బెంగళూరు: ఆసియా హాకీలో భారత టాప్ ర్యాంకు నిలబెట్టడమే తమ లక్ష్యమని జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ఈ నెల 11 నుంచి బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. ఈ టోర్నీ కోసం హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్, కొత్త కోచ్ జోయెర్డ్ మరిన్ నేతృత్వంలో భారత సీనియర్ పురుషుల జట్టుకు ఆరు వారాల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై మన్‌ప్రీత్ మాట్లాడుతూ ‘ఆసియా టాప్ ర్యాంకు నిలబెట్టుకునేలా మా ప్రదర్శన ఉంటుంది. ప్రతీ జట్టు టైటిల్ గెలిచేందుకే బరిలోకి దిగుతుంది. మేం ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోం. ఇక్కడి శిబిరంలో మావాళ్లంతా చక్కగా సన్నద్ధమయ్యారు. కొత్త కోచ్ మా ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సన్నాహకాల్లో మార్పులేమీ జరగలేదు’ అని అన్నాడు. పూల్ ‘ఎ’లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా ఉంది. ఈ మ్యాచ్‌పై ఎక్కడలేని అంచనాలుంటాయని... తాము మాత్రం ప్రత్యర్థి ఎవరైనా ఓడించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతామని మన్‌ప్రీత్ అన్నాడు. భారత జట్టు ఆదివారం ఢాకాకు బయల్దేరింది.
భారత్ ‘ఎ’ కాంస్యం చేజారింది...
పెర్త్: ఆస్ట్రేలియన్ హాకీ లీగ్ (ఏహెచ్‌ఎల్)లో భారత్ ‘ఎ’ జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2–3తో న్యూసౌత్‌వేల్స్ చేతిలో పోరాడి ఓడింది. సిమ్రన్‌జీత్ సింగ్ (3వ ని.), అఫాన్ యూసుఫ్ (9వ ని.) చెరో గోల్ చేయగా... న్యూసౌత్ వేల్స్ తరఫున క్రెయిగ్ (39వ ని.), సైమన్ ఒర్చర్డ్ (55వ ని.), లాచ్లన్ షార్ప్ (56వ ని.) తలా ఒక గోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment