Indian womens cricket
-
మంచి రోజులు వస్తున్నాయి...
దుబాయ్: మన మహిళల క్రికెట్‌కు మంచి రోజులు వస్తున్నాయి. గట్టి ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇకపై క్రమం తప్పకుండా భారత్‌లో పర్యటించనున్నాయి. 2025–29 సైకిల్‌కు సంబంధించిన మహిళల భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా భారత జట్టు కీలక ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడనుంది. ఈ నాలుగేళ్ల కాలంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికాల్లోనూ టీమిండియా పర్యటించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లోని ప్రతి సభ్య దేశం ఇంటా బయటా నాలుగు సిరీస్‌ల చొప్పున పాల్గొనేలా కొత్త ఎఫ్‌టీపీని రూపొందించారు. భారత్ మేటి ప్రత్యర్థులతో పాటు పొరుగు దేశం బంగ్లాదేశ్, 11వ సభ్య దేశంగా ఉన్న జింబాబ్వేతోనూ తలపడుతుంది. ఎప్పుడో అరకొరగా జరిగే టెస్టులను ఈ నాలుగేళ్ల సైకిల్లో పెంచారు. సభ్యదేశాలన్నీ మూడు ఫార్మాట్ల సిరీస్‌లో పాల్గొనేందుకు సమ్మతించాయని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీమ్ ఖాన్ తెలిపారు. దీంతో గత ఎఫ్టీపీతో పోల్చితే తదుపరి సైకిల్లో మహిళల మ్యాచ్‌లు మూడు ఫార్మాట్లలోనూ గణనీయంగా పెరగనున్నాయి. » కొత్త ఎఫ్టీపీ వచ్చే ఏడాది మేలో మొదలై 2029 ఏప్రిల్‌తో ముగుస్తుంది. ప్రతి దేశం పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ప్రాధాన్యమిచ్చాయి. దీంతో 2025–29 సైకిల్లో 400 పైచిలుకు అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో జరిగే 44 వన్డే సిరీస్‌లలో ఒక్కో సభ్యదేశం మిగతా పది జట్లతో మూడు వన్డేల చొప్పున ఆడుతుంది. అలా 132 వన్డేలు జరుగుతాయి. » మహిళల ఎఫ్‌టీపీని 2029లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు అనుగుణంగా రూపొందించారు. ఇప్పుడున్న 10 జట్లతో పరిమితం కాకుండా ఆ మెగా టోర్నీ 11 జట్లతో జరుగనుంది. 11వ దేశంగా జింబాబ్వే బరిలోకి దిగుతుంది. ఇటీవల జింబాబ్వే మహిళల జట్టుకు శాశ్వత సభ్యదేశం హోదా ఇచ్చారు. » 2026లో ఇంగ్లండ్‌లో జరగబోయే టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ అక్కడ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో కలిసి ముక్కోణపు టోర్నీలో ఆడుతుంది. » ఐర్లాండ్‌లోనూ జరిగే సన్నాహక ముక్కోణపు టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లు తలపడతాయి. అలాగే భారత ఉపఖండంలోని శ్రీలంక జట్టు వెస్టిండీస్, మరో జట్టుతో కలిసి ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంటుంది. » ఐసీసీ మహిళల చాంపియన్íÙప్లో భాగమైన జింబాబ్వే... వచ్చే నాలుగేళ్ల పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంకలతో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆతిథ్యమిస్తుంది. దీంతో పాటు భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో పర్యటిస్తుంది. » అందరికంటే ఆ్రస్టేలియా గరిష్టంగా ద్వైపాక్షిక సిరీస్‌లలో భాగమవుతుంది. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లాంటి గట్టి ప్రత్యర్థులతో ఇంటా బయటా సిరీస్‌లు ఆడుతుంది. -
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్ ‘ఎ’ మహిళల క్రికెట్ జట్టుతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టులో హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కిందని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. 17 ఏళ్ల త్రిష ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉంది. భారత్ ‘ఎ’–ఇంగ్లండ్ ‘ఎ’ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 29న, డిసెంబర్ 1న, డిసెంబర్ 3న జరుగుతాయి. -
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
బెనోని: తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌ను భారత మహిళల జట్టు ఘన విజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అండర్–19 మహిళల టీమ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా... భారత్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు చేసింది. షబ్నమ్ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి వాన్ రెన్స్‌బర్గ్ (23) సఫారీ జట్టుకు శుభారంభం అందించగా, సోనమ్ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి సిమోన్ లోరెన్స్ (44 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్) 4 ఫోర్లు, సిక్స్ బాదింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థిని భారత బౌలర్లు కట్టడి చేయడంలో సఫలం కాగా, మ్యాడిసన్ ల్యాండ్స్‌మన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), కెప్టెన్ షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయారు. నిని వేసిన ఓవర్లో షఫాలీ వరుసగా 4, 4, 4, 4, 4, 6తో ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు శ్వేత తన దూకుడును తగ్గించకుండా దూసుకుపోయింది. గొంగడి త్రిష (15) తొందరగానే వెనుదిరిగినా... శ్వేత చివరి వరకు నిలబడటంతో భారత్‌కు గెలుపు సులువైంది. ఓపెనర్ శ్వేత 7 ఓవర్లలో కనీసం రెండు ఫోర్ల చొప్పున కొట్టడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై, యూఏఈ ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై, శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో అమెరికాపై గెలిచాయి. -
చక్దా ఎక్స్‌ప్రెస్.. స్పెషల్ స్టోరీ ఆన్ ఇండియన్ టైగ్రెస్ ఝులన్ గోస్వామి
కళ్లల్లో లక్ష్యం.. పరుగులో వేగం.. వెరసి స్టేడియంలో మెరుపు.. పిచ్‌లో స్టంప్ అవుట్స్! ఆ టైగ్రెస్ పేరు ఝులన్ గోస్వామి! ఆమె ఉంటే సొంత జట్టుకి ఉత్సాహం.. ప్రత్యర్థి జట్టుకి ఇరకాటం! విమెన్ క్రికెట్‌కు ఆమె ఓ సిగ్నేచర్! 2022 సెప్టెంబర్ 24.. లండన్‌లోని లార్డ్స్ స్టేడియం.. 39 ఏళ్ల లెజండరీ క్రికెటర్ ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ సమయం! టాస్ వేయాల్సిందిగా ఆమెనే పిలిచింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కన్నీళ్లతో. ఆ మ్యాచ్‌లో ఝులన్ తన కెరీర్లోనే ఆఖరి బాల్ వేస్తున్నప్పుడు టీమ్‌తో పాటు ప్రేక్షకుల మనసూ బరువెక్కింది. మ్యాచ్ అయిపోయాక ఇంగ్లండ్ టీమ్.. ఇండియా టీమ్ ఆమెకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. క్రికెటే జీవితంగా భావించిన ఝులన్‌కు అది కోరుకున్న నిష్క్రమణే అయినా.. తన శరీరం నుంచి హృదయాన్ని వేరు చేస్తున్న వేదన.. ఆమె బౌలింగ్ అంత వేగంగా పొట్టలోంచి ఉబికి వస్తున్న దుఃఖం కన్నీళ్లుగా కారకుండా కష్టంగా ఆపుకొంది! తన ఎడబాటుతో ఝులన్‌ను అంత వేదనకు గురిచేసిన ఆ ఆట ఆమెకు పరిచయమై ఆసక్తి కలిగిన సందర్భం.. 1992.. వరల్డ్ కప్! ఝులన్ వాళ్ల అన్న, కజిన్స్ క్రికెట్‌కు పెద్ద ఫ్యాన్స్. దాంతో టీవీలో వస్తున్న 1992 వరల్డ్ కప్ మ్యాచెస్‌ను ఉత్కంఠతో చూస్తున్నారు. వాళ్లతోపాటు పదేళ్ల ఝులన్ కూడా చూడాల్సి వచ్చింది అనివార్యంగా. అప్పటిదాకా ఆమె దృష్టిలో ఆటంటే ఫుట్‌బాలే. కానీ ఆ వరల్డ్ కప్ ఆమె దృష్టిని మార్చేసింది. క్రికెట్ మీదకు మళ్లించింది. ఆసక్తిని కలిగించింది. నాటినుంచి గల్లీలో అబ్బాయిలతో కలసి ఆడడం స్టార్ట్ చేసింది. బౌలింగ్ అంటే ఇష్టం. కానీ స్లోగా చేసేది. దాంతో అబ్బాయిలంతా ఆమెను గేలి చేసేవాళ్లు. ఆ హేళన ఆమెలో కసిని పెంచింది.. ఎంతలా అంటే బౌలింగ్ వేగం గంటకు 120 కిలోమీటర్లకు చేరి వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఆమెను నిలబెట్టేంతగా! క్రికెటే లక్ష్యంగా మారిన సమయం.. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్.. 1997మహిళా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోంది. ఆ స్టేడియంలో ఝులన్ బాల్ గర్ల్. అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే చూడటం అదే తొలిసారి. బెలిండా క్లార్క్ ఆట ఆమెను కట్టిపడేసింది.. క్రికెట్‌ను ప్రేమించేలా చేసింది. అంతే అప్పటికప్పుడు ఝులన్ నిర్ణయించేసుకుంది ఏది ఏమైనా తాను కూడా భారతదేశం తరపున ఆడాలని! కానీ తనుంటున్న చక్దా పల్లెటూరు. బడి అంటే ఓకే కానీ ఆటలను నేర్పించేంత సౌకర్యాలు తన ఊళ్లో లేవు. శిక్షణ కోసం కోల్‌కతా వెళ్లాల్సిందే. ఝులన్ నోటి వెంట ఆ మాట వినడమే ఆలస్యం ‘వద్దు’ అని చెప్పేశారు అమ్మా, నాన్న ముక్త కంఠంతో. ఆడపిల్లకు చదువుతో పాటు ఆట, పాట ఉండాలి అంటే ఏకంగా క్రికెట్‌కే గురి పెడతావా? పెళ్లికావాల్సిన పిల్లవి.. రేప్పొద్దున ఏదన్నా తేడా జరిగితే పెళ్లి అవుతుందా? అంటూ ఆందోళనా వ్యక్తం చేశారు. కాని దేశానికి స్వాతంత్య్రం సిద్ధించకముందు పుట్టిన ఝులన్ నానమ్మకు తెలుసు ఆడపిల్లకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఎంత అవసరమో! అందుకే ‘ఆడపిల్లలు అన్నిట్లో ముందుండాలి. దేనికీ అధైర్యపడొద్దు. నచ్చిన పని చేయాలి’ అంటూ ఝులన్‌ను ప్రోత్సహించింది. ‘నాకు రెండేళ్లు టైమ్ ఇవ్వండి.. క్రికెట్లో ఝులన్‌ను స్టార్‌ను చేస్తా’ అంటూ కోచ్ స్వపన్ సాధు కూడా ఆమె కుటుంబాన్ని ఒప్పించాడు. ‘ఎంతో మంది ఆడ పిల్లలకు శిక్షణ నిచ్చా.. కాని నీలాగా హై ఆర్మ్ బౌలింగ్ చేసేవాళ్లను చూడలేదు. ఇంత టాలెంట్‌ని వృథా పోనివ్వను. క్రికెట్‌కే నిన్ను ఓ అసెట్‌లా తీర్చిదిద్దుతా’ అంటూ కోచ్‌గానే కాదు గైడ్, ఫిలాసఫర్‌గా ఆమెకు అండగా నిలిచాడు స్వపన్ సాధు. అలా ఝులన్ తన క్రికెట్ కలను నేరవేర్చుకోవడానికి.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోల్‌కతా ప్రయాణమైంది. 2007– 08 నుంచి ఆటగాళ్లకి ర్యాంకింగ్ సిస్టమ్ మొదలైంది. బౌలర్లలో ఝులన్ది నంబర్ వన్ ర్యాంక్. ఐసీసీ ఆమెకు గోల్డెన్ ఆర్మ్ బ్యాండ్‌ను బహుకరించింది. అలా కోచ్ ఊహించినట్టుగానే క్రికెట్ స్టార్ అయింది. ఓ ‘అద్భుతం’గా రికార్డ్ అయింది! ‘ప్రతిరోజూ ఉదయం ఏడున్నర కల్లా గ్రౌండ్లో ఉండాల్సిందే. లేకపోతే ఆరోజు ఆడనిచ్చేవాడు కాదు కోచ్. అందుకే పొద్దున్నే ఐదింటికల్లా సీల్దా నుంచి బాలిగంజ్ ట్రైన్లో బయలుదేరేదాన్ని. అందులో అందరూ స్పోర్ట్స్పర్సన్సే ఉండేవారు. అబ్బాయిలు, అమ్మాయిలం ఒక గ్రూప్‌గా బోల్డు కబుర్లు చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం. పొరపాటున ట్రైన్ మిస్ అయితే జీవితంలో ఒకరోజు కోల్పోయిన ఫీల్ ఉండేది. ఏమైనా అవి బంగారు రోజులు’ అంటూ తన కోచింగ్ రోజులను గుర్తు చేసుకుంటుంది ఝులన్. ‘మా ఆటకు స్టేడియం ఖాళీగా ఉంటుంది. జనం కొట్టే జేజేలు, కేరింతలు లేకున్నా మా ఉత్సాహం ఏ మాత్రం తగ్గదు. నాకైతే ఎదురుగా బ్యాట్‌తో సిద్ధంగా ఉన్న ప్రత్యర్థి, స్టంప్స్ మాత్రమే కనిపించేవి. ప్రత్యర్థిని ఎలా ఔట్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో దూసుకుపోయేదాన్ని’ అంటూ తన ఆట తీరును నెమరువేసుకుంటుంది ఝులన్. రిటైర్మెంట్ తర్వాత.. మ్యాచెస్లేని రోజులను ఊహించడం కష్టమే అయినా క్రికెట్ వల్ల వాయిదా పడ్డ పనులెన్నిటినో చేసుకోవడానికి కావల్సినంత సమయం దొరికింది అని తన మనసుకు నచ్చజెప్పుకుంటోంది ఝులన్. ‘ఇప్పుడిక దేనికీ ఏ రోక్టోక్ (ఆటంకం) లేదు. బిందాస్‌గా స్ట్రీట్ ఫుడ్ తింటా.. చక్కగా దుర్గా పూజను ఆస్వాదిస్తా’నంటూ తనేం చేయాలను కుందో చెప్పు కొచ్చింది. ‘2009 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అయిపోవాలి అనుకున్నా. ఇప్పటికి ఆ నిర్ణయం తీసుకోగలిగా. ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి వెళ్లడం, బౌలింగ్ చేయడం, నేషనల్ యాంథమ్ పాడటం వంటి అనుభూతులన్నిటినీ మిస్ అవుతాను’ అంటూ రిటైర్మెంట్ మిగిల్చే లోటునూ పంచుకుంది. ‘నా తొలి టెస్ట్ మ్యాచ్, తొలి వన్ డే మ్యాచ్, టీ20 డెబ్యూ కూడా ఇంగ్లండ్‌తోనే. చిత్రమేంటంటే నా ఆఖరి మ్యాచ్ కూడా ఇంగ్లండ్‌తోనే. బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించిన చరిత్ర వింటూ పెరిగినందువల్లో ఏమో ఇంగ్లండ్ అంటే నాకు కోపం. ఆ సంగతి మా కెప్టెన్‌కీ తెలుసు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అప్పుడు ‘నీ కసికొద్దీ బాల్ని కొట్టిరా’ అంటూ బౌలింగ్‌కు పంపించేది’ అని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఝులన్. గ్రాఫ్ అండ్ గ్రేస్ 2007–ఐసిసి విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా గౌరవం పొందింది. (2008–2011)–విమెన్స్ క్రికెట్ కెప్టెన్ 204 మ్యాచుల్లో 255 వికెట్లతో అత్యధికంగా వికెట్లు తీసుకున్న ప్లేయర్‌గా నిలిచింది. 2010–అర్జున, 2012–పద్మశ్రీ అవార్డులను అందుకుంది. అనుష్క శర్మ నటిస్తున్న ఝులన్ బయోపిక్ చక్దా ఎక్స్‌ప్రెస్ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది. ఆటకు అన్యాయం చేస్తానేమో అనే భయంతో పెళ్లి కూడా వద్దనుకుంది. కొన్ని ఫ్యాషన్ షోల్లోనూ పాల్గొంది. ఝులన్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. జె.. పాజీ.. బాబుల్ టీమ్‌లో నేనే వరస్ట్ డాన్సర్‌నని ఆట పట్టిస్తారంతా. నేను క్రికెటర్ని మరి.. డాన్సర్‌ని కాదుగా! టీమ్‌లో అల్లరిపిల్ల అంటే వేద. ఝులన్ దీదీ.. ఝులన్ దీ.. ఝులన్ నుంచి ఇప్పుడు జె అని పిలిచేవరకు వచ్చింది ఆ పిల్ల తీరు. ‘నా పేరుమొత్తం కట్ చేసేశావ్, నన్ను టీమ్ నుంచి బయటకు మాత్రం పంపకు’ అని జోక్ చేసేదాన్ని. హర్మన్ పూర్తిగా పంజాబీ యాక్సెంట్లోనే మాట్లాడుతుంటుంది. నాకొచ్చిన ఒకేఒక్క పంజాబీ పదం పాజీ. నేను తనని పాజీ అనేదాన్ని. అలా తను నాకు పాజీ అని పేరు పెట్టేసింది. చాలామంది బాబుల్ అని కూడా పిలుస్తారు. ఝులన్ గురించి మిథాలి.. ‘నాకు ఝులన్ అండర్ 19లో రాయ్ బరేలీలో ఆడినప్పటి నుంచి తెలుసు. అప్పుడు గ్రౌండ్ వెనుక ఉన్న హాస్టల్లో మాకు బస. నా గది కిటికీ నుంచి ఝులన్‌ను మొదటిసారి చూశా. బోరింగ్ పంప్ కొట్టి బకెట్లో నీళ్లు నింపి అక్కడే కూర్చుని బ్రష్ చేసుకుంటోంది. తన మొదటి బంతి క్యాచ్ చేయడం కూడా నాకు గుర్తు. చాలా కష్టపడి ఆడే అమ్మాయి. ప్రాక్టీస్ టైమ్‌లో కూడా తనతో పోటీ పడటం కష్టమే. ఎవరిలో లేని లక్షణం ఒకటి ఆమెలో ఉంది. మేం ఆటలో ఓడుతున్నా, గెలుస్తున్నా ఝులన్ ఏదో ఒక కార్నర్లో ఉండి టీమ్‌ని ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తుంటుంది.’ గెలిచే వరకు.. పద్దెనిమిదేళ్ల పాటు నేను, మిథాలీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. వరల్డ్ కప్ గెలవలేకపోయాం. మన విమెన్ టీమ్ ప్రపంచ కప్ గెలవాలి. విమెన్ టీం ప్రపంచ కప్ గెలిస్తే చాలు. గెలిచే వరకు ఆ కలను కంటూనే ఉంటాను. -
కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత టి20 జట్టు ఇదే.. ఆంధ్ర క్రికెటర్‌కు పిలుపు
ముంబై: ఈ నెల 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘనకు కూడా జట్టులో చోటు లభించింది. భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా, యస్తిక , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రకర్, మేఘన సింగ్, రేణుక సింగ్, జెమీమా, రాధా యాదవ్, హర్లీన్, స్నేహ్ రాణా. -
టీమిండియాకు షాక్.. మూడో టీ20లో శ్రీలంక ఘన విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టుతో ఇవాళ (జూన్ 27) జరిగిన ఆఖరి టీ20లో ఆతిధ్య శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఇదివరకే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ చమారి ఆటపట్టు (48 బంతుల్లో 80 నాటౌట్; 14 ఫోర్లు, సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. ఫలితంగా శ్రీలంక ఈ సిరీస్‌లో బోణీ కొట్టడంతో పాటు భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా.. లంక మరో 18 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చామరి సహా నిలాక్షి డిసిల్వా (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించడంతో శ్రీలంక సునాయస విజయం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, రేణుక సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు హర్మన్‌ప్రీత్ కౌర్ (39 నాటౌట్), జెమీమా రోడ్రిగెస్ (33) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఈ పర్యటనలో టీమిండియా జులై 1, 4, 7 తేదీల్లో వన్డేలు ఆడనుంది. చదవండి: IND VS IRE 1st T20: భువీ ఖాతాలో అరుదైన రికార్డు -
టీ20ల్లో అరుదైన మైలురాయిని అధిగమించిన టీమిండియా బ్యాటర్
INDW VS SLW: టీమిండియా బ్యాటర్ స్మృతి మంధాన పొట్టి క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని అధిగమించింది. శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మంధాన రేర్ ఫీట్‌ను సాధించింది. శనివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 39 పరుగులు చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 2000 పరుగుల (84 ఇన్నింగ్స్‌ల్లో) మార్కును అధిగమించిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. మంధాన కంటే ముందు రోహిత్ శర్మ (125 ఇన్నింగ్స్‌ల్లో 3313 పరుగులు), విరాట్ కోహ్లి (97 ఇన్నింగ్స్‌ల్లో 3297), హర్మన్‌ప్రీత్ కౌర్ (84 ఇన్నింగ్స్‌ల్లో 2372), మిథాలీ రాజ్ (70 ఇన్నింగ్స్‌ల్లో 2364) టీ20ల్లో 2000 మార్కును అందుకున్నారు. ఈ రికార్డుతో పాటు మంధాన మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో వేగంగా 2000 పరుగులు చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఓ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన హర్మన్.. మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును (భారత మహిళల క్రికెట్లో) అధిగమించింది. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం -
భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..!
భారత మహిళా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. మహిళల ప్రపంచకప్-2022 అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు. కాగా మహిళల ప్రపంచకప్-2022లో భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐసీసీ ప్రకటించిన అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్ క్రికెటర్లకు చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ మెగా టోర్నమెంట్లో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్ మూనీకు చోటు దక్కింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), నాలుగో ప్లేస్‌కు రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా),ఐదో ప్లేస్‌కు నాట్ స్కివర్ (ఇంగ్లండ్), ఆ తరువాత వరుసగా బెత్ మూనీ (ఆస్ట్రేలియా),హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), ఎంచుకుంది. ఐసీసీ అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టు: అలిస్సా హీలీ (వికెట్ కీపర్) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్) చార్లీ డీన్ (ఇంగ్లండ్) -
ఆసీస్‌ను నిలువరించేనా?
ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు గెలుస్తూ, ఓడుతూ సాగిన పయనం ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా నేడు జరిగే లీగ్ మ్యాచ్‌లో మిథాలీ బృందం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. నాలుగు మ్యాచ్‌లాడిన భారత్ రెండు గెలిచి మరో రెండు ఓడింది. ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే. ఇప్పుడు సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రతీ పోరు కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియాతో కఠిన సవాల్‌కు మిథాలీ సేన సిద్ధమైంది. అయితే నిలకడలేమి జట్టును ఆందోళన పరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ రంగాల్లో భారత్ స్థిరంగా రాణించాలి. అప్పుడే మిగతా మ్యాచ్‌ల్ని గెలవొచ్చు. సెమీస్ చేరొచ్చు. లేదంటే లీగ్ దశలోనే వెనుదిరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు 12 సార్లు తలపడ్డాయి. భారత్ 3 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓవరాల్‌గా ఈ రెండు జట్ల మధ్య 49 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 10 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 39 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. -
తొలి వన్డే ముందు భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం!
