
మాంచెస్టర్: వెస్టిండీస్‌పై రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ మూడో రోజు శనివారం వాన కారణంగా ఆట పూర్తిగా రద్దయింది. ఉదయంనుంచి కురిసిన వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో నిర్ణీత సమయంకంటే ఆట ఆలస్యంగా ప్రారంభం కావచ్చని అనిపించింది. అయితే మరోసారి వాన రావడంతో అది సాధ్యం కాలేదు. కొంత తగ్గినట్లు అనిపించినా...విరామం లేకుండా కురిసిన చినుకులతో ఒక్క బంతి కూడా వేసే అవకాశం లేకపోయింది.
ఐదు గంటలకు పైగా వేచి చూసిన అంపైర్లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 469 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. మూడో రోజు ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించే అవకాశం ఇంగ్లండ్ కోల్పోయింది. తొలి టెస్టు నెగ్గిన విండీస్ ప్రస్తుతం 1–0తో ముందంజలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment