న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని పేరు చెప్పగానే దేశవిదేశ ఆటగాళ్లు, అభిమానులు అందరూ మెచ్చుకునేది అతడి నాయకత్వ లక్షణాలను. ప్రత్యర్థి వ్యూహాలను చేధిస్తూ.. క్లిష్ట సమయాలలో కూల్‌గా నిర్ణయాలను తీసుకుని టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అయితే ఎంఎస్ ధోని కెప్టెన్ కావడంతో క్రికెట్ ప్రపంచం ఓ గొప్ప బ్యాట్స్‌మన్‌ను చూసే అవకాశం కోల్పోయిందని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న గంభీర్ అనేక ఆసక్తికర విషయాలపై చర్చించారు. (‘కరోనా చాలా నేర్పింది.. వ్యవసాయం చేస్తా’)
‘ధోని కెప్టెన్ కావడంతో క్రికెట్ ప్రపంచం ఓ అద్భుత బ్యాట్స్‌మన్‌ను మిస్సయింది. అతను భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసుంటే ధోనిలోని ఓ భిన్నమైన ఆటగాడిని క్రికెట్ ప్రపంచం చూసేది. మూడో స్థానంలో అతడు బ్యాటింగ్ చేసుంటే ఎన్నో రికార్డులు బద్దలయ్యేవి. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచేవాడు. (‘అనుష్కతో నేను మాట్లాడటం కోహ్లికి నచ్చలేదు’)
ఎందుకంటే నాణ్యమైన బౌలర్లున్న సమయంలో ధోని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగుల వరద పారించాడు. అలాగే కొనసాగి ఉంటే అన్ని బ్యాటింగ్ రికార్డులు అతడి పేరుపైనే ఉండేవి. గతంతో పోలిస్తే ప్రస్తుత క్రికెట్‌లో నాణ్యమైన బౌలర్లు లేరని నా అభిప్రాయం. శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు పూర్తిగా బలహీనమయ్యాయి. దీంతో ప్రస్తుతం క్రికెట్‌లో నాణ్యత లోపించింది. ఈ పరిస్థితుల్లో ధోని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చుంటే పరుగుల వరద పారించే వాడు’ అని గంభీర్ వివరించాడు. ఇక 16 వన్డే మ్యాచ్‌ల్లో ధోని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇరగదీసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment