
మా పోరాటం సరిపోలేదు: గంభీర్
న్యూఢిల్లీ:ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పట్ల ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ముంబైతో మ్యాచ్ లో తమ పోరాటం సరిపోలేనందువల్లే ఓటమి పాలైనట్లు గంభీర్ తెలిపాడు. తమ సమష్టి వైఫల్యం కారణంగా తుది పోరుకు అర్హత సాధించలేకపోయామన్నాడు.
'కేకేఆర్ మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. మా జర్నీ చాలా కఠినంగా సాగింది. మా శక్తి వంచన లేకుండా పోరాటం సాగించాం. అయితే కీలక మ్యాచ్ లో చతికిలబడ్డాం. ఇక్కడ మా పోరాటం సరిపోలేదు. దాంతో నిష్క్రమించాల్సి వచ్చింది'అని గంభీర్ ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి పరాజయం చెందింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ -2లో ముంబై ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది.