
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు చివరిసారి 2014 నవంబర్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఇంకా చెప్పాలంటే 1976 నుంచి మన మహిళల జట్టు ఆడిన టెస్టుల సంఖ్య 36 మాత్రమే. వన్డేలు, ఆ తర్వాత టి20ల హోరులో మహిళల టెస్టు అనేదే వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు సుమారు ఏడేళ్ల విరామం తర్వాత మన జట్టు టెస్టు మ్యాచ్ బరిలోకి దిగనుంది. రాబోయే జూన్/జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌తో వారి గడ్డపై ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడుతుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సంతోషకర విషయాన్ని వెల్లడిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం ప్రకటించారు. ఇంగ్లండ్ టీమ్ స్వదేశీ సీజన్ షెడ్యూల్‌పై మరింత స్పష్టత వచ్చిన తర్వాత టెస్టు మ్యాచ్ తేదీలు ఖరారవుతాయి. 2014లో మైసూరులో దక్షిణాఫ్రికాతో తమ చివరి టెస్టు ఆడిన భారత్ ఇన్నింగ్స్, 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో మహిళల టెస్టులు దాదాపుగా అంతరించిపోయాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే అప్పుడప్పుడు ఈ సంప్రదాయ ఫార్మాట్‌లో ఆడుతున్నాయి. 2015 ఆగస్టు నుంచి 6 టెస్టులు మాత్రమే జరగ్గా... ఇవన్నీ ఆసీస్, ఇంగ్లండ్ మధ్యే నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment