బీసీసీఐకి ఇద్దరు అధ్యక్షులు
న్యూఢిల్లీ: ఒక్క రోజులోనే రకరకాల మలుపులు తిరిగిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు వ్యవహారంలో చివరకు అందరికీ సంతోషకరమైన ఆదేశాలే వచ్చాయి. కేసును విచారిస్తున్న ద్విసభ్య సుప్రీం కోర్టు బెంచ్ ఏకే పట్నాయక్, ఇబ్రహీం ఖలీఫుల్లా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎవరేం చేయాలంటే...
గవాస్కర్: ఐపీఎల్‌కు సంబంధించినంత వరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మిగిలిన బోర్డు వ్యవహారాలతో సంబంధం లేదు. బీసీసీఐ కామెంటేటర్‌గా ఉన్న కాంట్రాక్టును వదిలేసుకోవాలి. ఇందుకుగాను పరిహారం పొందొచ్చు.
అంటే బోర్డు చరిత్రలో తొలిసారి ‘పెయిడ్ అధ్యక్షుడు’గా గవాస్కర్ వ్యవహరించబోతున్నారు. అయితే ఐపీఎల్‌ను నడపడానికి గవర్నింగ్ కౌన్సిల్ ఉంది. లీగ్ సీఈఓ సుందర్ రామన్‌ను కొనసాగించాలా లేదా అనే విషయంలో గవాస్కర్ నిర్ణయం తీసుకోవచ్చు. తను కావాలంటే కొత్తగా ఎవరినైనా లీగ్ నిర్వహణ కోసం నియమించుకోవచ్చు.
శివలాల్ యాదవ్: ఐపీఎల్ మినహా మిగిలిన బోర్డు వ్యవహారాలన్నింటికి సంబంధించి శివలాల్ యాదవ్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కేసు విచారణ ముగిసే వరకు లేదా తర్వాతి ఏజీఎమ్ వరకు బోర్డు పూర్తి పరిపాలనా బాధ్యత శివలాల్‌దే.శ్రీనివాసన్: ఈ కేసు విచారణ ముగిసే వరకు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారు. జూన్‌లో ఐసీసీ ఛైర్మన్ పదవి చేపడతారు. విచారణ ముగిశాక తిరిగి బోర్డు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవచ్చు.
ఐపీఎల్: లీగ్‌కు ఎలాంటి సమస్యా లేదు. ఎప్పటిలాగే ఎనిమిది జట్లు ఆడతాయి. రాజస్థాన్, చెన్నై జట్లు కూడా పాల్గొంటాయి. ‘క్రికెట్ అభిమానుల కోసం ఈ రెండు జట్లను అనుమతిస్తున్నాం’ అని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. కాబట్టి ఎప్పటిలాగే ఏప్రిల్ 16న యూఏఈలో ఐపీఎల్ ప్రారంభమవుతుంది.
ఇతర ముఖ్య అంశాలు
ఇండియా సిమెంట్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులెవరూ బోర్డు కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. అయితే ఆటగాళ్లు, కామెంటేటర్లకు ఇది వర్తించదు. అంటే ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడు ధోనికి సంబంధించి ఎలాంటి అడ్డంకులూ లేవు. తను ఎప్పటిలాగే క్రికెట్ ఆడుకోవచ్చు.
అన్ని వాదనలు పూర్తయి తుది తీర్పు వెలువడే వరకు ఈ ఆదేశాలన్నీ అమల్లో ఉంటాయి. ఏప్రిల్ 16న తదుపరి విచారణ జరుగుతుంది.
సమర్థవంతంగా నిర్వర్తిస్తా...
విశాఖపట్నం, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టు తనపై నమ్మకంతో అప్పజెప్పిన బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. తన ఆటలాగే విధుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. శుక్రవారం ఇక్కడ ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గవాస్కర్ పాల్గొన్నారు. ‘బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసేందుకు నేను తగిన వాడినని సుప్రీంకోర్టు భావించడం నా అదృష్టం. దీనినో గౌరవంగా భావిస్తున్నా. నా క్రికెట్ కెరీర్‌లాగే ఇక్కడ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తాను’ అని సన్నీ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భగవాన్ సత్యసాయి బాబా అంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని, ఆయన ఆశీస్సుల వల్లే బీసీసీఐ అధ్యక్ష పదవి తనను వరించిందన్నారు.
చాలా సంతోషం...
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడిగా తాను ఎంపిక కావడం పట్ల మాజీ క్రికెటర్, సీనియర్ ఉపాధ్యక్షులు నందలాల్ శివలాల్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. తాను ఈ పరిణామాలు ఊహించలేదని, అయితే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఐపీఎల్‌ను మినహాయించి అధ్యక్షుడిగా ఇతర బీసీసీఐ బాధ్యతలు నాకు అప్పజెప్పటం ఆనందంగా ఉంది. బోర్డుతో పాటు హెచ్‌సీఏలో కూడా క్రికెట్ వ్యవహారాల నిర్వహణలో నాకున్న అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుందని భావిస్తున్నా’ అని శివలాల్ చెప్పారు. వీలైనంత త్వరగా బాధ్యతలు చేపడతానని యాదవ్ చెప్పారు. ‘పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ఎలా ముందుకు సాగాలో నిర్ణయించుకుంటాను. నా వైపు నుంచి బోర్డును బాగా నడిపేందుకు ప్రయత్నిస్తాను’ అని శివలాల్ పేర్కొన్నారు.