మురళీ విజయ్ ను తప్పించారు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పదో సీజన్ కోసం కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి మురళీ విజయ్ ను తప్పించింది. గత సీజన్ లో మురళీ విజయ్ ను సారథిగా నియమించిన కింగ్స్ పంజాబ్.. తాజా సీజన్ కోసం అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించింది. రాబోవు సీజన్ కోసం విజయ్ ను ఆటగాడిగా మాత్రమే పరిమితం చేసిన సదరు ఫ్రాంచైజీ అతని స్థానంలో మ్యాక్స్ వెల్ ను సారథిగా నియమించింది.
ప్రస్తుత కింగ్స్ పంజాబ్ జట్టులో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వెస్టిండీసీ ట్వంటీ 20 మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ, దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు హషీమ్ ఆమ్లాలు ఉన్నప్పటికీ మ్యాక్స్ వెల్ ను కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆశ్చర్యపరిచినప్పటికీ ఐపీఎల్-10వ సీజన్ లో కెప్టెన్లగా వ్యవహరించే ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఖ్య మూడుకు చేరింది. గత కొన్ని రోజుల క్రితం పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ను నియమించిన సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని తప్పించిన పుణె.. ఆ స్థానంలో స్మిత్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. మరొకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ గతేడాది బాధ్యతలు స్వీకరించాడు.