ధావన్ క్యాచ్ మిస్ చేసిన షమ్సీ, గిబ్స్‌న్(సర్కిల్‌లో)
కేప్‌టౌన్ : భారత్‌తో జరిగిన చివరి టీ20లో ఓటమికి తమ ఆటగాళ్ల చెత్త ఫీల్డింగే కారణమని దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ అభిప్రాయపడ్డారు. సులువైన క్యాచ్‌లను జారవిడచడమే కాకుండా.. బంతిని ఆపడంలోను తమ ఆటగాళ్లు తడబడ్డారన్నారు. కేవలం ఈ మ్యాచ్‌లోనే కాదు ఓవరాల్ సిరీస్‌లో ఇవే తప్పులను ఆతిథ్య ఆటగాళ్లు చేశారని దీంతోనే సీరీస్‌లు కోల్పోయామన్నారు. ఇక భారత్‌లో అనుభవ బౌలర్లైన భువనేశ్వర్, బుమ్రాలు అద్భుతంగా రాణించారని, పవర్‌ప్లేలో పరుగులు రాకుండా కట్టడిచేశారని కితాబిచ్చారు. వారికి ఐపీఎల్ అనుభవం ఎంతగానో సహకరించిందని గిబ్సన్ పేర్కొన్నారు. తమ జట్టులో సైతం ఐపీఎల్ ఆడిన ఆటగాళ్లున్నారని కానీ వారంతగా రాణించలేదన్నారు. ముఖ్యంగా క్రిస్‌మొర్రిస్‌ను ఎన్నో సార్లు మ్యాచ్ విన్నర్‌గా చూశామని, కానీ అతని బౌలింగ్‌లో ఇంకా స్థిరత్వం కావాలని గిబ్సన్ చెప్పుకొచ్చారు.
ఈ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డాలా, క్లాసెన్, జాన్‌కర్‌లు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడారు. సీనియర్ ఆటగాళ్ల గాయాలు కూడా సిరీస్ ఒటమికి ఓ కారణమని తెలిపారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో కుర్రాళ్లు తడుబడుతున్నారని, సఫారీలకు అసలు పరీక్ష ఆస్ట్రేలియాతో ఎదురుకాబోతున్నది తెలిపారు. మార్చి1 నుంచి ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా 4 టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.
చివరి టీ20లో సఫారీ స్పిన్నర్ షామ్సీ ధావన్ 9, 34 పరుగుల వద్ద ఇచ్చిన రెండు క్యాచ్‌లను జారవిడిచిన విషయం తెలిసిందే. అనంతరం ధావన్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment