లండన్ : ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని న్యూజిలాండ్ ఇప్పట్లో మరిచిపోయేలా లేదు. ఆటగాళ్లతో పాటు అభిమానులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఐసీసీ నిబంధనలే ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ను అందించిందని క్రికెట్ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడంపై ఐసీసీని తప్పుపడుతున్నారు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం కూడా మరో సూపర్ ఓవర్ ఆడించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ ఐసీసీ ముందుకు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చాడు.
‘ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో విజేతను బౌండరీల ఆధారంగా ప్రకటించడం సమంజసం కాదు. ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ రెండూ టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించండి. ఏడు వారాలుగా ప్రపంచకప్ కోసం మా ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడ్డారు. కానీ ఫైనల్ మ్యాచ్‌లో ఇలా ఓడిపోవడం మా ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐసీసీ తన నిబంధనలను మార్చుకుంటే మంచిది’అంటూ స్టీడ్ ఐసీసీకి విన్నవించాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం చెత్త నిర్ణయం అంటూ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment