ముంబై: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వరుస విజయాలతో ఫైనల్ వరకు చేర్చిన శిక్షణా బృందంపై బీసీసీఐ నమ్మకముంచింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర ముగ్గురు కోచ్‌ల కాంట్రాక్ట్‌ను పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు కూడా మళ్లీ అవకాశం దక్కింది. వీరందరి కాంట్రాక్ట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది.
పొడిగింపుపై అప్పటి వరకు బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బృందాన్ని మరికొంత కాలం కొనసాగించడమే సరైందిగా బోర్డు భావించింది. ముందుగా దీనికి సంబంధించి ద్రవిడ్‌కు సమాచారం అందించింది. ద్రవిడ్ అంగీకరించకపోతే మరో ప్రత్యామ్నాయం వైపు బోర్డు చూసే ఆలోచనలో ఉండగా...ద్రవిడ్ కోచ్‌గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశాడు.
వీరి కాంట్రాక్ట్ ఎప్పటి వరకు అనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినా... వచ్చే ఏడాది జూన్–జూలైలో జరిగే టి20 ప్రపంచ కప్ వరకు ఉండే అవకాశం ఉంది. మరో వైపు వన్డే, టి20లకు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేరుపై కూడా చర్చ జరిగినా...నెహ్రా విముఖత చూపడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు సమాచారం.
అందుకే కొనసాగింపు...
గత రెండేళ్లుగా ద్రవిడ్, అతని సహచర కోచింగ్ బృందం భారత జట్టులో తీసుకొచ్చిన మార్పులు, ఏర్పరచిన మంచి వాతావరణం మున్ముందూ కొనసాగించాలని బీసీసీఐ అనుకుంది. కొత్తగా వచ్చే కోచ్‌తో ఇవన్నీ ఒక్కసారి మారిపోతే కష్టమని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. కోచ్ మారితే అతనితో పాటు ఇతర సహాయక సిబ్బంది కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ద్రవిడ్ బృందం భవిష్యత్తులో ఎప్పటి వరకు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేకపోయినా... ఇదే జట్టు సహకారంతో కనీసం మరో ఐసీసీ టోర్నీలో జట్టు పాల్గొనడమే సరైందని వారు భావించారు.
‘రాహుల్ ద్రవిడ్‌కు బోర్డు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. మూడు ఫార్మాట్‌లలో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ అగ్రస్థానంలో ఉంది. ద్రవిడ్ దూరదృష్టి, ఆలోచన, ప్రణాళిక అందుకు కారణం. వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు ముందు వరుసగా పది మ్యాచ్‌లు గెలవడం అసాధారణ ప్రదర్శన. అందుకు హెడ్‌కోచ్‌ను తప్పకుండా అభినందించాలి. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు వారికి అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. తనకు కొనసాగింపు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు.
‘భారత జట్టుతో నా ప్రయాణంలో ఎన్నో మధుర క్షణాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో విజయాలు, పరాజయాలతో ఎత్తుపల్లాలు చవిచూశాం. ఆటగాళ్లు, మా శిక్షణా బృందం మధ్య మంచి అనుబంధం ఉంది. డ్రెస్సింగ్ రూమ్‌లో మేం నెలకొల్పిన మంచి సంస్కృతి పట్ల గర్వంగా ఉన్నాం. అద్భుతమైన ప్రతిభ ఉన్న మా జట్టుకు సరైన మార్గనిర్దేశనం చేసి మంచి ఫలితాలు సాధించేలా చేయడంలో సఫలమయ్యాం. నాపై నమ్మకం ఉంచి మళ్లీ అవకాశం కల్పించిన బోర్డుకు కృతజ్ఞతలు. ప్రపంచకప్ తర్వాత రాబోయే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ద్రవిడ్ తన స్పందనను తెలియజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment