టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson) ఆట తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్(Krishnamachari Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ ‘ఇగో’ చూపించాలనుకుంటే మాత్రం జట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఇకముందైనా షాట్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని సూచించాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో రెండు టీ20 శతకాలతో చెలరేగిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.
స్వదేశంలో బట్లర్ బృందంతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్(India vs England)లో సంజూ మొత్తంగా కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు.. పదే పదే ఒకే రీతిలో అవుటయ్యాడు. షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో విఫలమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్లకు సులువైన క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగాడు.
‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు
ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. ‘‘సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృథా చేసుకున్నాడు. ఐదోసారి కూడా అదే రీతిలో అవుటయ్యాడు.
మరోసారి పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. నాకు తెలిసి.. అతడు తన ‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఇలా చేశాడని అనుకుంటున్నా. ‘లేదు.. లేదు.. నేను ఈ షాట్ కచ్చితంగా ఆడగలను’ అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.
అసలు అతడు ఫామ్‌లేమితో సతమతమయ్యాడా? లేదంటే.. ‘ఇగో’ ట్రిప్‌నకు ఏమైనా వెళ్లాడా? నాకైతే అతడి గురించి ఏమీ ఏమీ అర్థం కావడం లేదు. ఈ సిరీస్‌లో.. నిజంగా తీవ్రంగా నిరాశపరిచాడు.
జైస్వాల్ తిరిగి వస్తాడు
సంజూను చాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదని అంతా మాట్లాడుకుంటున్నాం కదా! ఇదిలో ఇలాగే ఆడితే మాత్రం.. సెలక్టర్లు మాత్రం అతడిపై మరోసారి వేటు వేస్తారు. యశస్వి జైస్వాల్ తిరిగి వస్తాడు. తదుపరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ను కాదని యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తారు’’ అని చిక్కా సంజూకు హెచ్చరికలు జారీ చేశాడు.
గాయం.. ఆరు వారాలు దూరం
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా గాయపడ్డ సంజూ శాంసన్.. ఆరు వారాలు పూర్తిగా ఆటకు దూరం కానున్నాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌కు కేరళ జట్టుకు అతడు అందుబాటులో ఉండటం లేదు. కాగా ఇంగ్లండ్‌తో ఆదివారం ముంబైలో జరిగిన చివరిదైన ఐదో టి20లో బ్యాటింగ్ చేస్తుండగా సీమర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతని కుడి చూపుడు వేలికి గాయమైంది.
‘స్కానింగ్‌లో స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో శాంసన్ ఆరు వారాలు ఆటకు దూరమవుతాడు. పుణే వేదికగా ఈ నెల 8 నుంచి 12 వరకు జమ్మూ కశ్మీర్‌తో కేరళ ఆడే రంజీ క్వార్టర్ ఫైనల్ పోరులో అతను బరిలోకి దిగడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సామ్సన్ ఐపీఎల్ కల్లా అందుబాటులో ఉంటాడని బోర్డు పేర్కొంది.
ఇక ఐపీఎల్‌లో సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం గురువారం(ఫిబ్రవరి 6) నాగ్‌పూర్‌లో జరిగే తొలి వన్డేతో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది.
చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment