‘ఛేజ్’ చేశారు | Gautam Gambhir steers KKR to comprehensive win | Sakshi
Sakshi News home page

‘ఛేజ్’ చేశారు

Published Thu, May 8 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

‘ఛేజ్’ చేశారు

‘ఛేజ్’ చేశారు

8 వికెట్లతో ఢిల్లీపై కోల్‌కతా గెలుపు
  రాణించిన గంభీర్, ఉతప్ప
 
 ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా నాలుగు ఓటములు... అన్నీ ఛేజింగ్‌లోనే... సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లను పోగొట్టుకుంటూ అభాసుపాలవుతున్న కోల్‌కతా ఎట్టకేలకు ఒత్తిడిని జయించింది. లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి... ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచింది. తద్వారా సీజన్‌లో మూడో విజయం సాధించింది.
 
 న్యూఢిల్లీ: గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గంభీర్ అద్భుతంగా ఆడినా కోల్‌కతా సహచరులు నాటకీయంగా కుప్పకూలి మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. ఈసారి సహచరులను నమ్మి తప్పుచేయొద్దనుకున్నాడేమో... నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ (56 బంతుల్లో 69; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టు ఖాతాలో విజయాన్ని చేర్చాడు.

గంభీర్‌తో పాటు ఉతప్ప (34 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో.... ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. డుమిని (28 బంతుల్లో 40 నాటౌట్; 3 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కెప్టెన్ గంభీర్, ఉతప్ప తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించగా... మనీష్‌పాండే (14 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు), కలిస్ (6 బంతుల్లో 10 నాటౌట్; 1 ఫోర్) లాంఛనం పూర్తి చేశారు. గంభీర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
 రాణించిన డుమిని, కార్తీక్
 నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించడంతో డేర్‌డెవిల్స్ శుభారంభం చేయలేకపోయింది. రెండు ఫోర్లు కొట్టి జోష్‌లో ఉన్నట్లు కనిపించిన డి కాక్ (10) మూడో ఓవర్‌లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. క్రీజ్‌లో సెటిలయ్యేందుకు ఇబ్బందిపడ్డ ఢిల్లీ కెప్టెన్ పీటర్సన్ (6) అనవసర పరుగుకోసం యత్నించి రనౌటయ్యాడు.
 
 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను విజయ్, దినేశ్ తమ భుజాన వేసుకున్నారు. అయితే మూడో వికెట్‌కు 35 పరుగులు జోడించిన తర్వాత విజయ్ (24) డగౌట్‌కి చేరాడు. కలిస్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన కార్తీక్ (36) ఆ తర్వాతి ఓవర్‌లో అవుటయ్యాడు. శుక్లా (10) వెనుదిరిగాక.. డుమిని, కేదార్ జాదవ్ కోల్‌కతా బౌలర్లపై దాడికి దిగారు. డుమిని సిక్సర్లతో విరుచుకుపడగా.. జాదవ్ ఫోర్లు బాదాడు. చివరి నాలుగు ఓవర్లలో 54 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. డుమిని, జాదవ్ అభేద్యమైన ఆరోవికెట్‌కు 55 పరుగులు జోడించారు.
 
 అదిరిపోయే ఆరంభం
 తొలి ఓవర్‌లో ఓపెనర్లు ఇబ్బందిపడ్డా రెండో ఓవర్ నుంచి చెలరేగిపోయారు. పరుగుల కోసం ఉతప్ప, గంభీర్ పోటీపడ్డారు. దీంతో పవర్ ప్లేలో 52 పరుగులు వచ్చాయి. ఇద్దరు అదే ఊపును కొనసాగించడంతో 11వ ఓవర్‌లో వంద పరుగులు దాటింది. విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఉతప్ప, పార్నెల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. గంభీర్‌తో కలిసి తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించిన ఉతప్ప మూడు పరుగుల తేడాతో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. మరోవైపు జోరుమీదున్న కెప్టెన్ గంభీర్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మనీష్ పాండేతో కలిసి జట్టును విజయపథాన నడిపించే ప్రయత్నంలో గంభీర్ అవుటయ్యాడు. అయితే మనీష్‌పాండే, కలిస్ జట్టును గెలిపించారు.
 
 స్కోరు వివరాలు
 ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) గంభీర్ (బి) ఉమేశ్ 10; విజయ్ (సి) నరైన్ (బి) కలిస్ 24; పీటర్సన్ రనౌట్ 6; దినేశ్ కార్తీక్ (సి) కలిస్ (బి) షకీబ్ 36; డుమిని నాటౌట్ 40; శుక్లా (బి) నరైన్ 10; కేదార్ జాదవ్ నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) : 160
 వికెట్ల పతనం: 1-14; 2-26; 3-61; 4-85; 5-105.
 బౌలింగ్: సూర్య కుమార్ 1-0-8-0; కలిస్ 4-0-38-1; ఉమేశ్ 4-0-26-1; షకీబ్ 4-0-13-1; నరైన్ 4-0-38-1; వినయ్ 3-0-31-0.
 
 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప ఎల్బీడబ్ల్యూ (బి) పార్నెల్ 47; గంభీర్ (సి) కార్తీక్ (బి) పార్నెల్ 69; మనీష్ పాండే నాటౌట్ 23; కలిస్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) : 161
 వికెట్ల పతనం: 1-106; 2-151.
 బౌలింగ్: షమీ 4-0-23-0; పార్నెల్ 4-0-21-2; శుక్లా 2-0-19-0; కౌల్ 3-0-29-0; డమిని 2-0-24-0; నదీమ్ 3.2-0-34-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement