
ఆట మారింది... రాత మారుతుంది!
►భారత మహిళల క్రికెట్‌కు మంచి రోజులు
►వన్డే ప్రపంచకప్‌లో విశేష ప్రతిభ
►ఫైనల్లో ఓడినా... ఆద్యంతం ఆకట్టుకున్నారు
సాక్షి క్రీడావిభాగం :టీమిండియా గెలిచింది... విదేశీ గడ్డపై ఘనవిజయం... భారత్‌దే 2011 ప్రపంచకప్... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (2013) మనదే... ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్... ఐసీసీ ‘గద’ మనదే, అగ్రస్థానం మనదే! ఇవన్నీ చెప్పుకుంటూపోతే మన మదిలో మెదిలేది... పెదవి దాటి వచ్చేది పురుషుల క్రికెట్ జట్టు గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అమ్మాయిల జట్టు ఆడుతోంది. ఆ టీమ్ కూడా గెలుస్తోంది. ఇంటా బయటా అమ్మాయిలు రాణిస్తున్నారు. 2005 ప్రపంచకప్ రన్నరప్! అయినా మనకెవరికీ పట్టదు. కానీ... ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. కళ్లు అటువైపు ఫలితాల్ని కూడా వెతుక్కొంటున్నాయి. అమ్మాయిల స్కోర్లపై నెటిజన్ల సెర్చ్ పెరుగుతోంది. బెస్టాఫ్ లక్ ట్వీట్‌లు వెల్లువెత్తుతున్నాయి. పోస్ట్‌లు, షేరింగ్ ముంచెత్తుతున్నాయి.
అవునా..! నిజమా..! అంటే మీరింకా మేలుకోనట్లే లెక్క. ఎందుకంటే క్రికెట్ పురిటి గడ్డపై వారి జోరు హోరెత్తుతోంది. పవర్ సూపరవుతోంది. అంతలా అదరగొడుతున్నారు. అందర్నీ ఆ‘కట్టి’పడేస్తున్నారు. ఇదంతా భారత మహిళల ప్రతిభ గురించే... ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో మిథాలీ సేన విశేషంగా రాణించింది. అందరూ కలసికట్టుగా ప్రత్యర్థుల్ని మట్టికరిపించారు. సమష్టితత్వంతో కదంతొక్కారు.
సరిగ్గా 12 ఏళ్ల క్రితమే 2005లో మిథాలీ రాజ్ కెప్టెన్సీ లోనే భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. కానీ దురదృష్టం... క్రికెట్ ఓ మతమైన భారత్‌లో ఇది చాలా తక్కువ మందికే తెలుసు. 1983 నుంచి కపిల్ డెవిల్స్ ‘షో’తో పురుషుల క్రికెట్‌ను నెత్తికెత్తుకున్న భారత క్రికెట్ ప్రియులు మహిళల వైపు కన్నెత్తి చూడలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ముఖ్యంగా టీవీల్లో లైవ్ కవరేజ్ లేకపోవడం. మీడియాలో నిరాదరణ. ఆదరణ ఉన్నా.. ఒకటి, అర స్కోర్లకే తప్ప ప్రత్యేక కథనాలు లేకపోవడం. దీంతో ఎవరికంటా పడలేదు. అంతెందుకు ఇప్పుడు ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ను కూడా పూర్తి స్థాయిలో ప్రసారం చేయలేదు. కేవలం కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లే టీవీలో ప్రసారమయ్యాయి.
ఇంగ్లండ్‌లో గర్జన...
నిజానికి ఈ ప్రపంచకప్‌కు భారత మహిళలు నేరుగా అర్హత సాధించలేదు. క్వాలిఫయింగ్‌తో మొదలైన ఆట టైటిల్ వేట దాకా సాగింది. హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ జట్టును ముందుండి నడిపించింది. అందరి సమన్వయంతో గెలిపించింది. ఓపెనర్లు పూనమ్ రౌత్, స్మృతి మంధన సహా వేద కృష్ణమూర్తి వరకు ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తమ నిలకడ చూపెట్టారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో లీగ్ మ్యాచ్‌ల్లో ఓపెనర్ పూనమ్ రౌత్ మెరిసింది. ఇంగ్లండ్‌తో పాటు విండీస్‌పై గెలిచేందుకు స్మృతి మెరుపులు తక్కువేం కాదు. శ్రీలంక, దక్షిణాఫ్రికాలతో జరిగిన పోటీల్లో దీప్తి శర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. ఆరంభంలో అంతంతమాత్రంగా ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్ టోర్నీ జరుగుతున్న కొద్దీ సింహస్వప్నంగా తయారైంది.
న్యూజిలాండ్‌తో చావోరేవో మ్యాచ్‌లో, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆమెకు వేద కృష్ణమూర్తి శ్రుతి కలిసింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వేద చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ వైనం మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇక బౌలింగ్‌లోనూ భారత అమ్మాయిలు శ్రమించారు. బ్యాట్స్‌మెన్ పడ్డ కష్టానికి తమ వంతు సహకారం అందించారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బౌలింగ్‌లోనూ 12 వికెట్లు తీసింది. పూనమ్ యాదవ్ (11), జులన్ గోస్వామి (10) టాప్–10 బౌలర్ల జాబితాలో ఉన్నారు. ఏక్తా బిష్త్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రాజేశ్వరి గైక్వాడ్ (5/15) అద్భుత ప్రదర్శనతో కివీస్‌ను తిప్పేసింది. హర్మన్‌ప్రీత్, శిఖాపాండేలు కూడా జట్టుకు ఉపయోగపడ్డారు. ఇలా అందరూ ఒక్కటయ్యారు. సమష్టిగా ఫలితాలు సాధించారు.
ట్రాక్‌లో పడ్డారిలా...
ఈ ప్రపంచకప్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించినా... అంతకుముందు ఘనవిజయాలందుకున్న తీరూ అద్భుతమే. పటిష్టమైన ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో జయకేతనం. దక్షిణాఫ్రికాలాంటి మేటి జట్టు ఆడిన నాలుగు దేశాల టోర్నీలో విజేత. ఆసియా కప్‌లో ఎదురులేని వైనం. ఇవన్నీ కూడా భారత మహిళల జట్టు ప్రగతి సోపానాలే కానీ... ప్రత్యక్ష ప్రసారం లేకే చూడలేకున్నాం. గతంలో భారత మహిళల క్రికెట్ సంఘం బీసీసీఐలో భాగం కాదు. దీంతో మ్యాచ్ ఫీజులు అంతంత మాత్రమే.
టోర్నీల్లో గెలిచినా ప్రైజ్‌మనీ అరకొరే. ఇలాంటి పరిస్థితుల మధ్య భారత జట్టు వెలుగులోకి వచ్చిందంటే కఠోరమైన వారి కృషి, పట్టుదల వల్లే! ఐసీసీ సూచనల మేరకు బీసీసీఐ గొడుగుకిందకు వచ్చాక మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం. పర్యటనలు, టోర్నీలు క్రమపద్ధతిలో ఉండటం వల్ల మ్యాచ్‌లు క్రమంగా పెరిగాయి. దీంతో ఆడే అవకాశంతో పాటు ఆటలో స్థిరత్వం పెరిగింది. అది ఇప్పుడు ఇంగ్లండ్‌లో స్పష్టంగా కనపడుతోంది.