కరోనా మహమ్మారిని ఏమార్చి ఎట్టకేలకు ప్రపంచానికి ‘ప్రత్యక్ష’ంగా’ క్రికెట్ చూపించిన ఇంగ్లండ్‌లో అంచనాలకు మించి రాణించిన వెస్టిండీస్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. ఆఖరి రోజు మొదట ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ రసవత్తరానికి తెరలేపినా... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జెర్మయిన్ బ్లాక్‌వుడ్ పోరాటం చివరకు విండీస్‌నే విజయం వరించేలా చేసింది. దీంతో ఆట ఆరంభం మినహా మ్యాచ్ ముగిసేదాకా ఎలాంటి నాటకీయత లేకుండా తొలి టెస్టులో వెస్టిండీస్ విజయబావుటా ఎగరేసింది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్లు తీసిన విండీస్ బౌలర్ గాబ్రియెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో విండీస్ మూడు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సిరీస్‌లోని రెండో టెస్టు ఈనెల 16 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది.
సౌతాంప్టన్: తొలి టెస్టులో మొదటి రోజు మినహా ప్రతీ రోజూ పైచేయి సాధించిన వెస్టిండీసే విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 64.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఆర్చర్ (3/45) దెబ్బకు ఆఖరి మజిలీ రసవత్తరం అవుతుందనుకుంటే... జెర్మయిన్ బ్లాక్‌వుడ్ (154 బంతుల్లో 95; 12 ఫోర్లు) ఆ అవకాశమివ్వలేదు. చేజ్, డౌరిచ్‌లతో కలిసి రెండు విలువైన భాగస్వామ్యాలతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో అతను ఔటైనా... రిటైర్డ్‌హర్ట్ అయిన ఓపెనర్ క్యాంప్‌బెల్ తిరిగొచ్చి ఆ లాంఛనం కానియ్యడంతో సిరీస్‌కు ఫలితంతో ముందడుగు పడింది. పేలవమైన ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుంది.
విండీస్ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన బ్లాక్‌వుడ్ వ్యక్తిగత స్కోరు 5, 20, 29 పరుగులవద్ద ఉన్నపుడు ఇచ్చిన క్యాచ్‌లను ఇంగ్లండ్ ఫీల్డర్లు జారవిడిచారు. లేదంటే తుది ఫలితం మరోలా ఉండేదేమో! ఆట చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 284/8తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 29 పరుగులు జోడించి 313 పరుగుల వద్ద ఆలౌటైంది. విండీస్‌కు 200 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఆర్చర్ (23; 4 ఫోర్లు), మార్క్‌వుడ్ (2) ఇద్దరినీ గాబ్రియెలే ఔట్ చేశాడు. దీంతో అతనికి ఈ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు దక్కాయి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో అతను 9 వికెట్లు పడగొట్టాడు.
ఆర్చర్ అదరగొట్టినా...
వెస్టిండీస్ విజయలక్ష్యం సరిగ్గా 200 పరుగులు. ఇదేమీ భారీ లక్ష్యం కాదు. విండీస్‌కు అసాధ్యమైందీ కాదు. కానీ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ టాపార్డర్‌పై నిప్పులు చెరిగాడు. తన వరుస ఓవర్లలో బ్రాత్‌వైట్ (4)ను క్లీన్‌బౌల్డ్... బ్రూక్స్ (0)ను డకౌట్ చేశాడు. 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన విండీస్‌పై మార్క్‌వుడ్ మరో దెబ్బ వేశాడు. హోప్ (9)ను సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేర్చాడు. విండీస్ స్కోరు 27/3. ఓపెనర్ క్యాంప్‌బెల్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో టెస్టుపై రస‘పట్టు’ పెంచుకునే పనిలో స్టోక్స్ బృందం నిమగ్నమైంది. లక్ష్యం చిన్నదైనా ఆట రసకందాయంలో పడింది.
పరుగు... పరుగు పేర్చుతూ...
లంచ్ బ్రేక్ స్కోరు 35/3 కష్టాల్లో పడేయడంతో క్రీజులో ఉన్న చేజ్ (88 బంతుల్లో 37; 1 ఫోర్), బ్లాక్‌వుడ్‌లకు పరిస్థితి అర్థమైంది. లక్ష్యం చేరాలంటే వికెట్ల నిర్లక్ష్యం తగదని భావించారు. బాధ్యతగా పరుగు పరుగు పేర్చారు. అంతకంటే ముందు ఎవరూ పట్టుమని పది పరుగులైనా చేయకుండానే పెవిలియన్‌లో కూర్చుకున్నారు. కానీ వీరిద్దరు కలిసి జట్టు స్కోరును 100 పరుగులకు తీసుకెళ్లారు. అయితే అదేస్కోరు వద్ద ఆర్చర్... చేజ్‌ను ఔట్ చేశాడు 73 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అయినా నిరాశ చెందకుండా లక్ష్యంపైనే గురిపెట్టిన బ్లాక్‌వుడ్ కీపర్ డౌరిచ్‌ను జత చేసుకున్నాడు. తను అర్ధసెంచరీ పూర్తిచేశాడు. ఈ జోడీ నిలబడటంతో రెండో సెషన్ స్కోరు 143/4 జట్టులో విశ్వాసాన్ని పెంచింది.
కలవరమైనా...
డౌరిచ్ (37 బంతుల్లో 20; 1 ఫోర్) చేసింది తక్కువ స్కోరే. కానీ బ్లాక్‌వుడ్‌తో కలిసి జతచేసింది విలువైన భాగస్వామ్యం. ఇద్దరు ఐదో వికెట్‌కు 68 పరుగులు జోడించాక డౌరిచ్‌ను స్టోక్స్ ఔట్ చేశాడు. అదే స్టోక్స్ కాసేపయ్యాక సెంచరీకి చేరువవుతున్న బ్లాక్‌వుడ్ ‘షో’ను ముగించేశాడు. అప్పటికి వెస్టిండీస్ స్కోరు 189/6. గెలుపు వాకిట కొంత కలవరపాటుకు గురైనా... ఓపెనర్ క్యాంప్‌బెల్ (8 నాటౌట్; 1 ఫోర్) తిరిగి క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ హోల్డర్ (14 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి కంగారు పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశాడు.
గత 20 ఏళ్లలో ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం వెస్టిండీస్‌కిది మూడోసారి మాత్రమే. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై వెస్టిండీస్‌కిది 58వ టెస్టు విజయం.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 204; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 318; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 313
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (బి) ఆర్చర్ 4; క్యాంప్‌బెల్ (నాటౌట్) 8; హోప్ (బి) వుడ్ 9; బ్రూక్స్ (ఎల్బీ) (బి) ఆర్చర్ 0; చేజ్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 37; బ్లాక్‌వుడ్ (సి) అండర్సన్ (బి) స్టోక్స్ 95; డౌరిచ్ (సి) బట్లర్ (బి) స్టోక్స్ 20; హోల్టర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (64.2 ఓవర్లలో ఆరు వికెట్లకు) 200.
వికెట్ల పతనం: 1–7, 2–7, 3–27, 4–100, 5–168, 6–189.
బౌలింగ్: అండర్సన్ 15–3–42–0; ఆర్చర్ 17– 3–45–3; వుడ్ 12–0–36–1; బెస్ 10–2–31–0; స్టోక్స్ 10.2–1–39–2.
Comments
Please login to add a commentAdd a comment