సొంతగడ్డపై హీరో అయ్యాడు!
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ లో భాగంగా జరిగిన సాకర్ పోరులో ఆతిథ్య దేశం బ్రెజిల్ ముందంజ వేసింది. గ్రూప్-ఎలో జరిగిన పోరులో బ్రెజిల్ 4-0 తేడాతో డెన్మార్క్ పై నెగ్గి క్వార్టర్స్ కు చేరుకుంది. గోల్ దాహంతో ఉన్న బ్రెజిల్ జట్టుకు గాబ్రియెల్ బార్బోసా రెండో గోల్ నమోదు చేసి హీరోగా మారిపోయాడు. గాబ్రియెల్ రాణించి రెండు గోల్స్ చేయడంతో బ్రెజిల్ దూకుడును డెన్మార్క్ అడ్డుకోలేకపోయింది.
విజయం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, అయితే తొలి రెండు మ్యాచ్ లలో మెరుగ్గానే ఆడినా గోల్ చేయలేకపోయామని గోల్ హీరో బార్బోసా పేర్కొన్నాడు. గ్రూప్-ఏ నుంచి క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లిన బ్రెజిల్ శనివారం కొలంబియాతో తలపడనుంది. సొంతగడ్డపై అద్భుతాలు చేసి బ్రెజిల్ స్వర్ణం సాధిస్తుందని ఆ దేశ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇరాక్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.