న్యూజిలాండ్ మహిళలతో తొలి వన్డేకు మందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన క్వారంటైన్ నిభంధనల కారణంగా శనివారం జరిగి తొలి వన్డేకు మంధాన దూరం కానుంది. ఇప్పటికే క్వారంటైన్లో ఉన్న మంధాన.. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌కు దూరమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి చెందింది.మంధానతో పాటు పేసర్లు మేఘనా సింగ్,రేణుకా సింగ్ కూడా తొలి వన్డేకు దూరం కానున్నారు. కాగా మంధాన స్ధానంలో యస్తిక భాటియాను ఎంపిక చేశారు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో షఫాలీ వర్మతో కలిసి భాటియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే ఆ మ్యాచ్‌లో 26 పరుగులు చేసి యస్తిక భాటియా పర్వాలేదు అనిపించింది.ఇక న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది. మొత్తం ఐదు వన్డేలు క్వీన్స్టౌన్ వేదికగానే జరగనున్నాయి. చదవండి: Aus Vs Nz Cancelled: న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ రద్దు.. కారణం అదేనా? -
న్యూజిలాండ్‌తో ఏకైక టీ20.. భారత జట్టు ఓటమి
క్వీన్స్టౌన్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో భారత్‌పై న్యూజిలాండ్ మహిళల జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో సబ్భినేని మేఘన(37), యస్తికా భాటియా(26) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కేర్, అమేలియా కెర్, జాన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సుజీ బేట్స్(36), డివైన్( 31) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌కు బారత జట్టు సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన దూరమైంది. ఇక న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది. చదవండి: MS Dhoni Gym Video: అదీ ధోని భాయ్ అంటే.. ఎంతో ఓపికగా జిమ్‌లో.. వీడియో వైరల్ -
భారత మహిళా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌పై వేటు
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మను బీసీసీఐ తప్పించింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జట్టు సభ్యులతో పాటు సహాయక సిబ్బంది కూడా బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘బయోబబుల్’లోకి మంగళవారంలోగా అడుగు పెట్టాల్సి ఉంది. అయితే అభయ్ ఇంకా జట్టుతో చేరకపోవడంతో ఆయనను తొలగించినట్లు తెలిసింది. ఈ క్రమంలో.. త్వరలోనే ఫీల్డింగ్ కోచ్‌ను ఎంపిక చేస్తామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, 52 ఏళ్ల అభయ్ శర్మ భారత దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ, రైల్వేస్, రాజస్థాన్ జట్ల తరఫున వికెట్ కీపర్‌గా రాణించాడు. ఇటీవలి కాలంలో అతను ఇండియా-ఏ, భారత్ అండర్-19 జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదే ఏడాది అభయ్ భారత మహిళా క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. -
అదరగొట్టిన షఫాలీ
బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు భారత మహిళల క్రికెట్లో కొత్త కెరటాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కెరీర్లో టి20లు మాత్రమే ఆడిన షఫాలీ వర్మ టెస్టుల్లో కూడా తాను సత్తా చాటగలనంటూ తొలి మ్యాచ్‌లోనే నిరూపించింది. మ్యాచ్ రెండో రోజు అద్భుత ప్రదర్శన కనబర్చిన షఫాలీ (152 బంతుల్లో 96; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకుంది. అయితే తొలి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా ఈ టీనేజర్ నిలిచింది. షఫాలీకి తోడుగా స్మృతి మంధాన (155 బంతుల్లో 78; 14 ఫోర్లు) కూడా ఆకట్టుకోవడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. షఫాలీ, స్మృతి తొలి వికెట్‌కు ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లతో పాటు శిఖా పాండే (0), కెప్టెన్ మిథాలీ రాజ్ (2), పూనమ్ రౌత్ (2) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ (4 బ్యాటింగ్), దీప్తి శర్మ (0 బ్యాటింగ్) జట్టును ఆదుకోవాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 59 పరుగులు చేయా ల్సి ఉంది. అంతకు ముందు 269/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 396 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
టెస్టు క్రికెట్లో భారత మహిళల జట్టు ప్రదర్శన
మహిళల క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ 1934లో జరిగితే భారత మహిళలు టెస్టు ఆడేందుకు మరో 42 ఏళ్లు పట్టింది. ఆట మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ‘ఉమెన్ యాషెస్’ పేరుతో మహిళల టెస్టు ఫార్మాట్‌ను బ్రతికిస్తుండగా... ఒకదశలో వీటితో పోటీ పడిన న్యూజిలాండ్ కూడా 17 ఏళ్లుగా టెస్టు మ్యాచ్ ఆడనే లేదు. ముందుగా వన్డేలు, ఆపై టి20ల జోరులో సుదీర్ఘ ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టంగా మారిపోతున్న తరుణంలో ఏడేళ్ల తర్వాత మన భారత మహిళల జట్టుకు మరో టెస్టు ఆడే అవకాశం దక్కింది. రేపటి నుంచి మిథాలీ రాజ్ బృందం ఇంగ్లండ్‌తో తలపడనున్న నేపథ్యంలో భారత టెస్టు క్రికెట్‌కు సంబంధించిన విశేషాలు.... గెలుపు పిలుపు.... 1. నవంబర్ 17–19, 1976 ప్రత్యర్థి: వెస్టిండీస్, వేదిక: పట్నా ఫలితం: 5 వికెట్లతో భారత్ విజయం తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. భారత్ 9 వికెట్లకు 161 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 88 పరుగులకే ఆలౌటైంది. 55 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. 2. మార్చి 19–22, 2002 ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా, వేదిక: పార్ల్ ఫలితం: 10 వికెట్లతో భారత్ విజయం అంజుమ్ చోప్రా, అంజు జైన్, హేమలత, మిథాలీ, మమతా అర్ధ సెంచరీలతో భారత్ 9 వికెట్లకు 404 పరుగులకు డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా 150 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో దక్షిణాఫ్రికా జట్టు 266 పరుగులు చేసింది. 13 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఈ ఏకైక టెస్టులో గెలిచి తొలిసారి సిరీస్ కూడా సొంతం చేసుకుంది. 3. ఆగస్టు 29–సెప్టెంబర్ 1, 2006 ప్రత్యర్థి: ఇంగ్లండ్, వేదిక: టాంటన్ ఫలితం: 5 వికెట్లతో భారత్ విజయం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చేసిన 307 పరుగులకు జవాబుగా ఇంగ్లండ్ 99 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో ఇంగ్లండ్ 305 పరుగులు సాధించగా ... 98 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. 4. ఆగస్టు 13–16, 2014 ప్రత్యర్థి: ఇంగ్లండ్, వేదిక: వామ్స్లీ ఫలితం: 6 వికెట్లతో భారత్ విజయం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 92 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 114 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 202 పరుగులు సాధించగా, భారత్ 181 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 5. నవంబర్ 16–19, 2014 ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా, వేదిక: మైసూరు ఫలితం: ఇన్నింగ్స్ 34 పరుగులతో భారత్ గెలుపు కామిని (192), పూనమ్ రౌత్ (130) సెంచరీలతో భారత్ 6 వికెట్లకు 400 వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 234, రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టు ఆడిన మొత్తం సిరీస్‌లు: 19 ఆస్ట్రేలియా చేతిలో 4, ఇంగ్లండ్, వెస్టిండీస్ చేతిలో ఒక్కో టెస్టులో భారత్ ఓడింది. 6 అత్యల్ప స్కోరు (వెస్టిండీస్‌పై, 1976–జమ్మూలో) 65 అత్యధిక వికెట్లు (డయానా ఎడుల్జీ–20 టెస్టుల్లో) 63 అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (నీతూ డేవిడ్, ఇంగ్లండ్‌పై, 1995–జంషెడ్పూర్) 8/58 సుధా షా (అత్యధిక టెస్టులు) 21 ప్రస్తుత జట్టులో అత్యధికంగా మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ఆడిన టెస్టుల సంఖ్య. 2002లో వీరిద్దరు ఒకే మ్యాచ్ (ఇంగ్లండ్‌తో లక్నోలో) ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశారు.10 ఆడిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య. ఇందులో 5 గెలిచిన భారత్ 6 ఓడింది. మరో 25 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.36 అత్యధిక స్కోరు (ఇంగ్లండ్‌పై, 2002–టాంటన్‌లో) 467 అత్యధిక పరుగులు (సంధ్యా అగర్వాల్–13 టెస్టుల్లో )110 అత్యధిక వ్యక్తిగత స్కోరు (మిథాలీ రాజ్; ఇంగ్లండ్‌పై, 2002–టాంటన్‌లో). భారత్ తరఫున ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు కాగా... ఏకైక డబుల్ సెంచరీ ఇదే కావడం విశేషం. 214 శాంతా రంగస్వామి (కెప్టెన్‌గా ఎక్కువ టెస్టులు)12 -
భారత మహిళల బ్యాటింగ్ కోచ్‌గా శివ్ సుందర్ దాస్..
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ టెస్టు ఆటగాడు శివ్ సుందర్ దాస్ ఎంపికయ్యాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం దాస్‌ను బీసీసీఐ నియమించింది. గత కొన్నేళ్లుగా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కోచ్‌గా పని చేస్తున్న అతను.. 2020లో పట్నాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో భారత మహిళల ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుభవంతో అతనికి జాతీయ జట్టుకు సేవలందించే అవకాశం దక్కింది. కాగా, ఒడిశాకు చెందిన శివ్ సుందర్ దాస్ 2000–2002 మధ్య కాలంలో భారత్ తరఫున ఓపెనర్‌గా 23 టెస్టులు ఆడి 34.89 సగటుతో 2 సెంచరీలు సహా 1326 పరుగులు చేశాడు. అతను 4 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మను ఎంపిక చేసిన బోర్డు...బరోడాకు చెందిన రాజ్‌కువర్‌దేవి గైక్వాడ్‌ను మేనేజర్‌గా నియమించింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఆడనుంది. చదవండి: టీమిండియా బంగ్లా పర్యటన ఖరారు -
స్టార్ క్రికెటర్ల వంతపాట ఆగాలి
న్యూఢిల్లీ: క్రికెట్ జట్టులో స్టార్ల మాటే నెగ్గాలనే ఆటలు ఆగాలని భారత మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అన్నారు. జట్టుపై తన అభిప్రాయాలను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలకు ఈ–మెయిల్లో తెలియజేశారు. ఏ ఒక్క క్రికెటర్ పేరు చెప్పకపోయినా... జట్టులో ప్రస్తుతమున్న స్టార్ క్రికెటర్ అనే సంస్కృతి మారాలని గట్టిగా లేఖలో సూచించినట్లు తెలిసింది. బోర్డు అధ్యక్షుడికి మాజీ కోచ్ రామన్ ఈ–మెయిల్ పంపింది నిజమేనని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. స్టార్ సంస్కృతి జట్టుకు చేటు చేస్తోందని రామన్ చెప్పినట్లు తెలిసింది. దీనిపై అధ్యక్షుడు గంగూలీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. మొత్తం మీద సీనియర్ క్రికెటర్, హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. పేరు చెప్పకపోయినా ఇప్పుడు అందరికళ్లూ మిథాలీపైనే కేంద్రీకృతమయ్యాయి. మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం 42 ఏళ్ల రమేశ్ పొవార్‌కు మళ్లీ అమ్మాయిల కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. 2018లో కోచ్‌గా పనిచేసిన పొవార్... మిథాలీతో వివాదం కారణంగా పదవి నుంచి వైదొలిగాడు. -
‘బిగ్‌బాష్’లో షఫాలీ, రాధ
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ టీనేజ్ సెన్సేషన్ షఫాలీ వర్మకు మరో మంచి అవకాశం లభించింది. ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్‌కు ఆడనున్న షఫాలీ... ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నమెంట్లో కూడా బరిలోకి దిగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లీగ్‌లో ఆమె సిడ్నీ సిక్సర్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న 17 ఏళ్ల షఫాలీ, భారత్ తరఫున 22 మ్యాచ్‌లలో 148.31 స్ట్రయిక్‌రేట్‌తో 617 పరుగులు చేసింది. మరో భారత క్రీడాకారిణి, 21 ఏళ్ల రాధా యాదవ్ కూడా బిగ్‌బాష్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో కూడా సిడ్నీ సిక్సర్స్ టీమ్ చర్చలు తుది దశకు చేరాయని సమాచారం. బిగ్‌బాష్ లీగ్‌లో భారత్ నుంచి గతంలో హర్మన్‌ప్రీత్ (సిడ్నీ థండర్), స్మృతి మంధాన (బ్రిస్బేన్ హీట్స్), వేద కృష్ణమూర్తి (హోబర్ట్ హరికేన్స్) ప్రాతినిధ్యం వహించారు. -
ఏడేళ్ల విరామం తర్వాత...
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు చివరిసారి 2014 నవంబర్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఇంకా చెప్పాలంటే 1976 నుంచి మన మహిళల జట్టు ఆడిన టెస్టుల సంఖ్య 36 మాత్రమే. వన్డేలు, ఆ తర్వాత టి20ల హోరులో మహిళల టెస్టు అనేదే వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు సుమారు ఏడేళ్ల విరామం తర్వాత మన జట్టు టెస్టు మ్యాచ్ బరిలోకి దిగనుంది. రాబోయే జూన్/జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌తో వారి గడ్డపై ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సంతోషకర విషయాన్ని వెల్లడిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం ప్రకటించారు. ఇంగ్లండ్ టీమ్ స్వదేశీ సీజన్ షెడ్యూల్‌పై మరింత స్పష్టత వచ్చిన తర్వాత టెస్టు మ్యాచ్ తేదీలు ఖరారవుతాయి. 2014లో మైసూరులో దక్షిణాఫ్రికాతో తమ చివరి టెస్టు ఆడిన భారత్ ఇన్నింగ్స్, 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో మహిళల టెస్టులు దాదాపుగా అంతరించిపోయాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే అప్పుడప్పుడు ఈ సంప్రదాయ ఫార్మాట్లో ఆడుతున్నాయి. 2015 ఆగస్టు నుంచి 6 టెస్టులు మాత్రమే జరగ్గా... ఇవన్నీ ఆసీస్, ఇంగ్లండ్ మధ్యే నిర్వహించారు. -
మరోసారి ప్రయత్నిస్తాం
న్యూఢిల్లీ: తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను వచ్చే ఏడాది సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు భారత మహిళల క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. గతంలో మూడు పర్యాయాలు టైటిల్‌కు సమీపంగా వచ్చినప్పటికీ అనుకున్నది సాధించలేకపోయామని ఆమె వ్యాఖ్యానించింది. అందరి ఆశీర్వాదాలతో ఈసారి వరల్డ్‌కప్ సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘2005లో... ఆ తర్వాత 2017 వన్డే ప్రపంచకప్‌లో రెండుసార్లు ఫైనల్లో బోల్తాపడ్డాం. అప్పుడు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా చాలా కష్టపడ్డా. 2017 ఫైనల్లో గెలిస్తే రిటైర్ అవ్వాలని అనుకున్నా. కానీ అది జరగలేదు. ఆ తర్వాత 2018లో టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో పరాజయం పాలయ్యాం. టైటిల్‌కు చాలా దగ్గరగా వచ్చి దూరమయ్యాం. కాబట్టి మరోసారి ప్రయత్నిద్దామని గట్టిగా నిశ్చయించుకున్నా. దేవుడి దయవల్ల ఈసారి సాధిస్తామని నమ్ముతున్నా’ అని 37 ఏళ్ల మిథాలీ వివరించింది. మహిళల క్రికెట్ ఆలస్యంగా బీసీసీఐ పరిధిలోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది ప్రతిభగల అమ్మాయిలు క్రికెట్‌కు దూరమయ్యారని నిరాశ వ్యక్తం చేసింది. -
50 పరుగులే చేసి 5 పరుగులతో గెలిచారు..
గయానా: ఇప్పటికే వెస్టిండీస్ మహిళలతో టీ20 సిరీస్‌ను గెలిచిన భారత మహిళలు అదే జోరును కొనసాగిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా నాల్గో విజయం నమోదు చేశారు. ఆదివారం జరిగిన నాల్గో టీ20లో భారత్ మహిళలు ఏడు వికెట్ల నష్టానికి 50 పరుగులే చేయగా, ఐదు పరుగుల తేడాతో జయభేరి మోగించారు. ఈ మ్యాచ్‌కు పలుమార్లు వర్షం ఆటంకం కల్గించడంతో 9 ఓవర్లకు కుదించారు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 51 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కేవలం పుజా వస్త్రాకర్(10) మాత్రమే రెండంకెల స్కోరును దాటిన భారత క్రీడాకారిణి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మహిళలు 9 ఓవర్లలో 45 పరుగులే చేసి ఓటమి పాలయ్యారు. వెస్టిండీస్ జట్టులో హేలీ మాథ్యూస్(11), చినెల్లీ హెన్రీ(11), మెక్లీన్(10)లు రెండంకెల స్కోరు దాటారు. అయినప్పటికీ మ్యాచ్‌ను గెలిపించలేపోయారు. భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో వెస్టిండీస్ విఫలమైంది. భారత బౌలర్లలో అనుజా పటేల్ రెండు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి ఎనిమిది పరుగులే ఇవ్వగా, దీప్తి శర్మ, రాధా యాదవ్‌లు తలో రెండు ఓవర్లలో ఎనిమిదేసి పరుగులిచ్చి వికెట్ చొప్పున తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత మహిళలు 4-0 ఆధిక్యంలో నిలిచారు. ఐదో టీ20 బుధవారం జరుగనుంది. -
ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడినందుకు...
వడోదర: భారత క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయే వార్త... ఆటగాడిగా, కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న తుషార్ అరోథే (52) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లో పాల్గొన్నందుకు అరోథేతో పాటు మరో 18 మందిని బరోడా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక హోటల్లో బెట్టింగ్ చేస్తున్నట్లు తెలియడంతో దాడి జరిపి వీరందరినీ పట్టుకున్నామని...వారి ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు వడోదర్ డీపీపీ (క్రైమ్) జేఎస్ జడేజా వెల్లడించారు. 2008, 2012లో ఆయన భారత మహిళల క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో సభ్యులుగా ఉన్నారు. అయితే తుషార్ పెద్ద ఘనత భారత జట్టును ప్రపంచ కప్ ఫైనల్ చేర్చడమే. 2017 వన్డే వరల్డ్ కప్‌లో ఆయన టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత జట్టులోని సభ్యులతో విభేదాల నేపథ్యంలో గత ఏడాది టి20 ప్రపంచ కప్‌కు ముందు అరోథే కోచ్ పదవి కోల్పోయారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన అరోథే 18 ఏళ్ల కెరీర్లో 114 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 13 సెంచరీలు సహా 6105 పరుగులు చేశారు. పాకిస్తాన్లో ఐపీఎల్ నిషేధం! ఇస్లామాబాద్: తమ దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని పాకిస్తాన్ నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లను తమ దేశంలో చూసేలా చేస్తూ భారత్ ‘వ్యూహాత్మకంగా’ పాక్ క్రికెట్‌ను దెబ్బ తీస్తోందని మంత్రివర్గం అభిప్రాయ పడింది. భారత దేశవాళీ టోర్నీని తమ వద్ద అనుమతించడంలో అర్థం లేదని ప్రసారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు. పుల్వామా ఉదంతం తర్వాత అప్పట్లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లను ‘డీ స్పోర్ట్స్’ భారత్‌లో ప్రసారం కాకుండా ఆపివేసింది. -
క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...
ముంబై: సొంతగడ్డపై సత్తా చాటుతూ వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ గెలుచుకున్న భారత మహిళల జట్టు మరో ‘రెండు పాయింట్లు’ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో నేడు భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సిరీస్‌ను ఇప్పటికే 2–0తో సొంతం చేసుకున్న మిథాలీ సేన మరో మ్యాచ్ కూడా గెలిస్తే 2021 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించేందుకు మరింత చేరువవుతుంది. మరోవైపు ఇంగ్లండ్ పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఐసీసీ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దిగువన ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కనీసం ఇక్కడైనా గెలిచి రెండు పాయింట్లు చేర్చుకోవాలని భావిస్తోంది. ►ఉదయం గం. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
కల్పన పునరాగమనం
ముంబై: స్వదేశంలో ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యుల భారత బృందానికి హైదరాబాద్ సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రావి కల్పన మూడేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టులో పునరాగమనం చేయనుంది. విజయవాడకు చెందిన కల్పన రెండో వికెట్ కీపర్‌గా జట్టులోకి ఎంపికైంది. 22 ఏళ్ల కల్పన... 2015 జూన్‌లో బెంగళూరులో న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మరో ఆరు వన్డేలు ఆడింది. 2016 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్ తర్వాత ఆమె జట్టులో స్థానం కోల్పోయింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఫిబ్రవరి 22, 25, 28 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. అంతకుముందు ఫిబ్రవరి 18న బోర్డు ప్రెసిండెట్స్ ఎలెవన్, ఇంగ్లండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. బోర్డు ప్రెసిండెట్స్ జట్టులో రావి కల్పనతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సబ్బినేని మేఘన ఎంపికయ్యారు. భారత మహిళల వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), జులన్ గోస్వామి, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), రావి కల్పన (వికెట్ కీపర్), మోనా మేశ్రమ్, ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, శిఖా పాండే, మాన్సి జోషి, పూనమ్ రౌత్. -
భారత మహిళల శుభారంభం
గాలె: శ్రీలంకపై వన్డే సిరీస్ సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి టి20లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), తానియా భాటియా (35 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్), అనుజా పాటిల్ (36; 5 ఫోర్లు) చెలరేగడంతో... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. స్మృతి మంధాన (0) తొలి ఓవర్లోనే వెనుదిరగడంతో క్రీజులోకొచ్చిన జెమీమా వచ్చి రావడంతోనే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది. మరో ఓపెనర్ మిథాలీ రాజ్ (17)తో కలిసి రెండో వికెట్‌కు 4 ఓవర్లలో 57 పరుగులు జోడించింది. ఈ క్రమంలో వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్స్‌లు కొట్టిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి అరంగేట్రం మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టింది. రెండో మ్యాచ్ శుక్రవారం కొలంబోలో జరుగనుంది. -
భారత్ ఘనవిజయం
గాలే: తొలి వన్డేలో భారత మహిళల జట్టు శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ఐసీసీ మహిళల చాంపియన్ షిప్లో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థిపై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 35.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జయంగని (33; 2 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా, వీరక్కొడి (26) ఫర్వాలేదనిపించింది. మిగతా వారంతా భారత పేస్, స్పిన్ ఉచ్చులో పడ్డారు. మాన్సి జోషి 3, జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. దీప్తి, హేమలత, రాజేశ్వరిలకు ఒక్కో వికెట్ దక్కింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (76 బంతుల్లో 73 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, పూనమ్ రౌత్ 24 పరుగులు చేసింది. రెండో వన్డే గురువారం ఇక్కడే జరుగుతుంది. ►అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్‌గా జులన్ గోస్వామి చరిత్రకెక్కింది. ►మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మొదటి కెప్టెన్ మిథాలీ రాజ్. ఆమె 118 వన్డేలకు నాయకత్వం వహించింది. -
ట్రోలింగ్‌కు మిథాలీ సూపర్ కౌంటర్!
బెంగళూరు: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇండిపెండెన్స్ డే విషెస్ ఒకరోజు ఆలస్యంగా చెప్పడంతో ఓ నెటిజన్ ఆమెను నిలదీశాడు. దీనికి కారణం చెబుతూ మిథాలీ సూపర్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మిథాలీకి అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. టీ20 మహిళా చాలెంజర్స్ ట్రోర్నీలో బిజీగా ఉన్న మిథాలీ ఒక రోజు ఆలస్యంగా ఇండిపెండెన్స్ విషెస్ తెలియజేస్తూ.. ’ఎందరో వీరులు త్యాగం చేసి.. ఆకలి, పేదరికం, వివక్ష, సెక్సిజం, చీత్కారాల నుంచి మనల్ని కాపాడారు. మనల్ని మనంగా నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. స్వేచ్చగా జీవించేలా చేశారు. వారి త్యాగాలను ఓ సారి స్మరించుకుంటూ వారందరికీ గౌరవ వందనం చేద్దాం. జైహింద్' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఓ నెటిజన్ ’ఇండిపెండెన్స్ డే ముగిసింది మేడమ్.. ఓ సెలబ్రిటీగా మీకిది తగదు’ అని బదులిచ్చాడు. ఈ ట్వీట్‌ను మిథాలీ అదేరీతిలో తిప్పికొట్టారు. 'నాకు సెలబ్రిటీ హోదా ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. 1999 నుంచి నేను క్రీడాకారిణిగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. ప్రస్తుతం నేను చాలెంజర్స్ ట్రోఫీలో ఆడుతున్నాను. మైదానంలో ఉన్నంతసేపు మా వద్ద ఫోన్ ఉండదు. మ్యాచ్ జరిగే సమయంలో నేను ఫోన్ ఉపయోగించను. అందుకే ఆలస్యమైంది. నా ఈ కారణాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు' అని మిథాలీ వివరణ ఇచ్చారు. ఈ వివరణపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. Independence day over https://t.co/8l4daWaafd a celebrity this is not good. — Manoj (@maverick_manoj) August 15, 2018 I'm honored that you think I'm a celebrity. I'm merely an athlete on national duty since 1999. We have the challengers trophy going on and I don't have the phone with me on the field or off it on Match days. Hope that's a good enough reason for the delay? Happy Independence Day. https://t.co/nCJkkXEOyV — Mithali Raj (@M_Raj03) August 16, 2018 :) i dont think anyone else would've replied with this level of grace. You are truly an Inspirational Girl. And absolutely agree, responsibility comes first; your responsibility is playing which you have been doing for decades 🙏 proud of you. — AN. #TeamShreya (@SimbleWriter) August 16, 2018 -
భారత మహిళల క్రికెట్ కోచ్ తుషార్ రాజీనామా
న్యూఢిల్లీ: అప్పుడు పురుషుల జట్టు కోచ్ అనిల్ కుంబ్లే... ఇప్పుడేమో భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ తుషార్ అరోతె... జట్టు సభ్యులను నొప్పించలేక తప్పుకున్నారు. మంగళవారం తుషార్ తన పదవికి రాజీనామా చేశారు. సీనియర్ మహిళా క్రికెటర్లతో విబేధాలే ఆయన దిగిపోవడానికి కారణమని తెలిసింది. తుషార్ శిక్షణపై స్టార్ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, కోచ్‌ను తప్పించాల్సిందేనని పట్టుబట్టడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుషార్‌తో రాజీనామా చేయించింది. ‘వ్యక్తిగత కారణాలతో కోచ్ పదవి నుంచి తుషార్ తప్పుకున్నారు. ఈ అవకాశమిచ్చిన బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. తుషార్ కోచింగ్‌లోనే గతేడాది ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలోనూ వన్డే, టి20 సిరీస్‌లను గెలిచింది. అయితే ఆసియా కప్ టి20 ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన తర్వాత క్రికెటర్లకు కోచ్‌కు మధ్య విబేధాలు పొడసూపాయి. ఇవి తారాస్థాయికి చేరడంతో కోచ్‌ను రాజీనామాతో తప్పించారు. -
వచ్చే ఏడాదే మహిళా క్రికెటర్ల ఐపీఎల్..?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచే మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు (నిర్వహకుల కమిటీ) సీఓఏ చైర్మెన్ వినోద్‌రాయ్ సంకేతాలు ఇచ్చారు. దేశంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ కల్పించేందుకు సీఓఏ చర్యలు తీసుకుంటందన్నారు. సీఓఏ మెంబర్ డయానా ఎడుల్జీ, భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ బౌలర్ జులాన్ గోస్వామిలతో కలిసి భవిష్యత్ షెడ్యూల్ డ్రా తీసినట్లు, త్వరలోనే మహిళల ఐపీఎల్‌ను కూడా చూస్తారని టైమ్స్‌లిట్ కార్యక్రమంలో రాయ్ వ్యాఖ్యానించారు. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును డబుల్ చేశామని, మెన్ క్రికెటర్ల కన్నా వీరికిచ్చే రివార్డులు తక్కువేనన్నారు. మెన్, ఉమెన్ క్రికెటర్లకు సమాన స్థాయిలో మ్యాచ్ ఫీజు అందించలేమన్న ఆయన మెన్ క్రికెట్ రెవెన్యూ ఆదాయం ఎక్కువా అని భవిష్యత్తులో మహిళా క్రికెటర్లు కూడా ఆస్థానం అందుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి భారత మహిళా క్రికెట్లో మార్పు మెదలు కావచ్చన్నారు. ప్రపంచకప్ ఫైనల్ చేరి అందరి మన్ననలు పొందిన మిథాలీసేన.. అనంతరం మ్యాచ్ షెడ్యూల్స్ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ మ్యాచ్‌లున్నా అవి ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో మహిళా క్రికెట్ ఆదరణకు నోచుకోవడం లేదు. -
ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్లలను ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారని, క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్ అన్నారు. సికింద్రాబాద్ కీస్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని అయిన మిథాలీని శుక్రవారం పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అమ్మాయిలకు ఆసక్తి ఉన్న రంగాన్నే కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. తన ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే క్రికెట్లో రాణించానని, వారి ఆదరణ, సహకారం మరవలేనిదని గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే ఈస్థాయికి ఎదిగానని ఆమె చెప్పారు. మహిళలు ఇప్పుడిప్పుడే క్రీడల్లో రాణిస్తున్నారని, భవిష్యత్‌లో ఇది మరింత పెరగాలని ఆకాంక్షించారు. అనంతరం తనకు విద్యాబోధన చేసిన గురువులను మిథాలీరాజ్ సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జ్ఞానశ్రీ, వైస్ ప్రిన్సిపల్ పద్మిని కృష్ణన్, మిథాలీరాజ్ తల్లిదండ్రులు దొరైరాజ్, లీల, పలువురు ఉపా ధ్యాయులు, పూర్వ అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆట మారింది... రాత మారుతుంది!
►భారత మహిళల క్రికెట్‌కు మంచి రోజులు ►వన్డే ప్రపంచకప్‌లో విశేష ప్రతిభ ►ఫైనల్లో ఓడినా... ఆద్యంతం ఆకట్టుకున్నారు సాక్షి క్రీడావిభాగం :టీమిండియా గెలిచింది... విదేశీ గడ్డపై ఘనవిజయం... భారత్‌దే 2011 ప్రపంచకప్... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (2013) మనదే... ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్... ఐసీసీ ‘గద’ మనదే, అగ్రస్థానం మనదే! ఇవన్నీ చెప్పుకుంటూపోతే మన మదిలో మెదిలేది... పెదవి దాటి వచ్చేది పురుషుల క్రికెట్ జట్టు గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అమ్మాయిల జట్టు ఆడుతోంది. ఆ టీమ్ కూడా గెలుస్తోంది. ఇంటా బయటా అమ్మాయిలు రాణిస్తున్నారు. 2005 ప్రపంచకప్ రన్నరప్! అయినా మనకెవరికీ పట్టదు. కానీ... ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. కళ్లు అటువైపు ఫలితాల్ని కూడా వెతుక్కొంటున్నాయి. అమ్మాయిల స్కోర్లపై నెటిజన్ల సెర్చ్ పెరుగుతోంది. బెస్టాఫ్ లక్ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. పోస్ట్‌లు, షేరింగ్ ముంచెత్తుతున్నాయి. అవునా..! నిజమా..! అంటే మీరింకా మేలుకోనట్లే లెక్క. ఎందుకంటే క్రికెట్ పురిటి గడ్డపై వారి జోరు హోరెత్తుతోంది. పవర్ సూపరవుతోంది. అంతలా అదరగొడుతున్నారు. అందర్నీ ఆ‘కట్టి’పడేస్తున్నారు. ఇదంతా భారత మహిళల ప్రతిభ గురించే... ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో మిథాలీ సేన విశేషంగా రాణించింది. అందరూ కలసికట్టుగా ప్రత్యర్థుల్ని మట్టికరిపించారు. సమష్టితత్వంతో కదంతొక్కారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితమే 2005లో మిథాలీ రాజ్ కెప్టెన్సీ లోనే భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. కానీ దురదృష్టం... క్రికెట్ ఓ మతమైన భారత్‌లో ఇది చాలా తక్కువ మందికే తెలుసు. 1983 నుంచి కపిల్ డెవిల్స్ ‘షో’తో పురుషుల క్రికెట్‌ను నెత్తికెత్తుకున్న భారత క్రికెట్ ప్రియులు మహిళల వైపు కన్నెత్తి చూడలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ముఖ్యంగా టీవీల్లో లైవ్ కవరేజ్ లేకపోవడం. మీడియాలో నిరాదరణ. ఆదరణ ఉన్నా.. ఒకటి, అర స్కోర్లకే తప్ప ప్రత్యేక కథనాలు లేకపోవడం. దీంతో ఎవరికంటా పడలేదు. అంతెందుకు ఇప్పుడు ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ను కూడా పూర్తి స్థాయిలో ప్రసారం చేయలేదు. కేవలం కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లే టీవీలో ప్రసారమయ్యాయి. ఇంగ్లండ్‌లో గర్జన... నిజానికి ఈ ప్రపంచకప్‌కు భారత మహిళలు నేరుగా అర్హత సాధించలేదు. క్వాలిఫయింగ్తో మొదలైన ఆట టైటిల్ వేట దాకా సాగింది. హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ జట్టును ముందుండి నడిపించింది. అందరి సమన్వయంతో గెలిపించింది. ఓపెనర్లు పూనమ్ రౌత్, స్మృతి మంధన సహా వేద కృష్ణమూర్తి వరకు ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తమ నిలకడ చూపెట్టారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో లీగ్ మ్యాచ్‌ల్లో ఓపెనర్ పూనమ్ రౌత్ మెరిసింది. ఇంగ్లండ్‌తో పాటు విండీస్‌పై గెలిచేందుకు స్మృతి మెరుపులు తక్కువేం కాదు. శ్రీలంక, దక్షిణాఫ్రికాలతో జరిగిన పోటీల్లో దీప్తి శర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. ఆరంభంలో అంతంతమాత్రంగా ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్ టోర్నీ జరుగుతున్న కొద్దీ సింహస్వప్నంగా తయారైంది. న్యూజిలాండ్‌తో చావోరేవో మ్యాచ్‌లో, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆమెకు వేద కృష్ణమూర్తి శ్రుతి కలిసింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వేద చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ వైనం మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇక బౌలింగ్‌లోనూ భారత అమ్మాయిలు శ్రమించారు. బ్యాట్స్‌మెన్ పడ్డ కష్టానికి తమ వంతు సహకారం అందించారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బౌలింగ్‌లోనూ 12 వికెట్లు తీసింది. పూనమ్ యాదవ్ (11), జులన్ గోస్వామి (10) టాప్–10 బౌలర్ల జాబితాలో ఉన్నారు. ఏక్తా బిష్త్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రాజేశ్వరి గైక్వాడ్ (5/15) అద్భుత ప్రదర్శనతో కివీస్‌ను తిప్పేసింది. హర్మన్‌ప్రీత్, శిఖాపాండేలు కూడా జట్టుకు ఉపయోగపడ్డారు. ఇలా అందరూ ఒక్కటయ్యారు. సమష్టిగా ఫలితాలు సాధించారు. ట్రాక్‌లో పడ్డారిలా... ఈ ప్రపంచకప్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించినా... అంతకుముందు ఘనవిజయాలందుకున్న తీరూ అద్భుతమే. పటిష్టమైన ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో జయకేతనం. దక్షిణాఫ్రికాలాంటి మేటి జట్టు ఆడిన నాలుగు దేశాల టోర్నీలో విజేత. ఆసియా కప్‌లో ఎదురులేని వైనం. ఇవన్నీ కూడా భారత మహిళల జట్టు ప్రగతి సోపానాలే కానీ... ప్రత్యక్ష ప్రసారం లేకే చూడలేకున్నాం. గతంలో భారత మహిళల క్రికెట్ సంఘం బీసీసీఐలో భాగం కాదు. దీంతో మ్యాచ్ ఫీజులు అంతంత మాత్రమే. టోర్నీల్లో గెలిచినా ప్రైజ్‌మనీ అరకొరే. ఇలాంటి పరిస్థితుల మధ్య భారత జట్టు వెలుగులోకి వచ్చిందంటే కఠోరమైన వారి కృషి, పట్టుదల వల్లే! ఐసీసీ సూచనల మేరకు బీసీసీఐ గొడుగుకిందకు వచ్చాక మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం. పర్యటనలు, టోర్నీలు క్రమపద్ధతిలో ఉండటం వల్ల మ్యాచ్‌లు క్రమంగా పెరిగాయి. దీంతో ఆడే అవకాశంతో పాటు ఆటలో స్థిరత్వం పెరిగింది. అది ఇప్పుడు ఇంగ్లండ్‌లో స్పష్టంగా కనపడుతోంది. -
నంబర్‌వన్ కు చేరువలో..
దుబాయ్: భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ లో నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకునేందుకు అతి కొద్ది దూరంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో మిథాలీ రాజ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలోటాప్ కు చేరడానికి ఐదు పాయింట్ల దూరంలో నిలిచింది మిథాలీ. ప్రస్తుతం 774 రేటింగ్ పాయింట్లతో మిథాలీ రెండోస్థానంలో నిలిచింది. మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో మిథాలీ ఆకట్టకుంది. అంతకుముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. తద్వారా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని నంబర్ వన్ కు చేరువగా వచ్చింది. నంబర్ వన్ ర్యాంకులో నిలవడానికి కేవలం ఐదు పాయింట్ల దూరంలో మిథాలీ నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (779) టాప్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే, మిగతా భారత మహిళా క్రికెటర్లు ఎవరూ టాప్-10లో నిలవక పోవడం గమనార్హం. -
భారత్‌ను గెలిపించిన మిథాలీ
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే బెంగళూరు: మిథాలీ రాజ్ (88 బంతుల్లో 81 నా టౌట్; 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయాలకు బ్రేక్ పడింది. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై నెగ్గింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 49.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సోఫీ డెవిన్ (102 బంతుల్లో 89; 10 ఫోర్లు; 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. నిరంజన, రాజేశ్వరిలకు మూడేసి వికె ట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన భారత్ 44.2 ఓవర్లలో రెండు వికెట్లకు 221 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ స్మృతి మందానా (99 బంతుల్లో 66; 8 ఫోర్లు)తో కలిసి మిథాలీ రెండో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (25 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగంగా ఆడింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమానంగా ఉన్నాయి. చివరి వన్డే బుధవారం ఇదే వేదికపై జరుగుతుంది. తన సూపర్ ఆటతీరుతో ఆకట్టుకున్న మిథాలీ మహిళల వన్డే చరిత్రలో 5 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌వుమన్‌గా.. తొలి భారత క్రికెటర్‌గా నిలిచింది. తొలి స్థానంలో చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) కొనసాగుతోంది. భారత గడ్డపై 221 పరుగుల లక్ష్యఛేదన ఏ జట్టుకైనా ఇదే తొలిసారి కావడం విశేషం.