పోరాడుతూనే...
దేశవాళీ మ్యాచ్‌లకు సిద్ధమైన సెహ్వాగ్, గంభీర్, యువరాజ్
ఆ ముగ్గురూ భారత క్రికెట్‌కు అనేక చిరస్మరణీయ విజయాలు అందించారు. టోర్నీ ఏదైనా, సిరీస్ ఏక్కడైనా చక్కటి ప్రదర్శనతో తమ ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే కొత్త కుర్రాళ్ల జోరులో వారి ప్రభావం మసకబారింది. ఇదే ఆఖరు కావచ్చేమో అంటూ అరుదుగా వచ్చిన అవకాశాలకు కూడా తగిన న్యాయం చేయలేకపోయారు. ఫలితంగా వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ టీమిండియాకు చాలా కాలం క్రితమే దూరమయ్యారు. అయితే వీరు తమ పోరాటం ఆపడం లేదు. మళ్లీ దేశవాళీలో బరిలోకి దిగి ఒక్కసారైనా తిరిగి రావాలని పట్టుదలగా ఉన్నారు. అసలు వీరికి ఆ అవకాశం ఉందా... తమ ఘనతలను అందరూ గుర్తు చేసుకుంటూ వీడ్కోలు పలికే విధంగా ఒక అంతర్జాతీయ మ్యాచ్ అయినా దక్కుతుందా!
వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఓడినా భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ సిరీస్‌తో పాటు ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం ప్రకటించిన జట్టు చూసినా పెద్దగా మార్పులేం లేవు. ఒకరిద్దరు కొత్త కుర్రాళ్లను ప్రయత్నించాలనే ఆలోచన తప్ప ఇతరత్రా పెద్దగా మార్పులు లేకుండా అంతా సెటిల్ అయి ఉంది. ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో విజయం సాధించిన జట్టుకు కూడా ఎలాంటి సమస్య లేదు. ఇంకా చెప్పాలంటే వరుసగా ఆటగాళ్లు గాయాలపాలైనా...వారి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటంతో టెస్టు టీమ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో సెహ్వాగ్, గంభీర్, యువరాజ్‌లకు చోటుకు అవకాశం చాలా తక్కువ. కానీ ఈ ముగ్గురు మరో సారి కొత్త రంజీ సీజన్‌కు సిద్ధమయ్యారు. ఢిల్లీ కెప్టెన్‌గా గంభీర్ బరిలోకి దిగుతుండగా, తొలిసారి సెహ్వాగ్ హర్యానాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఇటీవల యువ రాజ్ మొయినుద్దౌలాకు వచ్చి సీజన్‌ను మొదలు పెట్టాడు.
- సాక్షి క్రీడా విభాగం
వీరేంద్ర సెహ్వాగ్
టెస్టు ఓపెనర్ కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేయవచ్చని ప్రపంచ క్రికెట్‌కు చూపించిన సెహ్వాగ్ ముద్ర ప్రత్యేకమైంది. రెండు ట్రిపుల్ సెంచరీలు సహా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న సెహ్వాగ్ తన తరహా దూకుడుతోనే స్థానం కోల్పోయాడు. 2013 మార్చిలో సొంతగడ్డపై ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో మూడో టెస్టులో ధావన్‌కు స్థానం లభించింది. అంతే...ఆ తర్వాత వీరూ టెస్టు స్థానం పోయింది. ఆఖరి వన్డే కూడా దాదాపు అదే సమయంలో ఆడాడు. చారిత్రాత్మక డబుల్ సెంచరీ తర్వాత 11 వన్డేల్లో ఒకే అర్ధ సెంచరీతో చోటు కోల్పోయిన అతను మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత సెహ్వాగ్ రెండు దేశవాళీ సీజన్‌లలో సత్తా చాటేందుకు ప్రయత్నించాడు. తన తరహా శైలితో కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా అది సెలక్టర్లకు ఆకట్టుకునేందుకు సరిపోలేదు. చాలా మంది కలలు గనే 100 టెస్టుల మైలురాయి కూడా సెహ్వాగ్ దాటేశాడు. వచ్చే నెలలో 37 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సెహ్వాగ్ పునరాగమనం కష్టం కాదని ఇప్పటికీ చెబుతున్నాడు.
గౌతం గంభీర్
ఈ ముగ్గురు ఆటగాళ్లలో అంకిత భావంతో తిరిగి స్థానం కోసం శ్రమిస్తోంది గంభీర్ అని అతని సాధన చూస్తే అర్థమవుతుంది. 20 నెలల తర్వాత గత ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండు టెస్టుల్లో అవకాశం దక్కినా విఫలం కావడంతో అతని చోటు పోయింది. సెహ్వాగ్‌లాగే వన్డేలకు కూడా 2013 జనవరినుంచే దూరమయ్యాడు. గవాస్కర్ తర్వాత భారత అత్యుత్తమ ఓపెనర్ అని ప్రశంసలు అందుకున్న అతని స్థానాన్ని ఇప్పుడు వేరే ఓపెనర్లు భర్తీ చేసేశారు. నిజానికి గంభీర్ ఎక్కడా విరామం ఇవ్వకుండా రెండేళ్లుగా రెగ్యులర్‌గా ఆటను కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ, ఐపీఎల్, చాంపియన్స్ లీగ్...ఎక్కడైనా ఆడుతూనే పోయాడు. కొన్ని చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడి తనపై దృష్టి ఉండేట్లు చేసుకున్నాడు.
కొన్నాళ్ల క్రితం పెర్త్ వెళ్లి మరీ ఆస్ట్రేలియన్ లాంగర్ వద్ద టెక్నిక్ విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇవన్నీ అతను తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయనేదానికి ఉదాహరణ. ఈ శ్రమ తర్వాత ఇటీవల శ్రీలంకతో సిరీస్‌లోనే గంభీర్ స్థానం ఆశించాడు. కానీ విజయ్, రాహుల్, ధావన్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉండటం, అవసరమైతే పుజారా సిద్ధంగా ఉండటం అతని అవకాశాలను దెబ్బ తీసింది. అక్టోబర్‌లో 35వ పడిలోకి ప్రవేశిస్తున్న గంభీర్ మాత్రం ఇంకా నమ్మకం కోల్పోలేదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
యువరాజ్ సింగ్
టెస్టు క్రికెటర్‌గా ఏనాడూ ప్రభావం చూపించలేని యువరాజ్ సింగ్ వన్డేలు, టి20ల్లో మాత్రం స్టార్ హోదా సంపాదించాడు. మూడేళ్లుగా అతను వన్డేలు కూడా ఆడలేదు. యువీని క్రికెట్ అభిమానులందరి దృష్టిలో విలన్‌గా మార్చిన గత ఏడాది టి20 ప్రపంచకప్ ఫైనల్ ఇన్నింగ్స్ అతని ఆఖరి మ్యాచ్. ఐపీఎల్‌లో మాత్రం రెండేళ్లుగా తన ‘విలువ’ను నిలబెట్టుకున్న అతను దేశవాళీ మ్యాచ్‌ల విషయంలో కూడా వెనక్కి తగ్గలేదు. రంజీల్లో రాణిస్తేనే మళ్లీ జట్టులోకి రాగలనని భావించి ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు.
గతేడాది పంజాబ్ తరఫున ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసిన యువీ, ఈ సారి కూడా మళ్లీ రంజీ బరిలోకి దిగుతున్నాడు. మొయినుద్దౌలా టోర్నీ ఆడేందుకు హైదరాబాద్ వచ్చిన తొలి రోజు కొత్త సీజన్ ఆరంభమైంది అంటూ ఆశావహ దృక్పథంతో అతను వ్యాఖ్యానించాడు. క్యాన్సర్‌నుంచి కోలుకున్న తర్వాత అతని ఆటలో పదును తగ్గిందనేది వాస్తవం. ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని ముందుగా జడేజా భర్తీ చేయగా, ఇప్పుడు అక్షర్‌లాంటి ఆటగాళ్ల రూపంలో సవాల్ ఎదురైంది. అయితే మరీ ఎక్కువ వయసు (34) కాకపోవడం యువీకి కొంత సానుకూలతగా చెప్పవచ్చు. కొంత విరామం వచ్చినా తనకూ అవకాశం ఉంటుందనే నమ్మకం అతని మాటల్లో ఇటీవల కనిపిస్తోంది.
‘ఫేర్‌వెల్’ మ్యాచ్ ఉంటుందా!
గత కొంతకాలంగా అన్ని దేశాల బోర్డులూ తమ ఆటగాళ్లకి వీడ్కోలు సిరీస్‌లు ఘనంగానే ఏర్పాటు చేస్తున్నాయి. సచిన్ మొదలు పాంటింగ్, కలిస్, సంగక్కర, క్లార్క్ ... ఇలా ఈ జాబితా పెద్దదే. మరికొందరికైతే ఈ హడావిడి కోసమే ప్రత్యేకంగా ఆఖరి మ్యాచ్ అవకాశం ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అలా చూస్తే సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ కూడా తక్కువవారేమీ కాదు. ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది... గౌరవంగా తప్పుకుంటారు లాంటి మాటలు మన దగ్గర తరచుగా వినిపిస్తాయి.
వీరు సాధించిన ఘనతలకు బోర్డు ఏదో ఒక మ్యాచ్‌లో అవకాశం కల్పించి మర్యాదగా సాగనంపడం సమస్య కాదు. కానీ అందుకు ఈ ముగ్గురు ఆటగాళ్లు సిద్ధమా అనేది ప్రశ్న. ఇంకా పునరాగమనంపై ఆశతో పోరాడుతున్న వీరు అధికారికంగా తాము తప్పుకుంటామని చెప్పే స్థితిలో లేరు. అలాంటి ప్రతిపాదన ఏదైనా చేస్తే బీసీసీఐ సమ్మతించవచ్చు. దక్షిణాఫ్రికా సిరీస్‌తో మొదలు పెట్టి ఇప్పుడు సుదీర్ఘ సీజన్ టీమిండియా ముంగిట ఉంది. వీరి కెరీర్‌కు ఫేర్‌వెల్ లేదా పోరాటం ముగిసిపోవడం ఈ ఏడాదిలోనే తేలిపోతుంది.