మాంచెస్టర్: వెస్టిండీస్ చేతిలో తొలి టెస్టు ఓటమి తర్వాత రెండో టెస్టును ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. మ్యాచ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. డామ్ సిబ్లీ (253 బంతుల్లో 86 బ్యాటింగ్; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (159 బంతుల్లో 59 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 126 పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో ఛేజ్‌కు 2 వికెట్లు దక్కాయి.
రెండు బంతుల్లో 2 వికెట్లు...
వర్షం కారణంగా తొలి రోజు ఆట గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంగ్లండ్ ఓపెనర్లు బర్న్స్ (15), సిబ్లీ తడబడుతూనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కొద్ది సేపటికే స్పిన్నర్ ఛేజ్‌తో బౌలింగ్ చేయించిన విండీస్ వ్యూహం ఫలించింది. ఛేజ్ తన తొలి ఓవర్లోనే బర్న్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వెంటనే లంచ్‌ను ప్రకటించగా... ఆ సమయానికి ఇంగ్లండ్ 13.2 ఓవర్లలో 29 పరుగులు చేసింది. అయితే విరామం తర్వాత ఆతిథ్య జట్టుకు మరో షాక్ తగిలింది.
తొలి బంతికే జాక్ క్రాలీ (0) లెగ్‌స్లిప్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. అయితే స్కోరు 29/2గా ఉన్న దశనుంచి రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఇంగ్లండ్‌ను ఆదుకున్నాయి. ముందుగా సిబ్లీ, కెప్టెన్ జో రూట్ (23) కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. తొలి టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పేసర్ గాబ్రియెల్ 7 ఓవర్లు మాత్రమే వేసి గజ్జల్లో గాయంతో కొద్ది సేపు తప్పుకోవడం విండీస్ బౌలింగ్‌ను బలహీనపర్చింది. అయితే జోసెఫ్ అల్జారి చక్కటి అవుట్‌స్వింగర్‌తో రూట్‌ను అవుట్ చేయడంతో 52 పరుగుల మూడో వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెర పడింది.
శతక భాగస్వామ్యం...
టీ విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 112 పరుగులకు చేరింది. మూడో సెషన్ మొదలయ్యాక సిబ్లీ 164 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సిబ్లీ, స్టోక్స్ కలిసి చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు. పట్టుదలగా ఆడి క్రీజ్‌లో పాతుకుపోయిన వీరిద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. 68 పరుగుల వద్ద సిబ్లీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో హోల్డర్ జారవిడవగా...కొద్ది సేపటికే 119 బంతుల్లో స్టోక్స్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం ఈ జోడీని విడదీసేందుకు విండీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment