పాక్ దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా?
న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ పాకిస్తాన్ తో సంబంధాలపై చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పాక్ తీవ్ర చర్యలను, చేష్టలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే ఆ దేశ నటీనటలను ఇక్కడ ఆదరించొద్దని, పనిలో పనిగా పాక్-భారత్ సిరీస్ లకు విరామం ఇవ్వాలని వ్యాఖ్యానించిన గంభీర్ కు గంగూలీ మద్దతు తెలిపాడు. వాస్తవానికి ఇది చాలా దురదృష్టకరమైన అంశం అయినా సరే, పాకిస్తాన్ తో క్రికెట్ కొన్నేళ్లు నిలిపివేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో భారత్-పాక్ సంబంధాలపై నోరు విప్పాడు. సరిహద్దుల్లో తరచుగా పాక్ ఉగ్రదాడులకు తెగబడుతున్న కారణంగా కొన్ని సందర్భాలలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తన మనసులో మాట బయటపెట్టాడు. మన జవాన్లను చంపేస్తుంటే పాక్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం భావ్యమేనా అని దాదా ప్రశ్నించాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ ఇదివరకే ఈ విషయంపై మాట్లాడుతూ.. భారత్-పాక్ సిరీస్ లపై తుది నిర్ణయం సంబంధిత క్రీడా బోర్డులకు వదిలేస్తున్నామని చెప్పారు. కాగా, ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని గంభీర్ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.