నగరంలో గ‘గన్’ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ తొలిసారి హైదరాబాద్‌లో సొంత షూటింగ్ అకాడమీతో ముందుకొచ్చాడు. పుణేలోని తన అకాడమీ ‘గన్ ఫర్ గ్లోరీ’ పేరుతోనే జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ)లో 10 మీటర్ల రేంజ్‌ను అతను ఏర్పాటు చేశాడు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అకాడమీని ఘనంగా ప్రారంభించారు. ఈ అకాడమీలో ప్రాథమికంగా లెవల్-1, లెవల్-2లలో శిక్షణ ఇస్తారు. 12 ఏళ్లకు పైబడినవారు నిర్ణీత రుసుము చెల్లించి శిక్షణ పొందవచ్చు. ఈ 10 మీటర్ల రేంజ్‌లో (ఎనిమిది టార్గెట్‌లు) ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ విభాగాల్లో శిక్షణ లభిస్తుంది.
ముఖ్యమంత్రితో మాట్లాడతా: కేటీఆర్
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) మాట్లాడుతూ... గగన్ నారంగ్ పూర్తి స్థాయిలో సొంత అకాడమీ ఏర్పాటు చేయడం కోసం గతంలో కూడా ప్రతిపాదనలు ఇచ్చాడని, దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. షూటింగ్‌లాంటి క్రీడలకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోందన్న మంత్రి, చిన్నదే అయినా రేంజ్ ఏర్పాటుతో అడుగు ముందుకు వేసిన నారంగ్‌ను అభినందించారు.
గతంలో విదేశాల్లోనే అత్యుత్తమ స్థాయి షూటింగ్ రేంజ్‌లాంటివి తాము చూసేవాళ్లమని, ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఇలాంటిది ఏర్పాటు కావడం సంతోషకరమని నాగార్జున వ్యాఖ్యానించారు. గగన్ నారంగ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా ఈ అకాడమీని నిర్వహిస్తామని నారంగ్ చెప్పాడు. పుణేలో తమ వద్ద ఆరు వేలకు పైగా షూటర్లు శిక్షణ పొందారని, 87 మంది అంతర్జాతీయ స్థాయిలో రాణించారన్నాడు.
హైదరాబాద్‌లో పూర్తి స్థాయి అకాడమీ గురించి కూడా ఆలోచన ఉందని, అయితే ఇప్పుడు తొలి అడుగుగా దీనిని భావిస్తున్నానని నారంగ్ అన్నాడు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, చాముండేశ్వరీనాథ్, ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షు డు కేఎస్ రామారావు, ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.