సిడ్నీ: ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఏడో స్థానంలో ఆడించడంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాక్స్‌వెల్‌ను సరైన స్థానంలో ఆడించకుండా అతడి సేవల్ని వృథా చేస్తున్నారని విమర్శించాడు. సాధారణంగా మాక్స్‌వెల్‌ను సందర్భాన్ని బట్టి మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఆడిస్తుంటారు. టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో మాత్రం ఏడో స్థానంలో ఆడించారు. ఏడో స్థానంలో ఆడిన అతడు కేవలం ఐదు బంతుల్ని మాత్రమే ఎదుర్కొని అజేయంగా 11 పరుగులు చేశాడు.
‘భారత్‌తో తొలి వన్డేలో మ్యాక్‌వెల్‌ను ఏడో స్థానంలో ఆడించి అతని సేవల్ని వృథా చేసినట్లే అనిపించింది. ఇక ముందైనా అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చండి. మిడిల్ ఆర్డర్‌లో మ్యాక్స్‌వెల్ సేవల్ని వినియోగించుకోవాలి. ఆటలో పరిస్థితిని బట్టి మీకు మంచి ఆరంభం కావాలంటే అతడిని మూడో స్థానంలో ఆడించొచ్చు’ అని బోర్డర్ పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా, ఆపై బ్యాటింగ్ చేసిన భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి పరాజయం చవిచూసింది. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment