భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎంపిక కోసం త్వరలో ప్రకటన
బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టీకరణ
ముంబై: టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దాని కోసం మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తులు కోరతామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత జట్టు వరల్డ్ కప్‌కు బయల్దేరే ముందే ఈ ప్రక్రియ మొదలవుతుందని కూడా జై షా చెప్పారు. గత ఏడాది రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త కోచ్‌పై చర్చ జరగడంతో కొంత గందరగోళం నెలకొంది. దాంతో ద్రవిడ్‌నే మరో ఏడాది కొనసాగించారు. ఈసారి అలాంటి స్థితి రాకుండా బోర్డు ముందే జాగ్రత్త పడుతోంది.
ఒప్పందం ప్రకారం వచ్చే జూన్‌లో ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ మళ్లీ కోచ్‌గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని... కొన్ని ఇతర జట్ల తరహాలో వేర్వేరు ఫార్మాట్‌లకు వేర్వేరు కోచ్‌లను ఎంపిక చేసే ఆలోచన లేదని కూడా షా పేర్కొన్నారు.
కొత్త హెడ్ కోచ్‌కు మూడేళ్ల పదవీ కాలం ఇస్తామని, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కొనసాగుతాడని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కోచ్ ఎంపిక విషయంలో క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)దే తుది నిర్ణయమన్న షా... విదేశీ కోచ్ అయినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరని జట్లలో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కలిసి మే 24న తొలి బృందంగా టి20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరతారని జై షా వెల్లడించారు. ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను ప్రయోగాత్మకంగానే పెట్టామని, అవసరమైతే దీనిపై మళ్లీ చర్చించి కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చేర్చకపోవడంలో తన పాత్ర ఏమీ లేదని... ఇది పూర్తిగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయమని ఆయన సందేహ నివృత్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment