న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్ లీగ్ దశను ఎఫ్‌సీ గోవా జట్టు 25 పాయింట్లతో అగ్రస్థానంతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గోవా 3-2తో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీని ఓడించింది. గోవా తరఫున ఫెర్నాండెజ్ (68, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా జోఫ్రే (90) గెలుపు గోల్ అందించాడు. అటు ఢిల్లీ తరఫున గ్రీనే (31), నబీ (40) గోల్స్ చేశారు. ఈనెల 11 నుంచి సెమీఫైనల్స్ జరుగుతాయి.