
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరో సారి విమర్శకు దిగాడు. ఇప్పటి వరకు సారథిగా విరాట్ కోహ్లి గొప్పగా చెప్పుకోవడానికేమీ లేదని గంభీర్ వ్యాఖ్యానించాడు. బ్యాట్స్‌మన్‌గా అన్ని ఫార్మాట్లలో ఆటగాడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన విరాట్... కెప్టెన్‌గా సాధించాల్సింది చాలా ఉందని అభిప్రాయ పడ్డాడు. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటితేనే గొప్ప సారథుల జాబితాలో కోహ్లికి చోటు దక్కుతుందని అతను అన్నాడు. జట్టులోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలను సరిగా గుర్తించి వారిని ప్రోత్సహించినప్పుడు మాత్రమే మెగా ఈవెంట్‌లలో భారత్ టైటిల్ గెలిచే అవకాశముంటుందని పేర్కొన్నాడు. ‘నిజం చెప్పాలంటే భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లి గొప్ప విజయాలేమీ సాధించలేదు. బ్యాట్స్‌మన్‌గా విరాట్ భారీగా పరుగులు చేస్తున్నాడు.
మిగతా వారిలో అతను ప్రత్యేకం. కోహ్లిలా ఇతరులు పరుగులు సాధించలేకపోవచ్చు కానీ కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల ప్రతిభను అతను బయటకి తీయాలి. తన సామర్థ్యంతో వారిని పోల్చకూడదు. ఎవరికి వారే ప్రత్యేకం కాబట్టి వారిలో అత్యుత్తమ ఆట బయటకు వచ్చేలా కోహ్లి ప్రోత్సహించాలి. వరల్డ్‌కప్ లాంటి మెగా టైటిళ్లు గెలిస్తేనే గొప్ప. లేకుంటే కెరీర్‌లో అదో లోటుగా మిగిలిపోతుంది. ఆస్ట్రేలియాలో తొలిసారి సిరీస్ గెలవడంతో పాటు జట్టును నంబర్‌వన్‌గా నిలిపి టెస్టుల్లో కోహ్లి కెప్టెన్‌గా మంచి ఘనతలు సాధించాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ద్వైపాక్షిక సిరీస్ విజయాలతోనే సరిపెట్టుకుంటున్నాడు. 2018 ఆసియా కప్ కూడా రోహిత్ కెప్టెన్సీలో భారత్ గెలుపొందింది’ అని గంభీర్ గుర్తు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment