టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు | Gautam Gambhir Likely To Be Announced As Team India's Head Coach By June End | Sakshi
Sakshi News home page

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు

Published Sun, Jun 16 2024 12:58 PM | Last Updated on Sun, Jun 16 2024 1:04 PM

Gautam Gambhir Likely To Be Announced As Team India's Head Coach By June End

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్‌) చివరి వారంలో గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో  బీసీసీఐ అతి త్వరలోనే రాహుల్‌ వారసుడి పేరును ప్రకటించవచ్చని సమాచారం.

ఒకవేళ ఇదే నిజమైతే 42 ఏళ్ల గంభీర్‌కు ఫుల్‌టైమ్‌ హెడ్‌ కోచ్‌గా ఇదే మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్‌ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్‌ హెడ్‌ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతోనే గంభీర్‌కు టీమిండియా హెడ్‌ కోచ్‌గా అవకాశం వచ్చింది.

టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి కోసం రికీ పాంటింగ్‌, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, మహేళ జయవర్దనే, జస్టిన్‌ లాంగర్‌ లాంటి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్‌వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.

బీసీసీఐకి చెందిన ఓ కీలక ‍వ్యక్తి అందించిన సమాచారం మేరకు గంభీర్‌ తన సపోర్టింగ్‌ స్టాఫ్‌ను తనే ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ గంభీర్‌ పెట్టిన ఈ షరతుకు బీసీసీఐ అంగీకరిస్తే ప్రస్తుతమున్న సపోర్టింగ్‌ స్టాఫ్‌ ద్రవిడ్‌తో పాటు తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌, బౌలింగ్‌ కోచ్‌గా పరస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌గా టి దిలీప్‌ ఉన్నారు.

టీ20 వరల్డ్‌కప్‌ 2024 తర్వాత భారత్‌ జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంభీర్‌ కోచ్‌గా నియమితుడైతే జింబాబ్వే పర్యటన నుంచే అతని విధులు మొదలవుతాయి. జులై 6 నుంచి 14 మధ్యలో జరిగే జింబాబ్వే పర్యటనలో భారత్‌ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement