
మాంచెస్టర్: ఇంగ్లండ్ చేతికొచ్చిన మ్యాచ్‌పై చినుకులు పడ్డాయి. అలా... ఆఖరి టెస్టులో ఓటమికి సిద్ధమైన దశలో వెస్టిండీస్‌కు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట పూర్తిగా రద్దయింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానమంతా చిత్తడిగా మారడంతో ఒక్క బంతి వేయడం కూడా సాధ్యం కాలేదు. రోజంతా వాన అంతరాయం కలిగించగా... అంపైర్లు పలుమార్లు అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించారు. అయితే ఏ దశలోనూ మ్యాచ్ జరిగేలా కనిపించలేదు.
ఇక చేసేదిలేక భారత కాలమానం ప్రకారం రా.8.40 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 399 పరుగుల ఛేదనలో విండీస్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. విండీస్ బ్యాటింగ్ బలహీనతను బట్టి చూస్తే రెండు రోజులు క్రీజ్‌లో నిలబడటం అసాధ్యంగా కనిపించింది. ఇప్పుడు ఒక రోజంతా వాన బారినపడటం జట్టుకు ఊరట కలిగించింది. ఇక చివరి రోజు మంగళవారం తమ 8 వికెట్లను కాపాడుకొని విండీస్ డ్రా చేసుకోగలదా అనేది ఆసక్తికరం. మరో రోజు కూడా వరుణుడు వారికి అండగా నిలిస్తే విజ్డన్ ట్రోఫీని హోల్డర్ సేన నిలబెట్టుకుంటుంది.