‘బ్లాస్టర్ వెనక మాస్టర్!
ముంబై: గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఈ సారి ఐపీఎల్‌లో పెను సంచలనం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరుగుల సునామీతో పంజాబ్ జట్టును ఒక్కసారిగా ఒంటిచేత్తో ఫేవరెట్స్ జాబితాలోకి తీసుకొచ్చాడు. నిజానికి ఏడాది క్రితం మ్యాక్స్‌వెల్‌లో ఇంత జోరు లేదు. కానీ గత అక్టోబరులో చాంపియన్స్‌లీగ్ ద్వారా తన ‘రాత మారిపోయింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నేతృత్వంలో తను రాటుదేలి, ఆ తర్వాత మరింత విధ్వంసకర ఆటగాడిగా మారిపోయాడు.
గత ఏడాది ఐపీఎల్‌లో ముంబై తరఫున తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు మ్యాక్స్‌వెల్. కానీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అక్టోబరులో చాంపియన్స్‌లీగ్ కోసం ముంబై జట్టుతో చేరాడు. మ్యాక్స్‌వెల్‌లోని సహజనైపుణ్యం గుర్తించిన సచిన్... ఈ టోర్నీ సమయంలో తనకు చాలా సూచనలు ఇచ్చాడు.
నెట్స్‌లో తన వెనక నిలబెట్టుకుని ప్రాక్టీస్ చేయించాడు. స్టాన్స్ దగ్గరి నుంచి బంతిని పిక్ చేసే వరకు ప్రతి అంశంలోనూ శిక్షణ ఇచ్చాడు. సచిన్ వెనక నిలబడి మాస్టర్ ఎలా బ్యాట్ పట్టుకుంటున్నాడో, ఎలా పాదాలు కదుపుతున్నాడో అచ్చు అలాగే ప్రాక్టీస్ చేశాడు మ్యాక్స్‌వెల్. ఇది ఫలితాన్నిచ్చింది. చాంపియన్స్‌లీగ్ ఫైనల్లో కేవలం 14 బంతుల్లో 37 పరుగులతో తొలిసారి విశ్వరూపం చూపించాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. చాంపియన్స్ లీగ్ తర్వాత భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాక్స్ రాణించాడు.
ఆ సిరీస్‌లో మూడు అర్ధ సెంచరీలు బాదాడు. ఇక ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లోనూ మెరిశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 36.75 సగటుతో 147 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ కూడా ఉంది. ఇంతకంటే జోరైన బ్యాటింగ్‌ను ఐపీఎల్‌లో ప్రదర్శిస్తున్నాడు. అరబ్ ఎడారిలో పరుగుల తుపాన్ సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌కు పంజాబ్ రూ.6 కోట్లు వెచ్చించినప్పుడు ఆ జట్టును చూసి నవ్వుకున్న వారు కూడా లేకపోలేదు. అలాంటివారికి మ్యాక్స్‌వెల్ తన హిట్టింగ్‌తో సమాధానం చెబుతున్నాడు. ఇక అన్ని లీగ్‌లలోనూ తను కచ్చితంగా బాగా ఖరీదైన ఆటగాడిగా మారతాడు.