
న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తంచేస్తుంటాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో యుద్ధం చేయడమే సరైందని ఘాటు వ్యాఖ్యలు చేసిన గంభీర్.. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై గుస్సా అయ్యారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ శనివారం నాటి పత్రికల్లో కేజ్రీవాల్ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ట్విటర్ వేదికగా ఏకిపారేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచార ఆర్భాటాల కోసం చేసే ఖర్చును తగ్గించుకోవాలని హితవు పలికారు. పత్రికలన్నీ కేజ్రీవాల్ ప్రకటనలతో నిండిపోయి...కేజ్రీవాల్ మాల్‌ని తలపించాయంటూ ఎద్దేవా చేశారు. ఇది పన్ను చెల్లింపుదారుల సొమ్ముని దుర్వినియోగం చేయడం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేజ్రీవాల్ దగ్గర డబ్బులు లేవని అనుకున్నామని.. కానీ ఇలా ప్రజల సొమ్మును ఖర్చుచేయడం ఏంటని నిలదీశారు. కేజ్రీవాల్ పత్రికా ప్రకటనలకు సంబంధించిన క్లిప్పింగ్‌లను కూడా తన ట్వీట్‌కి గౌతమ్ గంభీర్ జతచేర్చాడు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ ప్రచార కోసం సొంత నిధులు ఖర్చు చేయాలని సూచించారు. పన్నుచెల్లింపుదారుల సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకే ఉపయోగించాలన్నారు. 2 కోట్ల జనాభా గల ఢిల్లీలో అనేక సమస్యలను వదిలేసి సీఎం కేజ్రీవాల్ ప్రత్యేక ధర్నా చేపట్టడం.. సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక ఢిల్లీకి రాష్ట్రహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ మార్చి1 ధర్నా ప్రారంభించనున్నారు. రాష్ట్ర హోదా ప్రకటించే వరకు ఈ ధర్నా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక గంభీర్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ అనంతరం రాజకీయాల్లోకి రాబోతున్నారని, బీజేపీ తరఫున బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో గంభీర్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment