'సెలక్టర్ గా చేయాలని ఉంది'
సిడ్నీ:ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ ఆ దేశ క్రికెట్ బోర్డులో కొత్త ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. తనకు ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు సెలక్టర్ గా చేయాలని ఉందంటూ మనసులోని బయటపెట్టాడు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా యార్క్షైర్కు సెలక్షన్ బాధ్యతలను చూసిన గిలెస్పీ.. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాలో సెలక్షర్ పదవిపై మక్కువగా ఉన్నాడు.
ఇప్పటికే వచ్చే బిగ్ బాష్ లీగ్లో అడిలైడ్ స్టైకర్కు కోచ్ గా వ్యవహరించనున్న గిలెస్పీ.. ఇక ఇంగ్లండ్ వెళ్లే ఉద్దేశం లేదని స్ఫష్టం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్ కు సెలక్షన్ బాధ్యతలు చూడాలని ఉన్నట్లు తెలిపాడు. 'యార్క్షైర్ నుంచి తప్పుకోవడం చాలా కఠినతో కూడిన నిర్ణయం. ప్రస్తుత కుటుంబ పరిస్థితులు, నా కెరీర్ను దృష్టిలో పెట్టుకునే ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేశాను. ఆసీస్ చీఫ్ సెలక్టర్ రాడ్ మార్ష్తో కలిసి పని చేయాలని ఉంది' అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వచ్చే సంవత్సరం జరిగే సెలక్టర్ల నియామకాల్లో తన పేరును బోర్డుకు సూచిస్తానని గిలెస్పీ పేర్కొన్నాడు.