం వల్ల మొదట్లో చాలా హైపర్‌గా కనిపించేది. ఆలోచనలు స్థిరంగా ఉండేవి కాదు. ఆ తరువాత ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఏదైనా సాధించి తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటుంది జులేఖ గురించి కల్పనా వర్పే. ‘రాత్రి పడుకోవడానికి చోటు వెదుక్కోవడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అనాథాశ్రమంలో చేరిన తరువాత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లే ఉండేది. ఎన్నో పద్ధతులు నేర్చుకున్నాను. సెలవుల్లో అమ్మడానికి మట్టి ప్రమిదల నుంచి గ్రీటింగ్‌ కార్డ్స్‌ తయారు చేయడం వరకు ఎన్నో చేశాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంది జులేఖ. కొత్త జీవితాన్ని ఇచ్చిన అనికేత్‌ సేవాభవి సంస్థకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుంది.

‘ఇక్కడి వారి పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధ, ప్రేమ అపురూపంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల నుంచి వచ్చిన వారికి వేడి వేడి చాయి చేసి ఇస్తుంది. వారికి ధైర్యం చెబుతుంటుంది’ అని జులేఖ గురించి ప్రశంసాపూర్వకంగా చెబుతుంది కల్పనా వర్పే. ఒకప్పటి జులేఖలాంటి అమ్మాయిలు ఇప్పుడు కూడా ఫుట్‌పాత్‌ల మీద కఠినమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. అలాంటి వారికి కొత్త జీవితం ఇవ్వాలనేది జులేఖ కల.

ఒలింపిక్స్‌ నుంచి రెస్టారెంట్‌లో పనికి!
ఒలింపిక్స్‌లో పాల్గొనడం గొప్ప. పతకం గెల్చుకోవడం మరింత గొప్ప. అసలుసిసలు ఆటగాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తారు తప్ప తల కెక్కించుకోరు అని చెప్పడానికి ఒలిపింక్స్‌లో రజత పతకం గెల్చుకున్న చైనా జిమ్నాస్ట్‌ యకిన్‌ ఒక ఉదాహరణ. పద్దెనిమిది సంవత్సరాల ఝౌ యకిన్‌ ఒలింపిక్స్‌ నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఎప్పటిలాగే తన కుటుంబానికి చెందిన రెస్టారెంట్‌ పనుల్లో పడిపోయింది.

ఒలింపిక్‌ యూనిఫామ్‌లో తమ రెస్టారెంట్‌లో ఎప్పటిలాగే కస్టమర్‌లకు వడ్డిస్తున్న వీడియోని చూస్తూ ‘షీ గాట్‌ ఏ సిల్వర్, బట్‌ గేవ్‌ ఏ గోల్డ్‌ సర్వీస్‌’ అంటున్నారు నెటిజనులు. సెంట్రల్‌ చైనాలోని హునాన్‌ ్రపావిన్స్‌లోని హెంగ్యాంగ్‌ సిటిలో ఈ రెస్టారెంట్‌ ఉంది. చైనా నుంచి ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అయిదుగురు జిమ్నాస్ట్‌లలో యకిన్‌ ఒకరు.

‘ఈ అందమైన చైనీస్‌ జిమ్నాస్ట్‌ గుర్తుందా?’ అనే కాష్షన్‌తో ‘ఎక్స్‌’లో షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఒలింపిక్స్‌ విజయాన్ని, కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకుంటున్న యకిన్‌పై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్పారు. చేస్తున్న పని చిన్నదా, పెద్దదా అనేది పక్కన పెడితే పనిని గౌరవించడం మన బాధ్యత. పనికి మనం ఇచ్చే గౌరవం వృథా పోదు... ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని చెప్పడానికి కూడా ఝౌ యకిన్‌ నిలువెత్తు ఉదాహరణ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement