‘ఆట’ మొదలు | 'Games' start now | Sakshi
Sakshi News home page

‘ఆట’ మొదలు

Published Thu, Feb 18 2016 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

‘ఆట’ మొదలు

‘ఆట’ మొదలు

భారత టెన్నిస్‌లో మళ్లీ రభస
రియో ఒలింపిక్స్ ‘మిక్స్‌డ్’ జోడీపై చర్చ
రాబోయే మూడు నెలలు కీలకం


నాలుగేళ్ల క్రితం... లండన్ ఒలింపిక్స్ ముందు... భారత టెన్నిస్‌లో పెద్ద వివాదమే రేగింది. డెడ్‌లైన్ సమీపించేవరకు డబుల్స్‌లో పాల్గొనే క్రీడాకారులెవరో తేలలేదు. సానియా-పేస్ జతగా మిక్స్‌డ్ బరిలోకి దిగగా... పేస్‌తో కలిసి డబు ల్స్ ఆడేందుకు బోపన్న, భూపతి నిరాకరించారు. మొత్తం మీద ఆనాడు జరిగిన చర్చతో సానియా తలపట్టుకుంది. ‘నా అభిప్రాయాన్ని ఎవరూ అడగడం లేదు. పురుషాధిక్య సమాజం అయిపోయింది’ అని సానియా వ్యాఖ్యానించే స్థాయికి పరిస్థితి వెళ్లింది. రకరకాల వివాదాల తర్వాత లండన్ వెళ్లినా మొత్తం అందరూ రిక్తహస్తాలతో వచ్చారు.

ఈసారి మళ్లీ రియో ఒలింపిక్స్ దగ్గరకి రాగానే రభస మొదలైంది. పేస్, బోపన్న ఇద్దరూ రెగ్యులర్‌గా అన్ని టోర్నీలలో ఆడుతూ ఉండటం, భూపతి కొంతకాలంగా టెన్నిస్‌కు దూరంగా ఉండటం వల్ల... ఈసారి అంతా సాఫీగా సాగుతుందని భావించిన తరుణంలో, భూపతి మళ్లీ రాకెట్ పట్టాడు. ఈసారి సానియా సూపర్ ఫామ్‌లో ఉంది. ప్రపంచ  నంబర్‌వన్. కాబట్టి దాదాపుగా పతకం ఖాయం అనే భావనలో అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ముగ్గురూ సానియా జతగా రియోలో బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
 
ప్రస్తుతం టెన్నిస్ డబుల్స్‌లో సానియా ఓ సంచలనం. మహిళల డబుల్స్ నంబర్‌వన్ క్రీడాకారిణిగా తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. అటు పేస్, బోపన్న కూడా నిలకడగా విజయాలు సాధిస్తున్నారు. కాబట్టి రియో ఒలింపిక్స్‌కు ఈసారి పేస్-బోపన్న డబుల్స్‌లో, సానియా-పేస్ మిక్స్‌డ్‌లో వెళ్లే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సీన్ మారిపోయింది. భూపతి మళ్లీ రాకెట్ పట్టి టోర్నీలు ఆడుతున్నాడు. దీంతో ఈ రభస ఆరు నెలల ముందే మొదలైంది. ఈసారి ఎవరితో కలిసి ఆడతావ ని సానియాను ముందే మీడియా అడిగింది. ‘ఒలింపిక్స్‌కు ఇంకా చాలా సమయం ఉంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో నా భాగస్వామి ఎవరనేది  ఇంకా నిర్ణయించుకోలేదు’ అని ఆమె నుంచి సమాధానం వస్తోంది. మరోవైపు గత లండన్ ఒలింపిక్స్ సమయంలో జరిగిన పరిణామాలు ఈసారి పునరావృతం కాకూడదని, పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా జట్లను ఎంపిక చేయాలని 42 ఏళ్ల లియాండర్ పేస్ ఇప్పటికే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులకు విజ్ఞప్తి చేశాడు.
 
బోపన్న, సానియాలకు నేరుగా ఎంట్రీ!
రియో ఒలింపిక్స్ అర్హత నిబంధనలను పరిశీలిస్తే ఈ ఏడాది జూన్ 6న వెలువడే ర్యాంకింగ్స్ ఆధారంగా ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. పురుషుల, మహిళల డబుల్స్‌లో టాప్-24లో ఉండే ఆటగాళ్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. వీళ్లు తమ భాగస్వామిగా తమ దేశానికే చెందిన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే వీలుంది. అయితే వాళ్లు గత మూడేళ్లలో (2013 నుంచి 2016 వరకు) డేవిస్ కప్‌లో లేదా ఫెడ్ కప్‌లో తప్పనిసరిగా దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి.


ఈ నిబంధనను తప్పనిసరిగా పాటిస్తే మాత్రం మహేశ్ భూపతికి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఎందుకంటే మహేశ్ భూపతి చివరిసారి 2011లో డేవిస్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది జూలై వరకు భారత్‌కు డేవిస్ కప్ మ్యాచ్ లేదు. అయితే ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిన అవసరంలేదని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అధికారొకరు తెలిపారు. ‘డేవిస్‌కప్‌లో ఆడి ఉండాలనే నిబంధనను పరిగణనలోకి తీసుకోకూడదని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఒలింపిక్ కమిటీకి... జాతీయ టెన్నిస్ సంఘం అప్పీల్ చేస్తే సదరు ఆటగాడికి ఒలింపిక్స్‌లో ఆడించే వెసులుబాటును కల్పిస్తారు’ అని ఐటీఎఫ్ అధికారి వివరించారు. ప్రస్తుతం పురుషుల డబుల్స్‌లో ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న 8వ స్థానంలో... లియాండర్ పేస్ 52వ, మహేశ్ భూపతి 286వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉంది.

ఫలితంగా రోహన్ బోపన్న, సానియా మీర్జాలకు రియో ఒలింపిక్స్‌కు నేరుగా ఎంట్రీ లభించడం ఖాయమైందనుకోవాలి. కంబైన్డ్ ర్యాం కింగ్ ప్రకారమైతే మిక్స్‌డ్ డబుల్స్‌లో  బోపన్న-సానియా కలిసి ఆడొచ్చు. ఒకవేళ లియాండర్ పేస్‌ను తమ భాగస్వామిగా రోహన్ బోపన్న, సానియా మీర్జా వద్దనుకుంటే మాత్రం... రియో ఒలింపిక్స్‌లో పేస్ ఆడాలనుకుంటే జూన్ 6వ తేదీలోపు డబుల్స్‌లో టాప్-24 ర్యాంకింగ్స్‌లో నిలవాలి. టాప్-24లోకి వస్తే పేస్ తనకిష్టమైన భాగస్వామిని ఎంచుకోవచ్చు. గత లండన్ ఒలింపిక్స్ సమయంలో ఇలాగే జరిగింది. 2012లో పేస్ మూడో ర్యాంక్‌లో ఉం డగా... బోపన్న 12వ ర్యాంక్‌లో, మహేశ్ భూపతి 14వ ర్యాంక్‌లో ఉన్నారు. ఫలితంగా బోపన్న-భూపతి ఒక జోడీగా బరిలోకి  దిగగా... పేస్ విష్ణువర్ధన్‌ను ఎంచుకున్నాడు. కంబైన్డ్ ర్యాంకింగ్ ఆధారంగా పేస్-సానియాలు మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడారు.
   
ఫామ్‌లో లేని పేస్
గత కొంతకాలంగా లియాండర్ పేస్ ఫామ్‌లో లేడు. ఈ ఏడాది అతను పాల్గొన్న నాలుగు టోర్నీల్లో ముగ్గురు వేర్వేరు భాగస్వాములతో కలిసి ఆడాడు. ఒక్క టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకోలేదు. గతేడాది జనవరిలో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి పేస్ చివరిసారిగా ఆక్లాండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతనికి మరో టైటిల్ కూడా లభించలేదు. మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లు మాత్రం కేవలం గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనే జరుగుతాయి. రియో ఒలింపిక్స్‌కు ముందు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఉన్నాయి. ఒకవేళ ఒలింపిక్స్‌కల్లా సమన్వయం కుదరాలంటే భారత స్టార్స్ పేస్, బోపన్న, భూపతిలలో ఒకరితో కలిసి సానియా ఈ రెండు టోర్నీల్లో ఆడితే బాగుంటుంది. గతంలో పేస్‌తో కలిసి సానియా 2006 దోహా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించగా... భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012) టోర్నీల్లో విజేతగా నిలిచింది.
 
సీన్‌లోకి మహేశ్ భూపతి!
ఇప్పటివరకైతే లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సానియా మీర్జాలకే రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని భావించారు. అయితే గత రెండేళ్లుగా  అంతగా ఫామ్‌లో లేని 41 ఏళ్ల మహేశ్ భూపతి గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ రాకెట్ పట్టాడు.  ఢిల్లీలో జరుగుతోన్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో యూకీ బాంబ్రీతో కలిసి బరిలోకి దిగాడు. దాంతో మరోసారి ఒలింపిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భూపతి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే భూపతి మాత్రం దాంట్లో నిజం లేదంటున్నాడు. ‘ఇప్పటికైతే రియో ఒలింపిక్స్‌లో ఆడాలనే ఆలోచన లేదు. మోకాలి గాయం నుంచి కోలుకున్నాను. కేవలం ఆటను ఆస్వాదించడానికే మళ్లీ రాకెట్ పట్టాను. ఆడాలనే ఆకాంక్ష తగ్గిన మరుక్షణమే రాకెట్‌ను పక్కన పెట్టేస్తాను. అది వచ్చే వారం కూడా జరగొచ్చు’ అని మహేశ్ భూపతి వ్యాఖ్యానిస్తున్నాడు. అతని మాటల్లో ఎంత నిజం ఉందో రాబోయే కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement