
జట్టు ఓడింది.. మంత్రిపై వేటు పడింది!
అక్రా: ఆటలో ఏ టీం అయినా ఓటమి పాలైనప్పుడు ఆ జట్టులో సభ్యులను మార్చడం గానీ, కెప్టన్ ను తొలగించడం గానీ తరుచు మనం చూస్తూ ఉంటాం. కాగా, జట్టు ఓటమికి క్రీడల మంత్రిని బాధ్యున్ని చేయడం ఎక్కడైనా చూసామా? ఇప్పుడు వరకూ అయితే అటువంటి ఘటనలు చూసిన దాఖలాలు లేవు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే.. ఫిఫా ప్రపంచకప్ లో ఘనా జట్టు ఘోర ఓటమికి ఆ శాఖ మంత్రిని బాధ్యున్ని చేస్తూ ఏకంగా తొలగించేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. తాజాగా బ్రెజిల్ లో జరుగుతున్న సాకర్ టోర్నీలో తొలి రౌండ్ కూడా దాటని ఘనా టీం పేలవమైన ప్రదర్శనకు గాను ఆ శాఖ మంత్రిగారిపై వేటు వేశారు. గ్రూప్-జి నుంచి బరిలోకి దిగిన ఘనా దారుణంగా ఆడి ఆదిలోనే ఇంటిముఖం పట్టింది.
గత రెండు ప్రపంచకప్‌లలో అంచనాలకు మించి రాణించి ఘనా ఈసారి మాత్రం ఆకట్టుకోలేక పోయింది. అయితే ‘గ్రూప్ ఆఫ్ డెత్’లో ఉన్న తమ జట్టును ప్రోత్సహించాలని నిర్ణయించిన అక్కడి ప్రభుత్వం 500 మంది అభిమానులను ప్రత్యేకంగా బ్రెజిల్‌కు తీసుకెళ్లింది. అయితే ఘనా ప్రదర్శనతో ఉలిక్కిపడిన ఆ దేశానికి ఆశాభంగం తప్పలేదు. దీంతో ఆగమేఘాల క్రీడల శాఖను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఆలోచనలో పడి మంత్రిని తప్పించింది. అసలు రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొరువుండదనే మరోసారి తాజాగా రుజువైంది.