సాక్షి, హైదరాబాద్: నేషనల్ స్కూల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాలికలు సత్తా చాటారు. అండర్-17, అండర్-19 విభాగాల్లో పోటీ పడిన ఏపీ అమ్మాయిలు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు నెగ్గారు. అసోంలోని గువహటిలో గురువారం ఈ పోటీలు ముగిశాయి. అండర్-17 విభాగంలో రాష్ట్రానికి చెందిన జి. సింధు స్వర్ణం గెలుచుకుంది. 58 కేజీల కేటగిరీలో పోటీ పడిన సింధు మొత్తం 131 కిలోల (స్నాచ్ 56 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 75 కేజీలు) బరువు ఎత్తింది.
అండర్-17 విభాగంలోనే ఏపీకి మరో మూడు రజతాలు లభించాయి. 44 కేజీల కేటగిరీలో టి. ప్రియదర్శిని (మొత్తం 110 కేజీలు-స్నాచ్ 46, క్లీన్ అండ్ జర్క్ 64 ), 63 కేజీల కేటగిరీలో జి. లలిత (మొత్తం 127 కేజీలు - స్నాచ్ 55, క్లీన్ అండ్ జర్క్ 72), 69 కేజీల కేటగిరీలో డి. సీతామహాలక్ష్మి (126 కేజీలు - స్నాచ్ 58, క్లీన్ అండ్ జర్క్ 68) రజతాలు గెలుచుకున్నారు. అండర్-19 విభాగంలో ఎం. ఊహాసాయికి రజత పతకం లభించింది. 75 కేజీల కేటగిరీలో పోటీ పడిన ఊహ మొత్తం 142 కిలోల (స్నాచ్ 60 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 82 కేజీలు) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.
సింధుకు స్వర్ణం
Published Sat, Jan 25 2014 12:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement