టీమిండియాపై కనిపించని హెడ్ కోచ్ ముద్ర
ఓటముల్లో కనిపిస్తున్న వైఫల్యం
భారత జట్టుకు వరుస పరాజయాలు
శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌లో ఓటమి... 36 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఒక టెస్టులో పరాజయం... భారత టెస్టు చరిత్రలో స్వదేశంలో తొలిసారి 0–3తో క్లీన్‌స్వీప్... ఇన్నింగ్స్‌లో 46కే ఆలౌట్... ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరే అవకాశం చేజార్చుకున్న పరిస్థితి... హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియాకు ఎదురైన నిరాశాజనక ఫలితాలు ఇవి.
ఒక్క బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ విజయం మినహా హెడ్ కోచ్‌గా అతను చెప్పుకోదగ్గ ఘనమైన ప్రదర్శన ఏదీ భారత జట్టు నుంచి రాలేదు. మైదానంలో జట్టు పరాజయాలకు ఆటగాళ్ల వైఫల్యం కారణం కావచ్చు. కానీ జట్టు కోచ్ కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీమిండియాకు ఓటములు ఎదురైనప్పుడు అప్పటి కోచ్‌లంతా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నవారే.
అన్నింటికి మించి ఎంతో ఇష్టంతో బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసిన కోచ్... గతంలో జట్టుకు కోచ్‌గా పని చేసిన వ్యక్తులను విమర్శిస్తూ తానైతే అద్భుతాలు సాధిస్తానంటూ పదే పదే చెబుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు కోచ్‌గా ఫలితాలు రాబట్టలేకపోతే కచ్చితంగా తప్పు పట్టాల్సిందే. గంభీర్ వాటికి అతీతుడేమీ కాదు! –సాక్షి క్రీడా విభాగం
భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపిక కాకముందు గంభీర్ ఏ స్థాయిలో కూడా కోచ్‌గా పని చేయలేదు. ఏ జట్టు సహాయక సిబ్బందిలోనూ అతను భాగంగా లేడు. 2018లో ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత మూడు ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లకు మెంటార్‌గా పని చేశాడు. ఇందులో 2024లో అతను మెంటార్‌గా వ్యవహరించినప్పుడు కోల్‌కతా జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. సాధారణంగా ఏ జట్టు కోచ్‌లైనా చేసే పనులు అతనేవీ చేయలేదు.
ప్రాక్టీస్ సెషన్లలో నేరుగా భాగమై ప్రణాళికలు రూపొందించడం, త్రోడౌన్స్ ఇవ్వడం, ఆటగాళ్ల టెక్నిక్‌లను చక్కదిద్దే పని చేయడం... ఇవన్నీ గంభీర్ చూపించలేదు. ఒక టి20క్లబ్ టీమ్‌కు మెంటార్‌గా పని చేస్తూ అప్పుడప్పుడు మార్గనిర్దేశనం ఇవ్వడంతో పోలిస్తే ఒక జాతీయ జట్టుగా కోచ్ అనేది పూర్తిగా భిన్నమైన బాధ్యత. అయితే ఆటగాడిగా గంభీర్ రికార్డు, జట్టు పట్ల అతని అంకితభావం చూసిన వారు కోచ్‌గా కొత్త తరహాలో జట్టును తీర్చిదిద్దగలడని నమ్మారు.
అయితే అతను రాక ముందు వరకు వరుస విజయాల్లో శిఖరాన ఉన్న టీమ్ మరింత పైకి లేవడం సంగతేమో కానీ ఇంకా కిందకు పడిపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడంపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ 8 టెస్టుల్లో 6 పరాజయాలతో దానికి జట్టు దూరమైంది.
ఆ ముగ్గురు ఏం పని చేశారో?
నిజానికి తాను పూర్తి స్థాయిలో కోచ్‌గా పని చేయలేదనే విషయం గంభీర్‌కూ తెలుసు. అందుకే అతను సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో తనకు సన్నిహితులైన వారిని తీసుకున్నాడు. ఐపీఎల్‌లో తనతో కలిసి పని చేసిన మోర్నీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), అభిషేక్ నాయర్ (భారత్), టెన్ డస్కటే (నెదర్లాండ్స్) బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌లుగా వచ్చారు. వీరిని స్వయంగా ఎంచుకునేందుకు బీసీసీఐ గంభీర్‌కు అవకాశం ఇచ్చింది.
అయితే ఆటగాడిగా మోర్కెల్‌కు మంచి రికార్డు ఉన్నా... మిగతా ఇద్దరికి పెద్దగా పేరు లేదు. అసలు గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఏం పని చేశారో, ఎలాంటి ప్రభావం చూపించారో కూడా తెలీదు. కొన్నేళ్లు వెనక్కి వెళితే ఇంగ్లండ్ సిరీస్‌లో వరుసగా ఘోరమైన ప్రదర్శన తర్వాత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సూచనలతో తనను తాను మార్చుకొని మంచి ఫలితాలు సాధించానని, అందుకు కృతజ్ఞుడినని కోహ్లి స్వయంగా చాలాసార్లు చెప్పుకున్నాడు.
ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఒకే తరహాలో కోహ్లి అవుటవుతున్న సమయంలో కనీసం అతని ఆటలో స్టాన్స్ మొదలు ఆడే షాట్ విషయంలో మార్పు గురించి చర్చ అయినా జరిగిందా అనేది సందేహమే. ఐదు టెస్టుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లను గమనిస్తే ఒక్కసారి కూడా గంభీర్ మైదానంలో చురుగ్గా ఆటలో భాగమైనట్లు ఎక్కడా కనిపించలేదు. అసలు కోచ్‌గా అతని ముద్ర ఎక్కడా కనిపించనే లేదు.
దిగితే కానీ లోతు తెలీదు...
కొంత కాలం క్రితం వరకు కామెంటేటర్‌గా పని చేసినప్పుడు, టీవీ షోలలో మాజీ ఆటగాళ్లను విమర్శించడంలో గంభీర్ అందరికంటే ముందు ఉండేవాడు. అప్పటి వరకు పని చేసిన వారిని తక్కువ చేసి మాట్లాడుతూ జట్టులో మార్పులపై సూచనలు చేసేవాడు. ముఖ్యంగా ‘ఇది భారత అత్యుత్తమ టెస్టు జట్టు’ అని చెప్పుకున్న కోచ్ రవిశాస్త్రిని అతను బాగా తప్పు పట్టాడు. కెరీర్‌లో ఆయన ఏం సాధించాడని, ఇలాంటి వారే అలాంటి మాటలు మాట్లాడతారని కూడా గంభీర్ వ్యాఖ్యానించాడు.
అయితే శాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడే భారత్ వరుసగా రెండుసార్లు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్ గెలిచిందనే విషయాన్ని అతను మర్చిపోయాడు. రవిశా్రస్తికి కూడా కోచ్‌గా అనుభవం లేకున్నా జట్టులో స్ఫూర్తి నింపడంలో అతని తర్వాతే ఎవరైనా. ప్లేయర్లకు స్నేహితుడి తరహాలో అండగా నిలిచి మైదానంలో సత్తా చాటేలా చేయడం అతనికి బాగా వచ్చు.
‘అడిలైడ్ 36 ఆలౌట్’ తర్వాత టీమ్ అంతా కుంగిపోయి ఉన్న దశలో శాస్త్రి ‘మోటివేషన్ స్పీచ్’ వల్లే తాము కొత్త ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగి సిరీస్ గెలిచే వరకు వెళ్లగలిగామని ఆటగాళ్లంతా ఏదో ఒక సందర్భంలో చెప్పుకున్నారు. గంభీర్ ఇలాంటి పని కూడా చేయలేకపోయాడు.
కోచ్‌గా ఎంత వరకు!
గంభీర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి భారీ వ్యాఖ్యలైతే చాలా చేశాడు. బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత ‘ఒకే రోజు 400 పరుగులు చేయగలిగే, అవసరమైతే రెండు రోజులు నిలిబడి ‘డ్రా’ చేయగలిగే జట్టును తీర్చిదిద్దుతా’ అని అతను అన్నాడు. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్‌లలో ఇందులో ఏదీ జరగలేదు. ఈ రెండు సిరీస్‌లలో కలిపి రెండుసార్లు మాత్రమే స్కోరు 400 దాటింది. తన మాటలకు, వ్యాఖ్యలకు దేశభక్తి రంగు పులమడం గంభీర్‌కు అలవాటుగా మారింది. కోచ్‌గా ఎంపికైన సమయంలోనూ ‘దేశానికి సేవ చేయబోతున్నా.
140 కోట్ల భారతీయుల దీవెనలు ఉన్నాయి’ తదితర మాటలతో ముందుకు వచ్చిన అతను సిడ్నీ టెస్టులో పరాజయం తర్వాత జట్టు ముఖ్యం అనే వ్యాఖ్యతో ఆగిపోకుండా ‘దేశం అన్నింటికంటే ముఖ్యం’ అంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. సాధారణంగా ఇలాంటి వరుస పరాజయాల తర్వాత సహజంగానే కోచ్‌పై తప్పుకోవాలనే ఒత్తిడి కూడా వస్తుంది.
అయితే బీసీసీఐ పెద్దల అండ ఉన్న గంభీర్‌పై ఇప్పటికిప్పుడు వేటు పడకపోవచ్చు. కాంట్రాక్ట్ 2027 వరల్డ్‌కప్ వరకు ఉన్నా... ఆలోగా ఎలాంటి ఫలితాలు అందిస్తాడనేది చూడాలి. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌ను పక్కన పెడితే చాంపియన్స్ ట్రోఫీ కోచ్‌గా గంభీర్‌కు పెద్ద పరీక్ష. ఇక్కడా విఫలమైతే ఇక తన వల్ల కాదంటూ తప్పుకునే అవకాశామూ
Comments
Please login to add a commentAdd a comment