తొలి ఓవర్లోనే పాక్ కు ఎదురుదెబ్బ!
షార్జా: వెస్టిండీస్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కు షాక్ తగిలింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రియెల్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. దీంతో పాకిస్తాన్ ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన గాబ్రియెల్ రెండో బంతికి అజహర్ అలీ(0)ని, నాలుగో బంతికి అసద్ షఫీఖ్ ను డకౌట్ గా పెవిలియిన్ బాట పట్టించాడు. బ్రాత్ వైట్ క్యాచ్ పట్టడంతో అజహర్ ఔట్ కాగా, అసద్ మాత్రం వికెట్లు ముందు అడ్డంగా దొరికిపోయాడు.
సీమర్లకు అనుకూలించే పిచ్ పై విండీస్ బౌలర్ మంచి ఫలితాలను రాబట్టాడు. 145కి.మీ వేగంతో బంతులు విసురుతూ పాక్ బ్యాట్స్ మన్లను ఇబ్బంది పెడుతున్నాడు. మూడో టెస్టులో బౌలింగ్ విభాగంలో పట్టు సాధించేందుకు ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కొన్ని మార్పులు చేసింది. వహబ్ రియాజ్, మహ్మద్ ఆమిర్ లను తప్పించింది. రహత్ అలీ, సోహైల్ ఖాన్ లకు అవకాశం ఇచ్చింది.